Saturday, April 11, 2026
E-PAPER
Homeఆటలుఎదురులేని ఆయుష్‌

ఎదురులేని ఆయుష్‌

- Advertisement -

సెమీఫైనల్లో యువ షట్లర్‌ అడుగు
క్వార్టర్స్‌లో వరల్డ్‌ నం.4పై ఘన విజయం
ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌

నింగ్బో (చైనా) : ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి సంచలన జోరు కొనసాగుతుంది. వరుసగా ప్రపంచ టాప్‌-10 ఆటగాళ్లపై విజయాలు సాధించిన ఆయుష్‌ శెట్టి పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.4, ఇండోనేషియా ఆటగాడు జొనాథన్‌ క్రిస్టీపై ఆయుష్‌ శెట్టి అదిరే విజయం నమోదు చేశాడు. సుమారు గంట పాటు సాగిన క్వార్టర్స్‌ పోరులో 23-21, 21-17తో ఆయుష్‌ శెట్టి సంచలన విజయం ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌ నం.7 షట్లర్‌పై విజయంతో క్వార్టర్స్‌కు చేరుకున్న ఆయుష్‌ శెట్టి.. అదే జోరు సెమీస్‌ బెర్త్‌ దక్కించుకోవటంలో చూపించాడు. తొలి గేమ్‌ను జొనాథన్‌ క్రిస్టీ తనదైన శైలిలో ఆరంభించాడు.

11-7తో విరామ సమయానికి ఆయుష్‌ శెట్టిపై మంచి ఆధిక్యం సాధించాడు. ద్వితీయార్థంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన ఆయుష్‌ శెట్టి 11-11తో స్కోరు సమం చేశాడు. పుంజుకున్న క్రిస్టీ వరుస పాయింట్లతో మళ్లీ ముందంజ వేశాడు. 18-16తో తొలి గేమ్‌ను సొంతం చేసుకునే దిశగా సాగాడు. ఇక్కడ్నుంచి ఆయుష్‌ శెట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జొనాథన్‌ క్రిస్టీ ఓ పాయింట్‌ సాధించి ముందంజ వేసినా.. వెంటనే స్కోరు సమం చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. 21-21తో స్కోరు సమంగా ఉండగా ఆయుష్‌ శెట్టి వరుస పాయింట్లతో రెచ్చిపోయాడు. 23-21తో టైబ్రేకర్‌లో తొలి గేమ్‌లో పైచేయి సాధించాడు. కీలక రెండో గేమ్‌లో జొనాథన్‌ క్రిస్టీపై ఆయుష్‌ శెట్టి స్పష్టమైన పైచేయి సాధించాడు.

ఆరంభంలోనే వరుస పాయింట్లు సాధించిన ఆయుష్‌ ముందంజ వేసినా.. 9-9తో జొనాథన్‌ క్రిస్టీ స్కోరు సమం చేశాడు. కానీ విరామ సమయానికి 11-9తో శెట్టి ఆధిక్యం నిలుపుకున్నాడు. ద్వితీయార్థంలో ఆయుష్‌ శెట్టి రెట్టించిన ఉత్సాహంతో ఆడాడు. స్మాష్‌లు, క్రాస్‌ కోర్టు డ్రాప్‌ షాట్లతో క్రిస్టీని ఉక్కిరిబిక్కిరి చేశాడు. 21-17తో రెండో సెట్‌ను అలవోకగా సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌ నం.25 ఆయుష్‌ శెట్టి క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.4 జొనాథన్‌ క్రిస్టీపై సంచలన విజయంతో అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. నేడు సెమీఫైనల్లో వరల్డ్‌ నం.1 కునాల్‌ విటిడ్‌శరణ్‌ (థాయ్ లాండ్‌)తో ఆయుష్‌ శెట్టి పోటీపడనున్నాడు. టాప్‌ సీడ్‌ కునాల్‌తో నిరుడు ఓ మ్యాచ్‌ ఆడిన ఆయుష్‌ వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శెట్టి నేడు లెక్క సరి చేస్తాడేమో చూడాలి. ఇతర విభాగాల్లో భారత షట్లర్లు పరాజయం పాలవటంతో ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో మన ఆశలన్నీ ఆయుష్‌ శెట్టిపైనే ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -