Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసైన్డ్‌ భూములపై దాడి

అసైన్డ్‌ భూములపై దాడి

- Advertisement -

వెంటనే భూ కమిషన్‌ వేయాలి
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి
మే 15న దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల సమ్మె : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచిన భూములు కబ్జా కాకుండా చట్టాలున్నప్పటికీ వాటి అమలులో పూర్తి వైఫల్యముందనీ, ఆ భూములను రక్షించేందుకు వెంటనే భూ కమిషన్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేసినట్టు ప్రకటించినా, అందులో భారీ భాగం అన్యాక్రాంతమైందని తెలిపారు. 1/77 చట్టం ఉన్నప్పటికీ కబ్జాలు విస్తృతంగా జరిగి ఆ భూములు ధనవంతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయనీ, వాటిని ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేవని వివరించారు.

ప్రభుత్వాలే ఇప్పుడు ఆ చట్టాలను సవరించి, ”ప్రస్తుతం ఉన్నవారికే హక్కులు” అంటూ పేదల భూములను ధనవంతులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. గ్రామసభల్లో భూముల వివరాలను బహిరంగంగా ప్రకటించాలనీ, వాటిని లబ్దిదారులకే తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టంపై దేశంలో 15 కోట్లకుపైగా కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారనీ, మూడు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించలేదనీ, రూ.10 వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంపై కక్ష కట్టి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి కూర్చున్న తీరును వివరించారు.

మే 15 దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఆ రోజు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలను ముట్టడించాలని కూలీలకు పిలుపునిచ్చారు. భూమి, ఉపాధి, సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా విస్తృతస్థాయి ఉద్యమాలు రూపొందించనున్నట్టు తెలిపారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మతం కారణంగా ఎస్సీ హోదాను నిరాకరించడం తీవ్ర అన్యాయమన్నారు. రిజర్వేషన్లు మతంపై కాకుండా అంటరానితనం, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా వచ్చాయని తెలిపారు. హిందూత్వ శక్తులు, బీజేపీ దళితులను విభజించి బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఈ విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -