విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి
నవతెలంగాణ-నవాబు పేట
వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 19వ ఆవిర్భావ దినోత్సవం వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆవిష్కరించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వికలాంగులందరికీ తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని, ప్రస్తుతం ఇస్తున్న రూ. 4,000 పింఛన్‌ను రూ. 6,000లకు పెంచాలని కోరారు. అలాగే వికలాంగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని, ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
జిల్లా కేంద్రంలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ‘కమ్యూనిటీ హాల్’ నిర్మించాలని, ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వికలాంగుల ‘బ్యాక్‌లాగ్’ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు శివకుమార్, రాజు, ఆంజనేయులు, ఈశ్వర్, నర్సింహులుతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీరాములు, నర్సింహులు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.



