Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీలో అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యులు

జీహెచ్‌ఎంసీలో అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యులు

- Advertisement -

సీఎం అనుచరులకు నామినేషన్‌ పద్ధతిలో టెండర్లు
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో పనులన్నీ టెండర్ల ద్వారానే ఇవ్వాలి
బ్లాక్‌మెయిల్‌ దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తాం
కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతులు
మహిళ బిల్లుకు 2011 జనాభా లెక్కల ప్రతిపాదిక… మోసమే :కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జీహెచ్‌ఎంసీని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌ లను తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా రూ.1,148 కోట్ల కాంట్రాక్టులను నామినేషన్‌ పద్దతిలో ఇచ్చారని కవిత చెప్పారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.5 లక్షలకు మించిన పనికి టెండర్లు పిలవాలని నిబంధనలను గుర్తుచేశారు. ఆ నిబంధనలు పాటించకపోవడం తెలంగాణ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌ను ఉల్లంఘించటమేనని చెప్పారు. టెండర్లు లేకుండా కాంట్రాక్ట్‌ ఇవ్వవద్దని 2023లో ఏర్పాటైన కమిటీ కూడా స్పష్టం చేసిందని కవిత తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.480 కోట్ల పనులను కట్టబెట్టిందనీ, రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దాన్ని కొనసాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్‌ పద్దతిలో ఇచ్చిన పనులను వెంటనే రద్దు చేసి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నామినేషన్‌ పద్దతిలో ప్రభుత్వం పిలిచిన డిపార్ట్‌ మెంట్లలో స్కిల్డ్‌ లేబర్‌ ఉంటే వారికి కూడా జీతాల్లో అన్యాయం చేస్తున్నారన్నారని తెలిపారు. రూ.23 వేలకు పైగా వారికి జీతాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.13 వేలు ఇస్తున్నారని చెప్పారు. మొక్కల పెంపకాలు, పంపకాలు, కొనుగోళ్లలో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కు సంబంధించిన ఓ కంపెనీపై వేసిన సిట్‌ ఏమైందని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో సిట్టింగ్‌ అవటంతో ఆ సిట్‌ను పత్తా లేకుండా చేశారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును కాంట్రాక్టర్‌కు అప్పగించి, అక్కడి మెయింటెనెన్స్‌ను ప్రభుత్వం చేస్తుండటం అత్యంత దారుణమని విమర్శించారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.35 వేల కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించి హైదరాబాద్‌ అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. హైడ్రా పేరుతో ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను హడలెత్తించటమే కాకుండా చదరపు అడుగుకు 150 రూపాయలంటూ వారి వద్ద వసూలు చేస్తున్నారని కవిత విమర్శించారు. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వెంటనే ఈ బ్లాక్‌ మెయిల్‌ దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు. అయితే కమీషన్ల కక్కుర్తి కోసం కాకుండా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. కాళేశ్వరం ఫెయిల్‌ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాల భూమిని ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం అని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతులను ఈ ప్రభుత్వం చేపడుతున్నట్టుగా తాను భావిస్తున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీజేపీది మోసపూరిత వైఖరి
మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. బిల్లు అమలుకు 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికకగా తీసుకోవటం అన్యాయమన్నారు. 2027 జన గణనలో బీసీ గణన కూడా చేపట్టనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి ఉండాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే లోక్‌ సభ ఎన్నికలు సహా, 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పారు. 2027 జన గణన తర్వాతనే మహిళా బిల్లు అమలు చేయాలని…అదే విధంగా ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై బీసీ మహిళలంతా కూడా పోరాటానికి సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. మహిళ రిజర్వేషన్‌ డ్రాఫ్ట్‌ బిల్లును కూడా తాము పరిశీలిస్తామని చెప్పారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని తెలిపారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరో మద్దతిస్తే బతుకుతానని మాట్లాడటమంటే అది పురుషాహంకారమేనని మండిపడ్డారు. తాను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో పని చేశానని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజల కోసం పని చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలు స్వయంప్రతిపత్తితో సొంతంగా ఆలోచించే సత్తా ఉన్నవారని అన్నారు.

సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలు
ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలు వేశామని కవిత చెప్పారు. ఒక్కో కమిటీలో 30 మంది సభ్యులుంటారని తెలిపారు. అదే విధంగా 500 మంది వాలంటీర్లు ఉంటారన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు, సభ ఏర్పాట్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వారంతా కో ఆర్డినేట్‌ చేసుకుంటారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -