-మారుతున్న రాజకీయ సమీకరణాలు
-గులాబీ వైపు నేతల కదలికలు, కాంగ్రెస్కు గండం?
-జీవన్ రెడ్డి నిర్ణయంతో సమీకరణాల్లో మార్పులు
నవతెలంగాణ-రాయికల్
రాయికల్ పట్టణ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి.ఒకప్పుడు బలమైన స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ,ఇప్పుడు స్థానికంగా క్యాడర్ కోల్పోతుందా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన రాజకీయ వైఖరితో చర్చనీయాంశంగా మారారు.తాను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ మారలేదని చెబుతూనే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించడం రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆశను కలిగించగా,మరోవైపు స్థానిక స్థాయిలో అయోమయాన్ని కూడా పెంచుతున్నాయి.
ఇదే సమయంలో మాజీమంత్రి జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం స్థానిక రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడం ద్వారా ఆయన బీఆర్ఎస్లో చేరడం కీలక పరిణామంగా మారింది.ఈ పరిణామం కేవలం వ్యక్తిగత రాజకీయ మార్పు మాత్రమే కాకుండా,ఆయనతో అనుబంధం ఉన్న క్యాడర్ను కూడా ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాయికల్ మండలంలో జీవన్ రెడ్డి వర్గం గణనీయంగా ఉండటంతో,ఆ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే గులాబీ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో పట్టణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మరింత బలోపేతం కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పరిశీలిస్తే, గతంలో మండల అధ్యక్షుడిగా ఉన్న రవీందర్ రావు వర్గం,ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మరో కీలక అంశంగా మారింది.ఇది కాంగ్రెస్లో ఉన్న విభేదాలను బహిర్గతం చేస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పడం,మరోవైపు స్థానిక నేతలు వేరే దిశలో కదలడం పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తోంది.
ఇదిలా ఉండగా,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత అనిశ్చితిని కలిగించాయి.ఆయన వైఖరి పట్ల కొందరు బీఆర్ఎస్ నాయకులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.దీంతో ఆయన వెంట నడవాలా లేదా అనే సందిగ్ధత నెలకొంది.అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీకి మళ్లీ ఊపొచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాయికల్ పట్టణంలో ఒక ప్రత్యేక రాజకీయ వాతావరణం నెలకొంది.ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా,మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కొత్తగా చేరుతున్న నాయకులతో బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది.ఈ నేపథ్యంలో స్థానిక రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.
ఇక ముందున్న రోజుల్లో రాయికల్ రాజకీయాలు ఏ దిశగా సాగుతాయి? కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని నిలబెట్టుకుంటుందా? లేక గులాబీ దళం పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లోనే తెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం పట్టణ రాజకీయాలను పూర్తిగా మార్చే సూచనలు ఇస్తున్నాయి.



