పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్
ఆగిన ఎగుమతులు.. నిలిచిన రూ.కోట్ల విలువైన సరుకులు
మహిళా కళాకారులకు జీవనోపాధి కరువు
ఆదాయం లేక ఇల్లు గడవక ఇబ్బందులు
లక్నో చికంన్‌కారీ వర్క్…పల్చటి వస్త్రాలపై దారాలతో కుట్టే సున్నితమైన ఎంబ్రాయిడరీ. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కళ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి ఉద్భవించిన ఓ పురాతన చేతివృత్తి. ఇక్కడ దాదాపు సగం మంది కళాకారులు ఈ పనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తారు. అందులోనూ ఈ వృత్తిని కొనసాగించేది ఎక్కువ మంది మహిళా కళాకారులే. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన ఈ ఎంబ్రాయిడరీ దుకాణాలతో అమీనాబాద్, హజ్రత్‌గంజ్ వీధులు సందడిగా కనిపిస్తాయి. అలాంటిది గత 40 రోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంతో వెలవెలబోతున్నాయి. వార్ దెబ్బకు ఎగుమతులు ఆగిపోవడంతో కోట్ల సరుకులు నిలిచిపోయాయి. మరోపక్క ముడిసరుకుల దిగుమతులు నిలిచిపోవడంతో అనేక మంది జీవనోపాధి ప్రమాదంలో పడింది.
లక్నో : పాత లక్నోలోని చౌక్ ప్రాంతపు ఇరుకు వీధుల్లో నివసించే 42 ఏండ్ల షబీనా బేగం 20 ఏండ్లుగా చికంన్‌కారీ ఎంబ్రాయిడరీ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తోంది. ఉదయం నమాజ్ తర్వాత ఆమె ఈ పనిని ప్రారంభించడం మొదలు పెడితే అర్ధరాత్రి వరకు కొనసాగించేవారు. కానీ నెల రోజులుగా పనులు నిలిచిపోవడంతో ఆమె ఖాళీగా ఉన్నారు. దీంతో వారి కుటుంబ పరిస్థితి పూట గడవటమే కష్టంగా మారింది. ఆమె వద్ద ఇప్పటికీ సగం సరుకు పూర్తైనది ఉంది. కానీ వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ సందర్భంగా షబీనా మాట్లాడుతూ ”గతంలో నాకు ప్రతి వారం కొత్త పని దొరికేది. ఇప్పుడు, నేను చేసిన పనే ఇంట్లో పడి ఉంది.
ఆదాయం లేకపోవడంతో ఇల్లు నడపడం కష్టంగా మారుతోంది” అని వాపోయింది. ఇలా షబీనా వంటి ఎంతో మంది మహిళా కళాకారుల జీవితాలు ఇపుడు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. శతాబ్దాలుగా నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన లక్నో ప్రఖ్యాత చికంన్‌కారీ పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయ సంక్షోభ ప్రత్యక్ష ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతతో ఈ పరిశ్రమ అతిపెద్ద మార్కెట్ అయిన గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఎగుమతులు దాదాపుగా నిలిచిపోవడంతో 60 శాతం క్షీణించింది. మరోవైపు ఈ కళపై ఆధారపడి జీవించే ఐదు లక్షల మంది ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడింది.
ఇది సాంప్రదాయ కళే కాదు.. ఆర్థిక వ్యవస్థలో కీలకం
ఈ పరిశ్రమ కేవలం ఒక సాంప్రదాయక కళ మాత్రమే కాదు. లక్నో ఆర్థిక వ్యవస్థలో ఓ కీలక భాగం కూడా. పరిశ్రమ వర్గాల ప్రకారం…లక్నో చికన్‌కారీ వార్షిక టర్నోవర్ సుమారు రూ.550 కోట్లు. దీనిలో రూ.100 కోట్ల విలువైన సరుకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాగే సుమారు రూ.70 కోట్ల విలువైన సరుకులు యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. అంటే వీరి వ్యాపారంలో అధిక భాగం నేరుగా విదేశీ వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది.
అమెరికా సుంకాలతో దెబ్బ
మొన్నటి వరకు అమెరికా విధించిన సుంకాలతో ఇక్కడ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతలోనే పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఈ వ్యాపారంపై పడింది. ఈ నేపథ్యంలో లక్నోకు చెందిన ప్రముఖ ఎగుమతిదారు వినోద్ పంజాబీ వివరిస్తూ ”గల్ఫ్ దేశాలు మా వ్యాపారానికి అతిపెద్ద మార్కెట్. ఆ దేశాల్లో అధిక సంఖ్యలో భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, శ్రీలంకన్లు, నేపాలీలు, ఆఫ్ఘన్‌లు నివసిస్తున్నారు. వారందరికీ లక్నో చికంన్‌కారీ వస్త్రాలంటే చాలా ఇష్టం. మేం ఆర్డర్ల ప్రకారం డిజైన్ చేస్తాం. ఈ సరుకు ప్రత్యేకంగా అక్కడి కస్టమర్ల కోసమే. ఇప్పుడు, ఆ మెటీరియల్ అంతా గిడ్డంగిలోనే ఉండిపోయింది. ఇది కేవలం వ్యాపారాన్నే కాదు. మొత్తం గొలుసు సరఫరాను ప్రభావితం చేస్తోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
జీరోకి పరిమితమైన ఎగుమతులు
లక్నో చికంన్‌కారీ, హస్తకళల సంఘం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ చబ్లానీ కూడా ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ”పండుగలు, పెండ్లిండ్ల సీజన్‌లో నెలకు రూ.15 కోట్ల వరకు సరుకును ఎగుమతి చేసేవాళ్లం. కానీ ఈసారి ఈద్, పెండ్లిండ్ల సీజన్‌లో ఎగుమతులు పూర్తిగా జీరోకు పడిపోయాయి. ఈ పరిస్థితి మునుపెన్నడూ లేదు” అని ఆయన వివరించారు. ప్రస్తుత సంక్షోభం ఈ పరిశ్రమకు వెన్నెముక అయిన చేతివత్తుల వారిపై అత్యధిక ప్రభావాన్ని చూపుతోంది. చేతివృత్తి పని చేసే వారిలో చాలా మంది మహిళలే ఉండడంతో వారంతా ఇంటి నుంచే పనిచేస్తూ ఒక్కో వస్త్రం ముక్కకు రూ.300 నుంచి రూ.500 వరకు వేతనం పొందుతున్నారు. పని ఆగిపోవడంతో వారి ఆదాయానికీ గండి పడింది.
అలీగంజ్‌లో ఈ పనిచేసే నజీమా ఖతూన్ ఇలా అన్నారు ”మాకు దొరికిన బట్ట మీద పని చేసి డబ్బు సంపాదిస్తాం. ఇప్పుడు బట్టలు కూడా దొరకడం లేదు. ఇంట్లో నలుగురం ఉన్నాం. ఖర్చులు ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని పరిస్థితి” అని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలంగా చికంన్‌కారీ, జర్దోజీ కళాకారులతో కలిసి పనిచేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ అస్మా హుస్సేన్ కూడా కళాకారుల దుస్థితిని అంగీకరించారు. ఆమె మాట్లాడుతూ ”ఎగుమతులు 60 శాతం తగ్గాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాకు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది కళాకారుల పనిపై నేరుగా ప్రభావం చూపింది. సమస్య కేవలం డిమాండ్ తగ్గడం మాత్రమే కాదని, పెరిగిన ఖర్చులు కూడా ఉన్నాయి” అని అన్నారు. అంతేకాక ”పెట్రోలియం చుట్టూ ఉన్న అనిశ్చితి, ముడి పదార్థాల ధరలను 20 శాతం పెంచింది. దానికి తోడు, రవాణా ఆలస్యం, విమానాల రద్దు పరిస్థితిని మరింత దిగజార్చింది” అని వెల్లడించారు.
అమ్ముడుపోని సరుకులు
వ్యాపారులు సైతం పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. లక్నో చికంన్‌కారీ హస్తకళల సంఘం అధ్యక్షుడు సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ ”మేం ముడి పదార్థాలు కొనుగోలు చేశాం. కళాకారులకు అడ్వాన్సులు చెల్లించాం. వస్తువులనూ తయారు చేయించాం. కానీ ఇప్పుడు, అవన్నీ గిడ్డంగిలోనే ఉండిపోయాయి. సుమారు రూ.2 కోట్ల విలువైన సరుకులు అమ్ముడుపోకుండా పడి ఉన్నాయి. ఇవి ఎగుమతి నాణ్యత గల సరుకులు, వీటిని భారతదేశంలో అదే ధరకు అమ్మలేం. ఇక్కడి వినియోగదారులు అంత చెల్లించడానికి సిద్ధంగా లేరు.” ఈ సమస్య ఒకే నగరానికో లేదా పరిశ్రమకో పరిమితం కాలేదు. ప్రపంచ సంక్షోభాలు స్థానిక ఆర్థిక వ్యవస్థలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది.
లక్నో చికంన్‌కారీకి కష్టాలు
- Advertisement -
- Advertisement -



