ఫ్యాకల్టీ లేక క్లాసులు బంద్
విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయం
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రయివేట్ కోచింగ్ సెంటర్లకు అనుమతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో కామారెడ్డి పట్టణంలో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. స్థానిక అధికారులకు సమాచారం లేకుండానే ఎక్కడో పర్మిషన్ తీసుకొని సెంటర్లు ప్రారంభిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్, ఐఐటీ, జేఈఈ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తామని ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ కోచింగ్ సెంటర్లు నెలకొల్పుతూ విక్రమార్చన చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో “నేషనల్ అకాడమీ” పేరుతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో ప్రారంభమైన ఒక కోచింగ్ సెంటర్‌లో సుమారు 70 మంది విద్యార్థినులను చేర్చుకున్నప్పటికీ, సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో ఇప్పటికే 20 మంది వరకు వెళ్లిపోయినట్లు సమాచారం.
ఇంకా హాస్టల్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పినప్పటికీ, గత రెండు రోజులుగా సరైన భోజనం, టిఫిన్ అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఫ్యాకల్టీ లేకపోవడంతో తరగతులు సక్రమంగా నిర్వహించడం లేదని, తాము చేరి పది రోజులు దాటినా క్లాసులు ప్రారంభం కాలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు కాకపోవడం స్థానికేతరులు ఇతర జిల్లాల నుండి వచ్చిన వారు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక తల్లిదండ్రులు, విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పోలీస్ శాఖను సంప్రదిస్తే తమ పరిధిలోకి రాదని, విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే అది ఇంటర్మీడియట్ పరిధిలోకి వస్తుందని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నీ సంప్రదిస్తే రాష్ట్ర స్థాయి నుంచి అనుమతులు వస్తాయని చెబుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి అనుమతులు ఇచ్చే ముందు స్థానిక అధికారులను సంప్రదించడం లేదని వారు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఆ కోచింగ్ సెంటర్‌లో ఉన్న సుమారు 40 మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. విద్యాశాఖకు సంబంధించినదే కాకుండా ఇతరత్రా దేనికి సంబంధించిన పర్మిషన్ రాష్ట్రస్థాయి నుండి ఇచ్చిన సమయంలో స్థానిక అధికారులను సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వ్యక్తుల గురించి తెలుసుకున్న తర్వాతనే రాష్ట్రస్థాయిలో పర్మిషన్లు ఇవ్వాలని స్థానికులు పేర్కొంటున్నారు.



