– జూన్ 2 నాటికి పీఆర్సీ ప్రకటించాలి
– సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ
– 17న మండల, రెవెన్యూ డివిజన్లలో మెమోరాండం సమర్పణ
– మే 5న కలెక్టర్లకు వినతి : టీజీఈజేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూన్ రెండు నాటికి పీఆర్సీని ప్రకటించాలని టీజీఈజేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగణన, సర్‌కు ముందే ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులు, ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీజీఈజేఏసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పలు సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈజేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిందని చెప్పారు. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈనెల 17న మండలాల్లో తహశీల్దార్లకు, రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవోలకు మెమోరాండం సమర్పిస్తామని వివరించారు. మే ఐదున జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేస్తామని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలు, అధికారులను కూడా కలిసి విన్నవిస్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉద్యోగులు, వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోందని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ ఒకటికి ముందు నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్‌ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఓడ్నాల రాజశేఖర్, నాయకులు కె రామకృష్ణ, ఎస్ రాములు, రమేష్ పాక, పూల్ సింగ్, బాణాల రాంరెడ్డి, భిక్షం, మల్లేశ్, రాధ, హన్మంత్‌రావు, పెంటయ్య, జి నిర్మల, అశ్వత్థామరెడ్డి, దర్శన్‌గౌడ్, ఉపేందర్ రావు, మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశ్, ఎస్. నర్సిములు, కొంగల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
జనగణనకు ముందే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



