మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
ప్రజాభవన్ ప్రతినిధి జి.చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజ్‌కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని డబుల్ బెడ్రూం సముదాయంలో ఉన్న వాణిజ్య షాపుల అమ్మకాలను ఆపాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో శుక్రవారం సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి వెళ్లి ప్రజాభవన్ అధికార ప్రతినిధి జి.చిన్నారెడ్డి, ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్యదేవరాజ్కి విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. పేదలకు డబుట్ బెడ్ రూం ఇండ్లు రావడంతో .. బయట అద్దెలు కట్టలేక ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేకపోయినా నివాసముంటున్నారని తెలిపారు. పేదలు, కార్మికులు, అక్కడి సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ముందు చూపుతో కాలనీల్లో వాణిజ్య షాపులు ఏర్పాటు చేసిందని చెప్పారు.
వాటిని స్థానిక ప్రజలకు కిరాయిలకి ఇచ్చి ఆ డబ్బులతో డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదయాల్లో లిఫ్ట్, కరెంట్, జెన్రేటర్ లాంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. ఆ షాపులను ఇప్పుడు పూర్తిగా అమ్మేయాలని ఈ ప్రభుత్వం చూస్తున్నదని, ఇది చాలా దుర్మార్గం అన్నారు. వెంటనే వాణిజ్య షాపుల అమ్మకాలను ఆపాలని లేనిపక్షంలో ఈనెల 15-17 మధ్య జరిగే వేలం పాటను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాస్కర్ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాల్లేకుండా.. డబుల్ బెడ్ రూం ఏరియాల అసోసియేషన్లతో మాట్లాడకుండా వారి బతుకు మీద కొడుతాం అంటే ఎర్రజెండా, సీపీఐ(ఎం) చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, జె.చంద్రశేఖర్, ఏ.అశోక్, ఐ.రాజశేఖర్, జి.శ్రీనివాస్, నాయకులు నరేష్, సంతోష్, శంకర్, లింగస్వామి, గణేష్, జె.వెంకన్న, సబిత, బాధితులు విజయ్, బాబురావు, రాజేందర్, రాములు, గోపాల్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
డబుల్ షాపుల వేలంపాట ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



