Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు

- Advertisement -

–  తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ – కామారెడ్డి : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి, సహ అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ అన్నారు. టీజీఈజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్‌లో జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన రాష్ట్ర బాధ్యులు దామోదర్‌రెడ్డి, అనిల్‌కుమార్ లు  మాట్లాడుతూ కామారెడ్డిలో మహాధర్నాను విజయవంతంగా నిర్వహించిన ఉద్యోగులను అభినందించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, వాటిని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిందని, అయితే ఇప్పటి వరకు హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువు ముగిసి మూడేళ్లు పూర్తవుతున్నా కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆరు కరువు భత్యాలు (డీఏలు) పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని, వాటిని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లుల కారణంగా ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా పనిచేసిన ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారి సమస్యలను గుర్తించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి, ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సరికాదన్నారు. పీఆర్సీ, ఆరు పెండింగ్ డీఏలు, రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర మహాధర్నాకు లక్షలాది మంది ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, అదనపు ప్రధాన కార్యదర్శి కుషాల్, సహ అధ్యక్షులు ఆకుల బాబు, పంపరి ప్రవీణ్‌కుమార్, రాజు, లింగం, బషీర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎల్లారెడ్డి, ప్రేమ్‌కుమార్, చక్రధర్, సహ అధ్యక్షులు నాగరాజు, సాయిరెడ్డి, దేవుల, ముజుబొద్దీన్, విఠల్‌రావు, హనుమంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పర్వతయ్య, నీలం లింగం, మనోహర్, రాజకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -