సాంస్కృతికోద్యమం కావాలిప్పుడు. సంఘ సంస్కరణకు నడుం కట్టాలి. కుల నిర్మూలన జరగాలి. కుల రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. సామాజిక అసమానతలపై సమైక్యంగా పోరాడాలి. అది మాత్రమే నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలదు. అసమానతలు ఆర్థికపరమైన వాటితో పాటు సామాజికమైన వివక్ష, అంతరాలు వ్యవస్థీకృతమై సాగుతున్న తరుణాన, సామాజిక బుద్ధిజీవులందరూ, కళాకారులు, రచయితలు, మేధావులు అందరూ కలిసి ఒక మహోద్యమాన్ని నిర్మించాలి. అందుకు ముందుగా ఒక అడుగేయాలి. ఈ దేశంలోనే తొలిసారి సామాజిక విప్లవకారుడిగా, సంస్కర్తగా అడుగులు వేసిన మహత్మా జ్యోతిరావుపూలే జన్మదినం సందర్భంగా ప్రతిన బూనాలి. అలాంటి ఒక ప్రయత్నానికి పూనుకున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్తంగా చేపట్టిన సాంస్కృతికోత్సవాల నిర్వహణను స్వాగతిద్దాం.
నిజంగా ఈ దేశం అనేక దశాబ్దా లుగా విస్మరించిన వైతాళికుడు ఫూలే. ఫూలే అంటే వ్యక్తిగా కాదు, ఈ దేశపు సామాజిక అపసవ్యతపై గళమెత్తిన, ఆచరణాత్మక అడుగులెత్తిన వాడు ఫూలే.ఈ సమాజం ఎలా ఉందో వాస్తవిక దృష్టితో చూసి, గుర్తించి, వాటిని ‘గులాం గిరి’లో అవగాహన చేయించి, ఉద్యమానికై నడుంకట్టిన మహానేత ఆయన. స్నేహితుని వివాహంలో అవమానానికి గురయిన ఫూలే, సమా జం ఎంతటి అమానవీయంగా ఉందో అర్థం చేసుకున్నాడు. సామాజిక విప్లవానికి విద్య ఒకటే ఆయుధమని తలచాడు. చదువు అందించడం ద్వారానే మార్పును తీసుకుని రాగలమని భావించి, అందుకు తన జీవితమంతా కృషిచేశాడు. 1848లోనే తన భార్య సావిత్రిబాయి ఫూలేకు ముందుగా చదువు నేర్పి, ఆమెతో దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించినాడు. 1848కి ఒక ప్రత్యేకత ఉంది. అదే సంవత్సరం ఈ ప్రపంచానికి ఒక కొత్తచూపుతో ఆచరణ ప్రణాళికను అందించారు మార్క్, ఎంగెల్స్‌లు. మార్క్స్, ఫూలేలు ఇద్దరూ సమాజంలోని అట్టడుగు వర్గాల విముక్తిని, అభ్యున్నతిని కోరుకున్న వారే! ఫూలే ఆశయం, మార్క్స్ ఆశయం ఆచరణలోకి రాకుండా అడ్డుకుంటున్న శక్తులేవో అర్థం చేసుకోవాల్సి ఉంది. భావాలు భౌతికరూపం దాల్చితేనే విప్లవాలు సాధ్యమవుతాయి. అందుకే సామాజిక అణచివేతలపై, పీడనపై విస్తృత ప్రచారం జరగాలి. ప్రజలను చైతన్యపరచాలి. ఇప్పటికీ కుల దురహంకార హత్యలు, సాంఘిక బహిష్కరణలు, గుళ్లలో ప్రవేశ తిరస్కరణలు, అడుగడుగునా వివక్షతలు, చంపడాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి రాజకీయ వ్యవస్థలు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలూ మౌనంగా చూస్తున్నాయి. మన రాజ్యాంగం కల్పించిన అందరూ సమానమనే భావన ఎందుకూ కొరగాకుండా పోయింది. అందుకే ”సామాజిక స్వేచ్ఛలేనిదే, చట్టం ద్వారా వచ్చే స్వేచ్ఛ నిరర్థకం” అన్నాడు అంబేద్కర్. ‘కులం అనేది శ్రమ విభజనే కాదు, అది కార్మి కుల విభజన’ అనే నినాదాన్ని ఇచ్చాడు. ఈ స్ఫూర్తితోనే కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు ఫూలే జయంతి నుంచి అంబేద్కర్ జయంతి వరకు నిర్వహిస్తూ ఆచరణాత్మక ప్రయత్నం మొదలెయ్యటం అభినందనీయం.
ఫూలే, అంబేద్కర్, పెరియార్, కందుకూరి, గురజాడ మొదలైన ఎందరో సంఘ సంస్కర్తలు సామాజిక అసమానతలపై కృషిచేసిన వారసత్వం మనది. కానీ, వీరి ప్రయత్నాలకు పూర్తి విరుద్ధమైన మను ధర్మశాస్త్రాన్ని తిరిగి ఆచరణలోకి తెచ్చే మతతత్వ రాజకీయాలు ఆది óపత్యంలోకి వచ్చాయి. హిందూత్వం గొప్ప జీవన ఆచరణగా ప్రచారం చేస్తున్నారు. కానీ హిందూ ధర్మశాస్త్రాలు, ఒకే నేరానికి వివిధ వర్గాలకు వివిధ శిక్షలు విధించాయి. బ్రాహ్మణుడు నేరం చేస్తే ప్రాయశ్చితం, శూద్రుడు చేస్తే కొరడా దెబ్బలు. చండాలుడు చేస్తే, మరణదండన. ఇదీ వారి ధర్మం. మహిళలను మరింత హీనంగా చూస్తుంది ఈ ధర్మశాస్త్రం. అందుకే, ఈ మతతత్వ ప్రమాదాన్ని, మతం పేరు చెప్పి చేస్తున్న దోపిడీని ఎదుర్కోవాలి అంటే, మనుషుల్ని విభజిస్తున్న కులవ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించాలి. నిర్మూలించాలి. ఆర్థిక దోపిడీకి కొత్త పుంతలు తొక్కిన ప్రపంచీకరణ, అస్తిత్వ ఉద్యమాలకు ఆయువు పోసింది. దాని ప్రభావంగా సమాజం మరింత విభజనకు గురవుతున్నది. అంబేద్కర్ కోరుకున్న కుల నిర్మూలనకు బదులు కుల స్థిరీకరణ పెరిగింది. ఈ విభజనలకు రాజకీయ ప్రయోజనమూ అండగా నిలబడు చున్నది. ఈ సందర్భంలో ఫూలే, అంబేద్కర్ నిజమైన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవటం మనందరి బాధ్యత.
పూలే, అంబేద్కర్ స్ఫూర్తి కొనసాగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



