Thursday, August 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంముంచుకొస్తున్న అప్పు సంక్షోభం

ముంచుకొస్తున్న అప్పు సంక్షోభం

- Advertisement -

​ఇంధన ముప్పు ముగియలేదు
​వాషింగ్టన్‌
: జలసంధి దిగ్బంధనంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ముప్పు అంచున ఉంది. ఇంధన సరఫరాలకు ఏర్పడిన విఘాతం అంతర్జాతీయంగా చమురు మంటలను రాజేస్తుండటంతో రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని మునుపెన్నడూ లేనంత భారీ సంక్షోభం చుట్టుముట్టబోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఘాటుగా హెచ్చరించింది. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, భరించలేని పన్నుల భారం, కొండలా పేరుకుపోతున్న ప్రభుత్వ అప్పులు రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక గమనాన్ని మరింత గందరగోళంలోకి నెట్టేయనున్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వారం జరగనున్న జీ-20 ఆర్థిక మంత్రుల కీలక సమావేశానికి ముందు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. కృత్రిమ మేధా (ఏఐ) రంగంలో వస్తున్న పెట్టుబడులు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఇంధన విఘాతం వల్లే అత్యధికంగా నష్టం వాటిల్లిందన్నారు.

ఇంధన సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని తెలిపారు. ఏదైనా కారణంతో చమురు ధరలు మళ్లీ ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పే ప్రమాదం ఉందని జార్జియేవా హెచ్చరించారు. చమురు ధరలతో ద్రవ్యోల్బణం మరింత ఎగిసిపడితే కేంద్ర బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఎక్కువకాలం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. జూన్‌ మధ్యకాలం నుంచి ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80–90 డాలర్ల పరిధిలో కొనసాగుతున్నాయి. అంతక్రితం నమోదైన సుమారు 118 డాలర్ల గరిష్ఠ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ.. సరఫరా అంతరాయాలు కొనసాగితే మళ్లీ ధరలు పెరిగే అవకాశముందని తెలిపారు.

భరించలేని అప్పుల భారం..
అధిక వడ్డీ రేట్లు ఎక్కువకాలం కొనసాగితే ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులపై రుణ నిర్వహణ వ్యయం పెరుగుతుందనీ,. దీంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంటుందని జార్జీవా అన్నారు. దేశాల ప్రభుత్వ రుణాలు, వడ్డీ చెల్లింపుల భారం విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. ముఖ్యంగా అమెరికా విస్తరిస్తున్న ఆర్థిక లోటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోందన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలపై ఈ భారం మరింత తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో కేంద్ర బ్యాంకులకు కూడా పరిమితులు ఏర్పడతాయని జార్జీవా పేర్కొన్నారు. ఇది అప్పులు తీర్చే సామర్థ్యాన్ని దెబ్బతీసి ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేస్తుందని హెచ్చరించారు. అమెరికా బాండ్ రాబడులు గత 19 ఏండ్లలో లేనంత గరిష్ఠ స్థాయికి చేరడం, దేశాల లోటు బడ్జెట్‌లు పెరిగిపోవడం రాబోయే కాలంలో రానున్న పెద్ద ఆర్థిక ముప్పునకు సంకేతాలని విశ్లేషించారు.

ఉద్రిక్తతలు ముదిరితే ఛిన్నాభిన్నమే.!
ప్రస్తుతం ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉన్నప్పటికీ.. ఏ క్షణంలోనైనా ఇవి మళ్లీ భగ్గుమనే అవకాశం ఉందని జార్జీవా తెలిపారు. ఇప్పటికే అనేక దేశాలు నిల్వ ఉన్న గ్యాస్, చమురు ఆధారంగా నెట్టుకొస్తున్నాయని, శీతాకాలం సమీపిస్తుండటంతో నిల్వలు తరిగిపోయి ఇంధన కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారితే అంతర్జాతీయ వృద్ధి అంచనాలు భారీగా పడిపోతాయని అంచనా వేశారు. నిష్పక్షపాత విధానాలు పాటించకపోతే వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదముందని ఐఎంఎఫ్ ఎండీ హెచ్చరించారు. ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. అధిక ప్రభుత్వ రుణభారాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

ఉద్రిక్తతలతో వృద్ధి కష్టం
వాణిజ్య లోటు, మిగులు, వాణిజ్య విధానాల్లో పరస్పర విభేదాలు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఉద్రిక్తతలను పెంచుతున్నాయని జార్జీవా తెలిపారు. మరింత సమతుల్యమైన ఆర్థిక విధానాలు ప్రపంచ వృద్ధిని బలోపేతం చేయగలిగినప్పటికీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విభజన సవాలుగా మారుతోందన్నారు. చమురు ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగడం, ప్రభుత్వ రుణాలు పెరగడం వంటి అంశాలు భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారే అవకాశముందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత విభజనకు గురవుతున్న సమయంలో సమతుల్యమైన వృద్ధి సాధించడం కష్టమవుతోందని తెలిపారు. ఇంధన సరఫరా పరిస్థితులను నిశితంగా గమనిస్తూ.. ద్రవ్య, విత్త విధానాల్లో సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గల్ఫ్ ఇంధన సంక్షోభం, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఐఎంఎఫ్ తన 2026 ప్రపంచ వృద్ధి అంచనాను 3 శాతానికి తగ్గించింది. వృద్ధి మందగించే ప్రమాదం ఉన్నప్పటికీ ధరల స్థిరత్వంపైనే కేంద్ర బ్యాంకులు పూర్తి దృష్టి సారించాలని ఐఎంఎఫ్‌ ‌చీఫ్‌ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -