నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రజలు అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కంతి మధు సూచించారు. ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని అన్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే పెద్ద వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందులు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, ముఖ్యంగా పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామంలో ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన చికిత్స అందించారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పెండ్యాల నాగరాజు, డాక్టర్ హైమావతి, ఏఎన్ఎం అనుజ, ఆశా వర్కర్ సరిత శ్రీలత మరియు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



