Saturday, April 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఖాకీల కండ్లుగప్పిన 'కాపలాదారు'

ఖాకీల కండ్లుగప్పిన ‘కాపలాదారు’

- Advertisement -

కరీంనగర్‌ కమిషనరేట్‌లో చనిపోయిన పోలీసుల పేర్లతో రూ.కోట్ల కుంభకోణం
వ్యవస్థలోని డొల్లతనం ఆసరాగా చేసుకుని రూ.1.40 కోట్లు స్వాహా
మాస్టర్‌ మైండ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సహా ఐదుగురు అరెస్ట్‌

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
దొంగలను పట్టుకుని చట్టానికి అప్పగించాల్సిన పోలీసులే దొంగలుగా మారితే?.. నేరాలను అరికట్టాల్సిన వ్యవస్థలోనే కండ్లు చెదిరే కుంభకోణం జరిగితే?.. కంచె చేనును మేసిన చందంగా.. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పకడ్బందీ ప్లాన్‌ వేసిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, ఏకంగా పోలీసు శాఖలోని పే-సెక్షన్‌ (జీతాల విభాగం) లొసుగులను ఆసరాగా చేసుకుని ఏండ్ల తరబడి ప్రభుత్వ ఖజానాను లూటీ చేశాడు. చనిపోయిన కానిస్టేబుళ్ల పేర్లతో డమ్మీ ఖాతాలు సృష్టించి, ఏకంగా రూ.1.40కోట్ల ప్రభుత్వ సొమ్మును తన జేబులో వేసుకున్నాడు. ఏండ్ల తరబడి సాగిన ఈ అక్రమ దందా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసు శాఖలో పెను ప్రకంపనలు రేగుతున్నాయి.

బీజం పడిందిలా..
కరీంనగర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ డీపీవో కార్యాలయంలోని పే సెక్షన్‌లో గతంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన నీలం రామ్మోహన్‌ ఈ స్కామ్‌కు ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం ఇతను చిగురుమామిడి స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. పే సెక్షన్‌లో ఉన్నప్పుడు వ్యవస్థలోని డొల్లతనాన్ని పసిగట్టిన రామ్మోహన్‌ పక్కా స్కెచ్‌ వేశాడు. గతంలో మరణించిన ముగ్గురు పోలీస్‌ కానిస్టేబుళ్ల(సి.హెచ్‌.రవీందర్‌, కె.గంగస్వామి, కె.రవి) ఎంప్లాయ్ ఐడీలను సేకరించాడు. ఆ ఐడీలకు చనిపోయిన వారి పేర్లకు బదులుగా తనకు తెలిసిన ముగ్గురు ప్రయివేటు వ్యక్తుల పేర్లను జత చేశాడు.

వారు ఎక్కడో బడాబాబులు కారు.. ఒకరు వాచ్‌మెన్‌, మరొకరు ప్రయివేటు డ్రైవర్‌, ఇంకొకరు మటన్‌ షాప్‌ నిర్వాహకుడు. వీరి పేర్లతో కరీంనగర్‌లోని భగత్‌నగర్‌, బొమ్మకల్‌ హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాంచీలలో నకిలీ ఖాతాలు తెరిచాడు. ఈ ఖాతాలకు ఎవరికీ అనుమానం రాకుండా తన సొంత ఈమెయిల్‌ ఐడీలు, మొబైల్‌ నెంబర్లను లింక్‌ చేశాడు. ఈ పన్నాగంతో జూన్‌ 2022 నుంచి మార్చి 2026 వరకు ప్రతి నెలా ఆ నకిలీ ఖాతాల్లోకి ఠంచనుగా ప్రభుత్వ జీతాలు జమయ్యేలా చేశాడు. ఈ విధంగా ఏకంగా రూ.కోటి 40లక్షలా 18 వేలా 308 ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశాడు.

లొసుగులను వాడుకుని.. లోన్లు కూడా!
ఇక్కడే రామ్మోహన్‌ నేర బుద్ధి మరింత బరితెగించింది. నకిలీ ఖాతాల్లో జమ అయిన డబ్బును ఏటీఎంల ద్వారా డ్రా చేయడమే కాకుండా, ఐఎంపీఎస్‌ ద్వారా తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకునేవాడు. ఇంతటితో ఆగకుండా.. ఈ నకిలీ జీతాల ఖాతాలపై ఏకంగా బ్యాంక్‌ లోన్లు కూడా పొందాడు. ఆ లోన్లకు సంబంధించిన ఈఎంఐలు కూడా ప్రభుత్వం జమ చేసే సొమ్ము నుండే కట్‌ అయ్యేలా సెట్టింగ్‌ చేసుకుని వ్యవస్థను పూర్తిగా బఫూన్‌ను చేశాడు.

అధికారుల అండతోనే సాగిన దందా..
ఈ స్థాయి కుంభకోణం ఒక సాధారణ హెడ్‌కానిస్టేబుల్‌ ఒంటరిగా చేయడం అసాధ్యమని చెప్పొచ్చు. వ్యవస్థలో పైస్థాయిలో ఉన్న వారి అండతోనే ఇది సాధ్యపడింది. ఈ కుట్ర లో రామ్మోహన్‌కు డిపార్ట్‌మెంట్‌కే చెందిన రిటైర్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏఓ) వై.వి.ముని రామయ్య పూర్తి స్థాయిలో సహకరించాడు. నకిలీ అకౌంట్ల సృష్టిలో వాచ్‌మన్‌ లావుడియా రవి, ప్రయివేటు డైలీ డ్రైవర్‌ చుక్కా గంగరాజు, మటన్‌ షాప్‌ కీపర్‌ శంకర్‌ నామతాబాబ్‌ భాగస్వాములుగా వ్యవహరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

సీన్‌లోకి సీపీ… దోపిడీ ఆటకట్టు
నాలుగేండ్లుగా పోలీసు వ్యవస్థ కండ్లు గప్పి సాగుతున్న ఈ భాగోతానికి ఇటీవల బ్రేక్‌ పడింది. జీతాల చెల్లింపుల్లో కొన్ని అనుమానాస్పద లావాదేవీలు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం దృష్టికి వచ్చాయి. ఆయన వెంటనే అప్రమత్తమై.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏసీపీ (టాస్క్‌ఫోర్స్‌) వాసాల సతీష్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రికార్డులను తవ్వగా.. నకిలీ అకౌంట్లు, మరణించిన వారి ఐడీల వినియోగం తదితర ఆధారాలు పక్కాగా లభించాయి.

ఏసీపీ సతీష్‌ ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ వన్‌-టౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను (రామ్మోహన్‌, మునిరామయ్య, లావుడియా రవి, చుక్కా గంగరాజు, శంకర్‌ నామతాబాబ్‌) న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కుంభకోణంలో ఇంకా ఏయే ఉన్నతాధికారుల హస్తం ఉంది? ఆడిటింగ్‌ విభాగాలు నాలుగేండ్లపాటు దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి? అన్న కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

అవినీతిని ఉపేక్షించేది లేదు
పోలీసు అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏమాత్రమూ సహించేది లేదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినా, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినా చట్టపరంగా, శాఖా పరంగా కఠినచర్యలు తథ్యం. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. -కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -