Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, గత లోపాలను సరిదిద్దుకుని, రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని, తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలోని ధాన్యం రాశులను పరిశీలించి మాట్లాడారు. ఈమేరకు  యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నదని, ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసి నిండిపోతున్నవని, ధాన్యం కొనుగోలు ప్రారంభించక పోవడంతో గతంలో మాదిరిగా అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

వెంటనే కొనుగోలు ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బంది జరగకుండా త్వరగా కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగం జరుగుతుందని, దీనికోసం అధికార యంత్రాంగం చొరవ చూపాలన్నారు. నెలల తరబడి ధాన్యం రాశులు మార్కెట్ కేంద్రాల్లో నిలువ ఉండడంతో రైతులకు పట్టాల కిరాయి ఎక్కువై ధాన్యం తడిసి రంగు మారుతుండడంతో రైస్ మిల్లుల యాజమాన్యాలు కోతలు విధించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందని దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని,గన్నీ బ్యాగుల కొరతను నివారించాలని,మార్కెట్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, లారీల కొరత లేకుండా చూడాలన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాంటాలు వేయాలని,తూకాల విషయంలో రైతులను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తగిన వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్, రైతులు దొంగరి నరసింహాస్వామి, పాలబిందెల యాదయ్య, పులుసు సోమయ్య, బుర్ర మహేష్, ఉప్పుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -