గర్భధారణ ప్రకృతి సహజమైన ప్రక్రియ. కాని ప్రతి గర్భం ఒకేలా ఉండదు. కొంతమంది గర్భిణులకు వైద్యపరమైన గర్భం, ప్రసవ సంబంధిత కారణాల వలన ఎక్కువ జాగ్రత్త, ఎక్కువ సంరక్షణ అవసరమౌతుంది. ఇలాంటి గర్భాలను అధిక ప్రమాద గర్భాలు అని అంటారు.
అధిక ప్రమాదం అంటే తప్పనిసరిగా ప్రమాదం వస్తుందని కాదు. తల్లి, శిశువు సరక్షితంగా ఉండేందుకు అదనపు లేక మరింత ఎక్కువ పర్యవేక్షణ అవసరమౌతుందని మాత్రమే. ప్రసూతి నిపుణులనుండి సరైన మార్గదర్శకత్వం, నిర్ణీత వ్యవధిలో క్రమబద్ధంగా పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో సత్వర చికిత్స ఉంటే గర్భం, ప్రసవం సురక్షితమయి తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారు.
అధిక ప్రమాద గర్భం అంటే ఏమిటి?
తల్లికి, లేక గర్భంలో ఉన్న శిశువుకు లేక ఇద్దరికీ ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో లేక ప్రసవం తరువాత ఆరోగ్య సమస్యలు, ఒకొక్కసారి ప్రమాదకరమైనవి. వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ గర్భాన్ని అధిక ప్రమాద గర్భం అని అంటారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం వలన అనేక జీవిత పర్యంత ఆరోగ్య సమస్యల్ని, మరణాల్ని నివారించవచ్చు. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించడం భయపెట్టడానికి కాదు. ముందు జాగ్రత్త కోసం. ఆధునిక ప్రసూతి వైద్యంలో ముందస్తు గుర్తింపు ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది.
అధిక ప్రమాద గర్భాలకు కారణాలేమిటి?
1.తల్లి వయసు: 17 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాల పై వయసు గర్భిణులకు సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
35 సంవత్సరాల పై వయసు వారికి గర్భం:
1.గర్భ ప్రేరేపిత మధుమేహం
2.ప్రీఎక్లాంప్సియా లేక గర్భం సమయంలో అధిక రక్తపోటు, దాని సంబంధిత సమస్యలు
3.క్రోమోజోమ్స్ సంబంధ లోపాలు
4.నెలలు నిండకమునుపే ప్రసవం
17 సంవత్సరాలలోపు బాలికలకు:
1.రక్తహీనత
2.పోషకాహార లోపం
3.నెలలు నిండక మునుపు ప్రసవం
గర్భానికి ముందే ఉన్న ఆరోగ్య సమస్యలు:
ఈక్రింది వ్యాధులు ఉన్నవారు ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాలి:
1.మధుమేహం
2.అధిక రక్తపోటు
3.థైరాయిడ్
4.మూర్ఛ
5.గుండె జబ్బులు
6.మూత్రపిండాల సమస్య
ఈ వ్యాధులు ప్లసెంటా లేక మాయ పని తీరును, శిశువు ఎదుగుదలను ప్రభావితం చెయ్యెచ్చు
గర్భం సమయంలో ఏర్పడే సమస్యలు:
1.జెస్టేషనల్ డయాబెటిస్ లేక గర్భ ప్రేరేపిత మధుమేహవ్యాధి
2.ప్రీఎక్లాంప్సియా
3.ప్లాసెంటాప్రీవియా లేక మాయ గర్భాశయంలో కిందికి ఉండడం, మాయ విడిపోవడం
4.గర్భస్ధ శిశువు ఎదుగుదల తగ్గడం
5.నెలలు నిండక మునుపు ప్రసవం
బహుళ గర్భాలు (కవలలు లేక ఇంకా ఎక్కువమంది శిశువులు):
1.నెలలు నిండక మునుపు ప్రసవం
2.రక్తహీనత
3.అధిక రక్తపోటు
4.సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఎక్కువ అవడం
గత గర్భాలు, ప్రసవాల చరిత్ర:
గత గర్భాలు, ప్రసవాల సమయంలో ఉన్న సమస్యలు ప్రస్తుత గర్బాన్ని, ప్రసవాన్ని ప్రభావితం చెయ్యొచ్చు.
- పూర్వం సిజేరియన్ అయివుంటే,
- వరుస గర్భస్రావాలు,
- మృతశిశుజననాలు,
- నెలలు నిండకుండా ముందస్తు ప్రసవం
- అధిక రక్తస్రావం
జీవనశైలి కారణాలు:
1.ధూమపానం
2.మద్యపానం
3.మత్తుమందుల వ్యసనం
4.తీవ్ర రక్తహీనత
5.అధిక బరువు
6.పోషకాహారలోపం
7.గర్బధారణ జరిగినప్పటి నుండి క్రమబద్ధంగా పరీక్ష చేయించుకోకపోవడం
8.మానసిక ఒత్తిడి
నిర్లక్ష్యం చెయ్యగూడని ప్రమాద హెచ్చరికలు:
ఈ లక్షణాలు ఉంటే తక్షణం వైద్యసలహాను పొందాలి:
1.తీవ్రమైన తలనొప్పి
2.చూపు మసకబారడం
3.అకస్మాత్తుగా కాళ్ళు, చేతులు ఉబ్బడం
4.తీవ్రమైన కడుపునొప్పి
5.అధిక రక్తస్రావం
6.శిశువు కదలికలు తగ్గడం
7.అధిక జ్వరం
8.నిరంతర వాంతులు
9.ఉమ్మనీరు కారడం
10.ఫిట్స్ రావడం
సకాలంలో స్పందిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు
అధిక ప్రమాద గర్భాల్ని నివారించడమెలా?
గర్భం నిర్ధారణ అవగానే పరీక్ష చేయించుకుని క్రమ బద్ధంగా నిర్ణీత వ్యవధిలో క్లినికల్ పరీక్ష, అవసరమైన రక్తపరీక్షలు, మూత్రపరీక్ష, స్కానింగ్ మొదలైనవి చేయించుకోవాలి. ప్రమాద సూచికలు కనిపించినప్పుడు మామూలుగా కంటే తరచుగా పరీక్షల్ని చేయించుకోవాలి.
క్లినికల్ పరీక్ష:
1.రక్తపోటు నమోదు
2.చీలమండలు, చేతి వేళ్ళ వాపు
3.శిశువు ఎదుగుదల
రక్తపరీక్షలు:
1.హిమోగ్లోబిన్, 2. చక్కెర, 3. థైరాయిడ్, 4. రక్తంగ్రూప్, ఆర్.హెచ్.
మూత్రపరీక్షలు:
చక్కెర, ప్రోటీన్, చీము కణాలు, స్కానింగ్ పరీక్ష, డాప్లర్ టెస్ట్, ఫీటల్ ఎకో, నాన్‌స్ట్రెస్ టెస్ట్, ఫీటల్ మానిటరింగ్
మందుల నిర్వహణ:
మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ మందుల మోతాదులను అవసరాన్ని బట్టి మార్చడం. స్వంత నిర్ణయంతో మందుల్ని, మందుల మోతాదును మార్చగూడదు.
పోషకాహారం:
ఇనుము, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్న ఆహారం, తినాలి. పుష్కలంగా నీరు తాగాలి.
జీవనశైలి:
1.తగినంత పోషకాహారాన్ని తినడం
2.వ్యాయామం: తగినంత వేగంగా నడవడం మంచి వ్యాయామం
3.నిద్ర: రోజుకు కనీసం 8-10 గంటల నిద్ర, విశ్రాంతి
4.స్క్రీన్ టైమ్‌ని అతి తక్కువ చేసుకోవడం
5.కోపం, భయం, ఒత్తిడిని తగ్గించుకోవడం
కొన్ని పరిస్ధితుల్లో పూర్తి బెడ్‌రెస్ట్ అవసరమౌతుంది.
భావోద్వేగాలు: అధిక ప్రమాదం ఉన్న గర్భం అనగానే సహజంగా భయం, ఆదుర్దా, ఒత్తిడి ఉంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల్ని నివారించుకోవడానికి మాత్రమే ఈజాగ్రత్తలన్నీ అని అర్ధం చేసుకోవాలి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా కొంత ఒత్తిడిని తగ్గించి తల్లీబిడ్డలు సురక్షితంగా ఉండడానికి ఉపకరిస్తాయి.
ప్రసవాన్ని ప్లాన్ చేసుకోవడం:
తల్లి ఆరోగ్యం, శిశువు స్ధితి, గర్భం ఎన్నవ నెల మొదలైన అంశాల ఆధారంగా ప్రసవ సమయం, ఏరకంగా ప్రసవాన్ని నిర్వహించాలి అనేది నిర్ణయమౌతుంది. అవసరమైతే ముందస్తు ప్రసవాన్ని నిర్వహిస్తారు. నెలలు తక్కువ, బరువు తక్కువ నవజాత శిశువుల సంరక్షణకు సదుపాయాలు ఉన్న చోట ప్రసవమైతే మంచిది.
ప్రసవానంతర సంరక్షణ:
ప్రసవంతో ప్రమాదం సమసిపోదు. కొంత సమయం వరకు తల్లీ బిడ్డల పర్యవేక్షణ అవసరం
తల్లికి:
రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్తహీనత చికిత్స, భావోద్వేగ ఆసరా,
ముందస్తు లేక తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ అవసరం.
సమగ్ర దృష్టి కోణం
గర్భం కేవలం శరీరానికి పరిమితమయింది కాదు. మనసు, భావోద్వేగాలు, కుటుంబం, సమాజిక, రాజకీయ వాతావరణం గర్భాన్ని ప్రభావితం చేస్తాయి.
చివరి సందేశం: ప్రతి గర్భం విలువైనదే. కాని ప్రమాద సూచికలు ఉన్నగర్భాలకు అదనపు జాగ్రత్తలు అవసరం. భయాన్ని జ్ఞానం భర్తీ చేసినప్పుడు నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి బలంగా నిలుస్తుంది
డా.ఆలూరి విజయలక్ష్మి
శ్రీశ్రీ హోలిస్టిక్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పటల్స్, హైదరాబాద్,
98490 22441



