Sunday, April 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్టాలిన్‌ బాక్సింగ్‌, మమత మ్యాచ్‌ ఫిక్సింగ్‌

స్టాలిన్‌ బాక్సింగ్‌, మమత మ్యాచ్‌ ఫిక్సింగ్‌

- Advertisement -

2026 శాసనసభ ఎన్నికల పోరాటంలో మరో కీలకమైన ఘట్టం ఈ నెల 27న ముగియనుంది. 23 తమిళనాడులో పూర్తిగానూ, బెంగాల్‌లో తొలిదశ (మలిదశ 27) పోలింగ్‌ జరగనుంది. మిగిలిన చోట్లతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేకమైన దృశ్యాన్నే అవీష్కరిస్తున్నాయి. దక్షిణ భారతంలో మొదటి నుంచి ప్రాధాన్యత వహిస్తున్న తమిళనాడులో డిఎంకె దేశంలో 2004 నుంచి బీజేపీని నికరంగా ఎదుర్కొంటున్న ఒకే ఒక ప్రాంతీయ లౌకిక పార్టీగా వుంది. ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో పాటు ఇతర లౌకిక శక్తులతో కాంగ్రెస్‌తో కలసి ఎన్నికలలో మరోసారి అధికారం నిలబెట్టు కోవడానికి పోరాడుతున్నది, ఇక సీపీఐ(ఎం), వామపక్షాలు 34 ఏళ్లపాటు అవిచ్చిన్నంగా పాలించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిన పశ్చిమబెంగాల్‌ లో మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నాలుగోసారి అధికారంలోకి రావడానికి నానా పాచికలు వేస్తున్నది. డిఎంకె 2004 తర్వాత బీజేపీ మతతత్వ రాజకీయాలను గట్టిగా వ్యతిరేకించే వైఖరి తీసుకుంటే టిఎంసి బీజేపీతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో పాలన చేస్తుంటుంది. అందుకే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు చోట్ల పరిణామాలు ఆసక్తికరంగా వుంటాయి.

తమిళనాడు వారసత్వం, కూటములు
తమిళనాడుకు బ్రిటిష్‌ వారి ప్రెసిడెన్సీ కాలం నుంచి దానికి రాజకీయ పాలనా ప్రాధాన్యత కొనసాగు తున్నది. ఏపీ, కేరళ, కర్నాటక వంటి మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కొన్ని భాగాలు ఆ ప్రెసిడెన్సీలో భాగంగా వున్నవే. సామాజిక న్యాయం, సామ్యవాద భావజాలం కోసం పోరాటాలు అక్కడ బయలుదేరి వ్యాపించడం కూడా చూస్తాం. 1957లో కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడితే 1967లో తమిళనాడులో తొలి డిఎంకె ప్రభుత్వం అన్నాదురై నాయకత్వాన ఏర్పడింది. తర్వాత కాలంలో కరుణానిధి, జయలలిత, ఫళనిస్వామి, స్టాలిన్‌ల నాయ కత్వంలో ఈ పరంపర కొనసాగుతున్నది. కరుణానిధి హయంలో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చాక మళ్లీ డిఎంకె అటువైపు చూడలేదు. జయలలిత వుండగా తర్వాత ఇప్పటికి కూడా అన్నా డిఎంకె బీజేపీతో సన్నిహితంగా వుంటున్నది. ఈ ఎన్నికలలోనూ డిఎంకె వామపక్షాలు, కాంగ్రెస్‌ తదితర శక్తులతో లౌకిక కూటమి, అన్నా డిఎంకె -ఎన్‌డిఎ కూటమి ప్రధానంగా పోటీలో వున్నాయి. సీట్ల సర్దుబాటులో ఒడిదుడుకులు ఎదురైనా పరిష్కారం చేసుకుని కేంద్రం నిరంకుశత్వం మతతత్వ రాజకీయాలపై ఈ కూటమి పోరాడుతున్నది.ఈ క్రమంలో సీపీఐ(ఎం), సీపీఐలకు గతంలో వున్న వాటికన్నా ఒక స్థానం తక్కువ చేసి చెరి అయిదు చొప్పునే కేటాయించినా విశాల జాతీయ ప్రయోజనాల కోణంలో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల ముందు ప్రభుత్వంలో భాగస్వామ్యం వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కాంగ్రెస్‌ తర్వాత తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక కమల్‌హసన్‌ మక్కల్‌ నీతి మగం(ఎంఎన్‌కె శాసనసభకు పోటీ చేయకుండా మద్దతునిస్తున్నది. స్టాలిన్‌ తమకు ప్రేమతో స్థానాలివ్వగా తాము ప్రేమతోనే నిరాకరించామని కమల్‌ ప్రకటించారు. తమను రాజ్యసభకు పంపిన కారణంగా వాణిని దేశమంతా వినిపిస్తున్నామని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కూటమిలో డిఎంకె 164, కాంగ్రెస్‌ 28, డిఎండికె 10, విసికె 8, ఎండింఎంకె4, ఐయుఎంఎల్‌, కెఎం డికె, ఎంఎంకె తల రెండుచొప్పున, ఇంకో నాలుగు పార్టీలు ఒక్కొక్కటి చొప్పున పోటీ చేస్తున్నాయి. ఈ విధంగా చూస్తే అధికారంలో వున్నప్పటికీ డిఎంకె అందరికీ చోటు కల్పించి తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలలో నిమగమైంది,
మరో వైపున మాజీ ముఖ్యమంత్రి ఇవి ఫలని స్వామి నాయకత్వంలో అన్నా డిఎంకె 167, బీజేపీ 27, పిఎంకె (చీలిక వర్గం)18, శశికళ మేనల్లుడు దినకరన్‌ ఎఎంఎంకె 11 ఇలా పోటీ చేస్తున్నాయి. జయలలిత మాజీ నెచ్చెలి శశికళ స్థాపించిన ఎఐపిటిఎంఎంకె 21 చోట్ల పోటీ పెట్టి హడావుడి చేస్తున్నది. ఆకర్షణ విశ్వస నీతయ గల నాయకులు లేకపోవడం ఒక పెద్ద ప్రతిబంధకమైతే అనైక్యత కూడా ఈ కూటమికి పెద్ద సమస్యగా వుంది. చాలా హడావుడి చేసిన బీజేపీ నాయకుడు అన్నామలైకి కూడా టికెట్‌ ఇవ్వకుండా దూరం పెట్టడం అందుకో ఉదాహరణ మాత్రమే. తమిళనాడులో వివిధ కులాలు, వర్గాలు వాటి నాయకుల చీలికలను బట్టి కూడా పార్టీలు పెట్టుకుంటూ పోవడం పరిపాటి.

విజయ్‌ ఎఫెక్ట్‌?
ప్రధాన పోటీ ఈ రెండు కూటముల మధ్యనే అయినప్పటికీ ప్రముఖ కథానాయకుడు దళపతి విజయ్‌ స్థాపించిన తమిళ వెట్రి కజగం(టివికె) తమిళనాడు ఎన్నికల దృశ్యాన్ని కాస్త తికమకచేసింది. యువతలో వున్న సినీ ఆకర్షణను ఉపయోగించుకుని విజరు పెద్దపెద్ద మాటలతో హడావుడిగా మొదలెట్టారు. క్రైస్తవ ముస్లిం ఓట్లను డిఎంకెకు దూరం చేయడంలో ఆయన ప్రభావం వుంటుందని మీడియా కొన్ని జోస్యాలు చెప్పింది. బీజేపీ కూడా విజయ్‌ జోసఫ్‌ అంటూ ఆయన మతాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినా తర్వాత దాగుడు మూతలాడింది. అయితే తొక్కిసలాట ఘటన తర్వాత విజరు కొంతకాలం కనిపించకుండా పోయారు. తన ప్రధాన శత్రువు డిఎంకె అంటూనే విజరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించారు. లౌకిక విలు వలకు కట్టుబడివుంటానని తెలిపారు. ఆయన వైఖరి స్పష్టమైన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు మారింది, ఆయన చిత్రం జననాయగన్‌ విడుదల కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆ చిత్రం లీక్‌ కావడం వివాదంగా మారింది. కొన్ని నియోజకవర్గాలలో విజరు ప్రభావం డిఎంకె విజయానికి దోహదం చేస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా తమిళనాడులో కాలూనడానికి విఫలయత్నం చేసి విరమించుకున్నారు. తమాషా ఏమంటే సనాతనం వివాదం దేశమంతటా రగిలింది గానీ ఈ ఎన్నికలలో ఏ పార్టీ కూడా ఆ సంప్రదాయ వర్గాలకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వడానికి వెనుకాడింది. మరో వైపున సర్‌ పేరిట భారీగా ఓట్ల తొలగింపు కూడా విమర్శలకు కారణమైంది. ఏది ఏమైనా స్టాలిన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారనే భావన బలంగా వినిపిస్తున్నది.

బెంగాల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
దేశంలో మరెక్కడా లేని వింత పరిస్థితి బెంగాల్‌లో చూస్తాం. ఎన్నికలు వస్తున్నాయనేంతవరకూ బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తుందని మీడియా ఊదరగొడుతుంది. తీరా దగ్గరకొచ్చాక మరోసారి మమతానే అనే కథనాలు ప్రారంభిస్తుంది. బీజేపీ నేతలు కూడా మొదట మమతపై చిందులు తొక్కుతారు. కానీ ఎలాంటి నిజమైన చర్యలు తీసుకోరు. త్రిశూల వ్యూహంతో దేశమంతటా తమకు నచ్చని ముఖ్యమంత్రులను కూడా అరెస్టులు చేసిన కేంద్ర సంస్థలు, ఆరెకె కర్‌ ఆస్పత్రి వంటి దారుణఘటనల నుంచి రిక్రూట్‌మెంట్‌ స్కాం వంటివాటివరకూ, ఇంకా వెనక్కు వెళితే శారదా చిట్స్‌ కుంభకోణం వరకూ, రైల్వే కేటాయింపుల కుంభకోణాల వరకూ, దేన్ని చివరంటా కొనసాగించవు. కాకపోతే ఈ మధ్యలో కొందరు నాయకులు అటూ ఇటూ మారతారు. ఇప్పుడు బీజేపీకి అతి కీలకనేతగా వున్న సువేందు అధికారి కూడా మమతా వారసుడుగా వెలుగొందిన ఆమె మేనల్లుడే! గవర్నర్‌లు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా బెంగాల్‌లో ప్రత్యక్ష వ్యాఖ్యలు చేసి ప్రకంపనలు పుట్టిస్తారు, కానీ, చివరకు కథ మామూలే. ముఖ్యమంత్రి మమత సరేసరి, పదవితో నిమిత్తం లేకుండా ఎక్కడికక్కడ దిగబడటం, ధర్నాలు చేయడం కాగితాలు లాక్కోవడం వంటివి చేసి వివాదాలు తీసుకొస్తారు. తీరా అంతా చడీ చప్పుడు లేకుండా ముగిసిపోతుంది. శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బెంగాల్‌లో తమ ఎన్ని కల ప్రణాళిక విడుదల చేశారు. టింఎంసి నుంచి నిష్క్రమించి స్వంతంగా ఒక పార్టీ పెట్టుకుని బెంగాల్‌లో బాబరీ మసీదు నిర్మాణం వంటి వివాదాలకు కారకుడైన హుమయూన్‌ కబీర్‌ బీజేపీ దగ్గర వెయ్యి కోట్ల రూపా యలు తీసుకున్నానని చెప్పినట్టు ఒక విడియో అదే సమయంలో వైరల్‌ అయింది. కబీర్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పాల్గొంటున్న మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ వెంటనే తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఒవైసీపై ఆ ఆ ఆరోపణ ఎప్పుడూ వుంటున్నదే. ఇవన్నీ కేవలం ఒక ద్విముఖ పోటీ వాతావరణం తీసుకురావడానికేనని, మూడవ పెద్దశక్తిగా వున్న వామపక్షాన్ని పక్కకు నెట్టడానికేనని అర్థమవుతున్నది.

గత ఫలితాల సంకేతం?
2011లోతొలిసారి తృణమూల్‌- కాంగ్రెస్‌తో కలసి గెలిచింది. మత శక్తుల నుంచి మావోయిస్టు గ్రూపుల వరకూ ఆమెతో చేతులు కలిపాయి. 2016లో వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ కలసిపోటీ చేశాయి. టింఎసికి 45.6శాతం ఓట్లు రాగా ఈ కూటమికి 38.6శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ 2016లో కేవలం 10శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఈ ఓట్ల చీలిక కూడా 2021లో టింఎసిని గెలిపించబోదని అర్ఠమైపోయింది. ఎట్టి పరిస్థితులలో సీపీఐ(ఎం) వామపక్షాలు మళ్లీ పూంజుకోవడం బీజేపీ భరించలేని విషయం. అందుకే ఆరోజు మొదలు రకరకాల ఎత్తుగడలతో రాష్ట్రంలో వివాదాలు పెంచుతూ మమతా బెనర్జీని వాటిపై పోరాడే నేతగా ముందుకొచ్చే అవకాశమిస్తూ వచ్చింది. మీడియా కూడా ఆమె నాటకీయ పోకడలను ముందుకు తెస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల నిరంతర పోరాటాలను తొక్కిపట్టింది. ఇదే తరుణంలో రాష్ట్రంలో వారిపై తీవ్ర నిర్బందం సాగుతున్న సంగతి గుర్తుంచుకోవాలి. 2019 లోక్‌సభ ఎన్నికలలో 121 అసెంబ్లీ విభాగాలలో బీజేపీ,164 చోట్ల తృణమూల్‌ ఆధిక్యత పొందాయి. ఈ సారి ఒక సగం, రేపు పూర్తిగా ఖాళీ అని బీజేపీ ప్రచారం చేసింది, కానీ 2021 ఎన్నికలలో 77కు తగ్గింది. పచ్చి అవినీతి, అరాచకంలో కూరుకుపోయిన టిఎంసి 213కు పెరగడం వారికే నమ్మశక్యం కాలేదు! 2024 ఎన్నికలలోనూ ఈ బీజేపీ తగ్గింది, ఇక కాంగ్రెస్‌ అన్నిచోట్ల లాగే ఇక్కడా లౌకిక స్పృహ కన్నా తమ పట్టుపెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తమిళనాడులో వలె గాక బెంగాల్‌లో త్రిముఖ పోటీ ద్విముఖ పోటీగా జరుగుతున్నది. సవాళ్ల మధ్య సీపీఐ(ఎం) అనేకమంది యువ అభ్యర్థులను పోటీకి నిలిపింది. సీనియర్‌ నాయకులందరూ ప్రచారం లోనూ, ఉద్యమ పటిష్టతలోనూ కేంద్రీకరిస్తున్నారు. కొన్ని స్థానాల్లో యువ అభ్యర్థులు ప్రభావం చూపగలరని గతం కన్నా నిలదొక్కుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. పదిహేనేళ్ల ఏళ్ల తృణమూల్‌ పాలన, పన్నెండేళ్ల మోడీ పాలన దుష్ఫలి తాలను పక్కన పెట్టి ఇప్పటికీ వామపక్ష పాలనపై విష ప్రచారంలో బడా మీడియా తలమునకలవుతున్నది. సర్‌ పైన కేసు వేసి సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి మమతా దీది చాలా హంగామా చేశారు. కానీ, దాదాపు కోటి ఓట్ల తొలగింపును మాత్రం అడ్డుకోలేక పోయారు. ముస్లిములను దళితులను అధికంగా తొలగించారనే కథనాలు తమ పార్టీకి ఎన్నికల్లో లబ్ది చేకూరుస్తాయని ఆమె వ్యూహం. బంగ్లాదేశ్‌లో ఇటీవలి కల్లోలం కూడా ఆమె ప్రచారానికి బీజేపీ మత రాజకీయాలకు ఇంధనంగా మారింది. తమకు అవకాశం లేదనుకున్న చోట బీజేపీ మ్యాచ్‌ పిక్సింగ్‌ ఎంత ఫకడ్బందీగా వుంటుందనేందుకు బెంగాల్‌ ఒక నిదర్శనం. మే 4న వెలువడనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ రకాల గుణపాఠాలు అందించబోతు న్నాయనడంలో సందేహం లేదు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -