Saturday, April 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిశ్వాసమా! వివక్షా?

విశ్వాసమా! వివక్షా?

- Advertisement -

దేశంలోని ఆలయాలు, ప్రార్థనాస్థలాల్లోకి నిషేధాజ్ఞలపై సుప్రీం కోర్టులో గత జరుగుతున్న విచారణ దేశవ్యాప్తంగా కీలకమైన చర్చకు దారితీసింది. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగాలా? లేదంటే రాజ్యాంగ సూత్రాలను నిలబెట్టాలా?-అన్న మౌలిక ప్రశ్నల మధ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య మూలాల్ని మరోసారి గుర్తుచేశాయి. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో విశ్వాసాల పేరుతో ఆంక్షలపర్వం అంతరాలను పెంచుతుందని, ఫలితంగా ఇది హిందూ మతంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని కోర్టు పేర్కొంది. ‘శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్ష’ కేసులో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం అనేక అంశాలను లేవనెత్తుతోంది. ‘మహిళల శరీరధర్మాలను ఆచారాలకు ముడిపెట్టి ఆంక్షలు విధించడం సమంజ సమేనా?’ అన్న జస్టిస్‌ బి.వి.నాగరత్న వ్యాఖ్యల ఆధారంగా విచారణ సాగుతోంది. తుది తీర్పు వెలువడ కున్నా ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా మహిళలపై వివక్ష ఉండకూ డదని, విశ్వాసాల పేరుతో వారిని ‘పరిమితం’ చేయకూడదనే మౌఖిక అభిప్రా యం వ్యక్తమైంది. అయినప్పటికీ కొన్ని శక్తులు, సంస్థలు ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తూ, మత విశ్వాసాలను భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం శోచనీయం.

విచారణలో ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా ముందుకొచ్చాయి. ఒకటి, సంప్ర దాయాల పేరుతో మహిళల ప్రవేశంపై విధించిన ఆంక్షలు. రెండు, వాటిని సమర్థిస్తూ కేంద్రం చేసిన వాదనలు. ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదన హేతుబద్ధంగా లేకపోవడం అనేక విమర్శలకు గురైంది. శబరిమల ఆచారాలు ప్రత్యేకమని, ఆచార, విశ్వాసాలకు కట్టుబడి ఉండాలన్న ధోరణి సమాజ సమానత్వాన్ని దెబ్బతీస్తోంది. దేశంలోని కొన్ని ఆలయాల్లో పురుషులకు కూడా అనుమతిలేదని వాదించడం, ”న్యాయమూర్తులు చట్టంలో నిపుణులు, మతంలో కాదు” అని కోర్టు జోక్యాన్ని ప్రశ్నించడం, రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోవడమే అవుతుంది. పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి వెళ్లకూడదనే నియమం సహజ శరీర ప్రక్రియలను అపవిత్రంగా చూడటమే తప్ప మరొకటికాదు. ఇది శాస్త్రీయంగా, మానవీయంగా, రాజ్యాంగ పరంగా కూడా నిలబడలేని వాదన. ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని గట్టిగా ప్రస్తావించింది. ”మహిళల సహజ శరీర ధర్మాలను అపవిత్రంగా చూడటం ఎలా సమంజసం” అని ప్రశ్నించడం ద్వారా ఆచారాల వెనుక అణచివేత భావజాలాన్ని బహిర్గతం చేసింది.

ఈ నేపథ్యంలో కేరళలో గతంలో జరిగిన పరిణామాలు కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2018లో సుప్రీంకోర్టు మహిళలపై ఉన్న నిషేధాన్ని రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వామపక్ష ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం రాజ్యంగబద్ధ నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నించగా బీజేపీ, ఆరెస్సెస్‌, సంఫ్‌ు పరివార్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ అంశాన్ని భావోద్వేగాలతో అంటకట్టి ప్రజల్ని ఏమార్చి ఆందోళనలు చేపట్టి హింసాత్మక ఘటనలకు తెరదీసింది. మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం ద్వారా ‘హిందూ ఐక్యత’ పేరుతో విభజన సృష్టించడం, ఐక్యతకు బదులు అసమానతను పెంచింది. దీంతో అక్కడి లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసినా సామర స్యాన్ని కాపాడుతూనే అక్కడి అననుకూలతను సర్కార్‌ సరిదిద్దుకుంటూ వచ్చింది. ఇది కేవలం మత విశ్వాస రక్షణ కాదని, ఒక రాజకీయ వ్యూహంలో భాగమేనని అప్పటి పరిస్థితుల ద్వారా వెల్లడైంది. కేంద్రం వినిపించిన ‘ఆచారం కాపాడాలి’ అన్న వాదనలో మహిళల హక్కులపై స్పష్టత కనిపించదు. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 14 సమా నత్వ హక్కును పక్కన పెడుతుంది. అందుకే, మతాచారాలు వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించి నవే కానీ, అవి రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను దాటి వెళ్లలేవని కోర్టు స్పష్టం చేసింది.

గత విచారణల్లో కూడా ధర్మాసనం ”మహిళలను అస్పృ శ్యులుగా చూడటం సరికాదు” అని చెప్పింది. ఆ వ్యాఖ్యలే నేడు ఈరోజు చర్చకు పునాదిగా నిలిచాయి. తాజా విచారణ సందర్భంగా ”ఒక వర్గాన్ని దేవుడి పేరుతో దూరంగా ఉంచడం, అది మతస్వేచ్ఛకంటే కూడా వివక్షగా మారుతుంది” అన్న కోర్టు భావన వాస్తవం. మహిళా కోణంలో చూస్తే శబరిమల వివాదం మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ‘నెలసరి’ని అపవిత్రంగా చూపించడం వారి గౌరవాన్ని దెబ్బతీయటమే. ఆచారాల పేరుతో ఈ భావజాలాన్ని కొనసాగించడం సమాజాన్ని తిరోగమనంలో పడేస్తుంది. సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ మహిళలకు కల్పించిన రాజ్యాంగ మూలహక్కులు. మతం పేరుచెప్పి వివక్షను న్యాయబద్ధం చేయలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ కూడా ఒక కేసు పరిష్కారం కాదు, దేశం ఎలా నడుచుకోవాలో చేసే దిశానిర్దేశం. ఇకనైనా ఆచారాల పేరుతో చేసే రాజకీయాలకు కాలం చెల్లాలి. సమానత్వమే కొత్త ఆచారంగా స్థిరపడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -