Thursday, August 27, 2026
E-PAPER
Homeఆటలువిజయం ఊరిస్తోంది!

విజయం ఊరిస్తోంది!

- Advertisement -

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 290/10, ఫాలోఆన్‌‌లో 229/6
ఫాలోఆన్‌‌తో చెమటోడ్చిన భారత బౌలర్లు
భారత్‌, శ్రీలంక రెండో టెస్టు నాల్గో రోజు

కొలంబో టెస్టులో టీమ్‌ ఇండియా గెలుపు దిశగా సాగుతోంది!. వర్షం ప్రభావిత టెస్టులో 213 పరుగుల ఆధిక్యంతోనే ఆతిథ్య జట్టును ఫాలోఆన్‌ ఆడించిన భారత్‌.. బౌలర్లకు కఠిన సవాల్‌ ఇచ్చింది. యువ బ్యాటర్లు పసిందు సూర్యబండార (92), కామిందు మెండిస్‌ (55) అర్థ సెంచరీలతో భయపెట్టినా.. బౌలర్లు మళ్లీ మ్యాచ్‌‌ను చేతుల్లోకి తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌ ‌లోటు భర్తీ చేసి, 16 పరుగుల ముందంజలో నిలిచిన శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. ఉదయం సెషన్లో శ్రీలంకను ఆలౌట్‌ ‌చేస్తే 2-0తో టెస్టు సిరీస్‌ ‌భారత్‌ ‌సొంతం కానుంది.

నవతెలంగాణ-కొలంబో
భారత్‌, శ్రీలంక రెండో టెస్టు నాలుగో రోజు నాటకీయంగా సాగింది. ఫాలోఆన్‌‌తో తొలుత భారత్‌ ఒత్తిడి పెంచినా.. బ్యాటర్ల దీటు జవాబుతో గిల్‌‌సేన ఆందోళనకు గురైంది. కానీ ఆఖర్లో మళ్లీ వికెట్ల వేటతో శుభ్‌‌మన్‌‌సేన విజయంపై కన్నేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌‌లో 290 పరుగులకు ఆలౌట్‌ ‌కాగా.. భారత్‌ 213 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో భారత్‌ ‌శ్రీలంకను ఫాలోఆన్‌ ఆడించింది. ఫాలోఆన్‌‌లో పసిందు సూర్యబండార (92, 173 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), కామిందు మెండిస్‌ (55, 92 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అర్థ సెంచరీలతో ఆతిథ్య జట్టును గట్టెక్కించేలా కనిపించినా.. భారత్‌ ‌పుంజుకుంది. నాల్గో రోజు వర్షం అంతరాయంతో ఆట నిలిచిపోయే సమయానికి 6 వికెట్లు పడగొట్టింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ‌లోటు అధిగమించి, అదనంగా మరో 16 పరుగులు చేసింది.

​పసిందు.. భలే నిలిచాడు
213 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ‌లోటుతో బ్యాట్‌ ‌పట్టిన శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ ‌లహిరు ఉదార (3) వికెట్‌‌ను కోల్పోయింది. ఈ దశలో కామిల్‌ ‌మిశార (32)తో జతకట్టిన పసిందు సూర్యబండార (92) విలువైన 58 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. మిశార నిష్ర్కమించినా, కామిందు మెండిస్‌ (55)‌తో కలిసి 115 పరుగులు జోడించారు. 83/2తో లంచ్‌ ‌విరామానికి వెళ్లిన శ్రీలంక.. రెండో సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మానవ్‌ ‌సుతార్‌‌ను సూర్యబండార స్వీప్‌, రివర్స్‌‌స్వీప్‌ ‌షాట్లతో ఎదుర్కొగా.. పేసర్ల ఫుల్‌ ‌లెంగ్త్‌, షార్ట్‌ ‌బాల్స్‌‌ను సమర్థవంతంగా ఆడాడు. దీంతో రెండో సెషన్లో వికెట్‌ ‌కోసం బౌలర్లు చెమటోడ్చారు. ఏడు ఫోర్లతో సూర్యబండార అర్థ సెంచరీ సాధించగా.. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 బంతుల్లో మెండిస్‌ ‌ఫిఫ్టీ నమోదు చేశాడు. సెంచరీ భాగస్వామ్యంతో ఈ జోడీ భారత బౌలర్లను పరీక్షించింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీకి ప్రసిద్‌ ‌కృష్ణ విడదీశాడు. షార్ట్‌ ‌బాల్‌‌తో మెండిస్‌‌ను ప్రసిద్‌ ‌మాయ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్‌ ‌ధనంజయ డిసిల్వ (23), నిరోశన్‌ ‌డిక్వెలా (6) వెన్వెంటనే పెవిలియన్‌ ‌బాట పట్టారు. సెంచరీ దిశగా సాగుతున్న సూర్యబండారకు సుతార్‌ ఊరించే బంతిని సంధించగా.. పంత్‌ ‌చూడచక్కని స్టంపౌట్‌ ‌చేశాడు. పసిందు వికెట్‌తో మ్యాచ్‌‌పై భారత్‌ ‌మళ్లీ పట్టు బిగించింది. సోనల్‌ ‌దినుశ (7 నాటౌట్‌), కేశర నువాంత (3 నాటౌట్‌) ఎనిమిదో వికెట్‌‌కు అజేయంగా 11 పరుగులు జోడించారు. టెయిలెండర్లు ప్రభాత్‌ ‌జయసూర్య, లహిరు కుమార, అషిత ఫెర్నాండోలు బ్యాటింగ్‌‌కు రావాల్సి ఉంది. వరుసగా 150 ప్లస్‌ ఓవర్లు వేసిన భారత బౌలర్లు.. విశ్రాంతి అనంతరం ఉదయం సెషన్లోనే చివరి నాలుగు వికెట్లు పడగొడితే టీ సెషన్‌‌కు ముందే టెస్టు సిరీస్‌ ‌2-0తో టీమ్‌ ఇండియా సొంతం కానుంది.

​స్కోరు వివరాలు
భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ : 503/9 డిక్లేర్డ్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ : 290/10
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ (‌ఫాలోఆన్‌) : లహిరు కుమార (సి) జైన్‌ (‌బి) మహ్మద్‌ ‌సిరాజ్‌ 3, కామిల్‌ ‌మిశార (ఎల్బీ) జడేజా 32, పసిందు సూర్యబండార (స్టంప్డ్‌) ‌రిషబ్‌ ‌పంత్ (బి) సుతార్‌ 92, కామిందు మెండిస్‌ (‌సి) గిల్‌ (‌బి) ప్రసిద్‌ 55, ధనంజయ డిసిల్వ (సి) పడిక్కల్‌ (‌బి) సుతార్‌ 23, సోనల్‌ ‌దినుశ నాటౌట్‌ 7, నిరోశన్‌ ‌డిక్వెలా (ఎల్బీ) జైన్‌ 6, కేశర నువాంత నాటౌట్‌ 3, ఎక్స్‌‌ట్రాలు : 8, మొత్తం : (72.4 ఓవర్లలో 6 వికెట్లకు) 229.

వికెట్ల పతనం : 1-5, 2-63, 3-178, 4-209, 5-212, 6-218.
బౌలింగ్‌ : ప్రసిద్‌ ‌కృష్ణ 10-1-31-1, మహ్మద్‌ ‌సిరాజ్‌ 9-4-11-1, మానవ్‌ ‌సుతార్‌ 18-2-81-2, సరాంశు జైన్‌ 17.4-3-55-1, రవీంద్ర జడేజా 18-2-48-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -