భారత రాజ్యాంగాన్ని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ఆచరణలోకి తేవడంలో న్యాయవ్యవస్థ పాత్రను లోతుగా చదివి ఆకళింపు చేసుకున్న వారెవరికైనా సరే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన మాటలు దిగ్భ్రాంతి కలిగి స్తాయి. పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్.ఐ.ఆర్) వల్ల ఉత్పన్నమైన సమస్యను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం సభ్యులలో ఒకరైన న్యాయమూర్తి ఇలా అన్నారు: ”ఈ ఎన్నికలలో ఎవరైనా ఒకరు ఓటు చేయలేకపోయారంటే వారి హక్కు శాశ్వతంగా తొలగించబడిందని అర్థమా?”. రాజ్యాంగంలోనూ అదే విధంగా ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నెన్నో తీర్పులలోనూ ఓటు హక్కు రాజ్యాంగ హక్కుగా గుర్తించబడింది. అలాంటి హక్కుకు ఈ విధమైన సృజనాత్మక భాష్యం చెప్పడం విడ్డూరమే. దీన్ని మరోవైపు నుంచి చూస్తే ఓటు హక్కు అనేది సమయం గడువు తీరిపోయాక మాత్రమే సొమ్ము చేసుకోదగిన పోస్ట్ డేటెడ్ చెక్ వంటిదా?
ఈ.సి వింత వ్యాఖ్యలు
‘సర్’ ప్రక్రియ పైన, ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి పైన ‘పీపుల్స్ డెమోక్రసీ’ పదేపదే విస్తా రంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల అర్హతలపై చర్చకు సుప్రీంకోర్టులో ప్రస్తుత విచారణ తెరదించింది. అయితే దీనివల్ల తుది పరిష్కారం లభించకపోగా ఒక రాజ్యాంగ మౌలిక ప్రశ్నపై అతి పెద్ద వివాదం మొదలైనట్టయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యానాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నట్టుగా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ ప్రక్రియ తప్పుడు అమలుపై ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడున్న ఓటర్ల జబితా నుంచి మొదట అరవై లక్షల ఓట్లు తొలగించిన భారత ఎన్నికల సం ఘం (ఈ.సి.ఐ) పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే ఒక సరికొత్త పద్ధతిని అనుసరించింది. లక్షలాది ఓట్లను ‘తార్కిక తేడాల’ పేరిట పక్కనపెట్టింది. వీటిపై ప్రత్యక్ష పరిశీలన జరపడంగాక సాఫ్ట్‌వేర్‌లతో అల్‌గోరిథంల ఆధారంగా ఓటర్ల జాబితాలను పున:దర్శనం చేసింది.
ఈ సందర్భంగా అరవై లక్షల మంది ఓట్లు కోల్పోవడం ఓటర్ల రద్దు ఎంత విస్తృతంగా జరిగిందో అర్థంకావడానికి ఒక మచ్చుతునకగా వుంటుంది. 2002-03 నాటి ఓటర్ల జాబితాతో ముడిపెట్టి కొత్త జాబితా రూపొందించే ప్రక్రియ ఇది. అయితే అసలు ‘సర్’ ప్రక్రియ ఏ పేరిట మొదలుపెట్టారో అది వెనక్కు పోయి, తొలగింపు కోసం పరిశీలనకు పెట్టిన ఓట్ల సంఖ్య చాలా తక్కువేనని ఇ.సి.ఐ అభిప్రాయపడుతున్నది. అయితే ఈ అంచనా ఎలాంటి నిర్దిష్టమైన అధ్యయనంపై ఆధారపడిందేమీ కాదు. కేవలం రాష్ట్ర స్థాయి బిజెపి నాయ కులు, అమిత్ షా వంటి వారి ప్రకటనల ప్రాతిపదికన చెబుతున్నది మాత్రమే. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలలో రోహింగ్యాలతో సహా మొత్తం కోటిన్నర మంది చొరబాటుదార్లు వున్నారని వారు రోజూ గగ్గోలు పెడుతున్నారు. కొత్తగా ఈ ”తార్కిక తేడాలు” అన్నది ఆందుకోసం కనిపెట్టిందే. ఈ కొత్త కొలబద్దతో సందేహా స్పదంగా కనిపించిన వారందరినీ ”తీర్పు కోసం నిరీక్షణ” జాబితాలో చేర్చారు. అంటే మొదటి దశ పరిశీలనను జయప్రదంగా పూర్తి చేసి జాబితాలో స్థానం పొందినవారిని తీర్పు కోసం నిరీక్షణ పేరిట మళ్లీ ప్రత్యేకంగా పెట్టడమంటే చాలా స్పష్టంగా తొలగింపు కోసం ముందే చేసిన నిర్ణయం అమలు చేస్తున్నారన్నమాట.
సుప్రీం వైఖరి పర్యవసానం
ఏప్రిల్ ఆరున విచారణ క్రమంలో ఇ.సి.ఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ సుమారు 27లక్షల మంది ఓటర్లు పూర్తిగా నిరూపించుకోలేక పోయారని చెప్పారు. అంతకు ముందు మార్చి మూడవ వారంలో జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికీ తమ ఓటు హక్కు పునరుద్ధరించుకోలేకపోయిన వారికోసం ప్రత్యే కంగా న్యాయ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే ఇదే విచారణలో మరో విషయాన్ని అధి కారికంగా అంగీకరించారు. ట్రిబ్యునళ్లను నోటిఫ్ చేసినప్పటికీ ఇంకా పని ప్రారంభించవలసే వున్నదని తెలిపారు. ఓట్లు తొలగించబడిన వారు ఎంతో కష్టమైనప్పటికీ తమ రోజువారి జీతాలు కూడా వదులుకుని దూరాభారాలు ప్రయాణించి పరిశీలనా కేంద్రాలకు చేరుకున్నారు. అయినా వారి పేర్లను పునరుద్ధరించడం జరగలేదు. ఏప్రిల్ 6న సుప్రీంకోర్టు విచారణ తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రక్రియ నిలిపేయడానికి అనుమతి నిచ్చింది. మొత్తం ఓటర్ల సంఖ్యలో 12 శాతం అంటే సుమారు 91 లక్షల ఓట్ల తొలగింపునకు ఆమోద ముద్ర లభించింది. ఇది చాలా పెద్ధ సంఖ్యలో తొలగింపు అని కోర్టు కూడా ఒప్పుకోక తప్పలేదు. అయితే దిగ్భ్రాంతి కలిగించే బాధాకరమైన సత్యం ఒకటుంది. అత్యున్నత న్యాయస్థానం ఓటరు రాజ్యాంగ హక్కు కన్నా ఇసిఐ ముందస్తు పథకంతో మొదలు పెట్టి అమలు చేసిన ఈ కసరత్తుకే అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. పున: పరిశీలనకుగాక సామూహిక ఓట్ల రద్దు జరిగే పరిస్థితి తెచ్చిపెట్టింది.
వంద మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష వేయకూడదన్న న్యాయ సూత్రాన్ని కోర్టులు గుర్తించే దేశం ఇది. ఇలాంటి దేశంలో ఒక్క వేటున ఇంత భారీ సంఖ్యలో ఓట్లను తొలగించడం పచ్చిగా రాజ్యాంగ ఉల్లంఘన చేయడమే. ఫరక్కా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా వున్న మెహతాబ్ షేక్‌ను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేలా అదే రోజు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పుడు, ”విచారణలో ఉన్నవి”గా వర్గీకరించే మొత్తం ప్రక్రియ ఎంత ఏకపక్షంగా ఉందో స్పష్టమైంది. పత్రాల తనిఖీ కింద షేక్ సమర్పిం చిన పాస్‌పోర్టు విషయం విచారించేందుకు కొల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రత్యేక విచారణ జరిపారు. ఈ.సి.ఐ ఆయన పేరును తీర్పు కోసం నిరీక్షణ జాబితాలో పెట్టడానికి సాంకేతిక కారణాలు చూపించిందని మాజీ ప్రధాన న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. షేక్‌ను అర్హుడైన ఓటరుగా ప్రకటిం చడానికి పాస్‌పోర్టు సరిపోతుందని తుది నిర్ధారణ చేశారు. అంటే ఇలాంటి అడ్డగోలు తొలగింపులు మొత్తం ప్రక్రియలో ఎంత భారీగా జరిగిపోయాయో అర్థం కావడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
లోగుట్టుగా…
పారదర్శకత లేకుండా లోగుట్టుగా చేసేయడం ఈ మొత్తం ప్రక్రియ ప్రధాన లక్షణం, ‘తీర్పు కోసం నిరీక్షణ’ జాబితాను కంప్యూటర్‌లో పరిశీలించుకునే అవకాశం లేకుండా పిడిఎఫ్ ప్రతులు మాత్రమే ఇచ్చారంటేనే అది తెలిసిపోతుంది. దానివల్ల ఫలితాలను విశ్లేషించుకునే అవకాశమే లేకుండా పోయింది. అందరూ గౌరవించే నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ చెక్ సైట్ ‘ఆల్ట్ న్యూస్’ కొలకతాలోని రెండు నియోజకవర్గాలపై పరిశీలన జరిపింది. పరిశీలన జరపలేకపోయిన వారి కింద మొదట ఇచ్చిన జాబితాతో పోలిస్తే తర్వాత తొలగించిన వారిలో ముస్లింల శాతం అత్యధికంగా వున్నట్టు తేల్చింది. పరిశోధకులు పిడిఎఫ్ ప్రతులను నిశితంగా డిజిటైజ్ చేసి డిజిటల్ రూపంలోనే విశ్లేషించినట్టు పేర్కొంది. ఇంకా అనేక అధ్యయనాల్లో కూడా ఇదే తేలింది. ఆర్థిక సామాజిక అసమానతలతో బాఢపడేవారే అత్యధికంగా తొలగించబడినట్టు, ఈ తతంగం ముందస్తు పథకం ప్రకారమే జరిగినట్టు అవన్నీ తేల్చాయి. ముస్లింలలో కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో తొలగించబడ్డారు. సరిగ్గా అదే ఏప్రిల్ 6వ తేదీన లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి.ఇ.సి) అభిశంసన నోటీసును తిరస్కరి స్తున్నట్టు ప్రకటించారు. 123 మంది లోక్‌సభ సభ్యులు, అరవై మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసి ఇచ్చిన అభిశసంసన నోటీసును ఎలాంటి నిర్దిష్ట కారణం చెప్పకుండా ఏకపక్షంగా తోసిపుచ్చారు.
కనుక పీక్కుతినే కోరలూ, రాక్షసి గోళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. కార్పొరేట్-మతతత్వ కూటమి బరితెగించింది. ఆరెస్సెస్-బీజేపీ కూటమికి సంబంధించిన రాజకీయ సంస్థలు తప్పించుకోవడం కోసం నిస్పృ హతో అహోరాత్రాలు పెనుగులాడుతున్నాయి. ఈ.సి.ఐ గానీ దాని కొనసాగింపుగా అత్యున్నత న్యాయ వ్యవస్థ గానీ ఓటు హక్కు అనే పౌరుల ప్రాథమిక రాజ్యాంగ హక్కుకు విలువ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఈ తిరస్కారం విషాదకరంగా లింగ భేదం, మత భేదం బట్టి నిర్ణయించబడుతున్నది. ఈ సందర్భంలో ఎవరికైనా 1930ల నాటి నాజీ జర్మనీ న్యూరెంబర్గ్ చట్టాలే గుర్తుకు వస్తాయి. భారత క్షితిజ స్థలంలో క్రమంగా నయా ఫాసిస్టు పోకడలు వేళ్లూనుకుంటున్నాయి.
(ఏప్రిల్ 7 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
రాజ్యాంగబద్ధ ఓటు హక్కుపై వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



