Sunday, April 12, 2026
E-PAPER
Homeసోపతినిజం అబద్దం: ఒక అంతర్మథనం

నిజం అబద్దం: ఒక అంతర్మథనం

- Advertisement -

మానవ జీవితం నిత్యం నిజం అబద్ధాల మధ్య సాగే ఒక నిత్య సంఘర్షణ. మనం ఏ మార్గాన్ని అనుసరిస్తాం అనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. నిజం ఎప్పుడూ ఎప్పుడు నిజాన్ని చూపే అద్దం లాంటిది. అది మన కళ్ల ముందు నిలబడి, మనం కప్పుకున్న ముసుగులను తొలగించి, ”నువ్వు తప్పు చేస్తున్నావు” అని వేలెత్తి చూపిస్తుంది. కానీ ఆ నిజాన్ని అంగీకరించే గుండె ధైర్యం మనలో ఎంతమందికి ఉంది?

నిజం మన తప్పును ఎత్తిచూపిన మరుక్షణమే మనలోని ‘అహం’ పడగ విప్పుతుంది. మనతప్పులను మనం ఒప్పుకోవడానికి అసలు సిద్ధంగా ఉండము. సరిగ్గా అప్పుడే అబద్ధం మనకు ఒక ప్రాణ స్నేహితుడిలా కనిపిస్తుంది. మన భుజం తట్టి, ”పర్వాలేదు, తప్పు నీది కాదు. కాలానిది లేదా ఎదుటివారిది” అని తియ్యగా చెబుతుంటే, మన మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది నిజాన్ని కాదని, హాయినిచ్చే అబద్ధాన్ని కౌగిలించుకుంటారు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి అంటారు కానీ, అంతకంటే ఎక్కువ ధైర్యం నిజం ‘వినడానికి’ కావాలి. నిజం మన బద్ధకాన్ని గట్టిగా ప్రశ్నిస్తూనే మన బాధ్యతను గుర్తు చేస్తుంది. కానీ అబద్ధం అలా కాదు, మన పొరపాట్లకు వంద సాకులు వెతికి పెడుతుంది. మనిషికి తన గురించి తాను తక్కువగా వినడం అంటేనే అంతులేని భయం. ”నువ్వు మారాలి” అని ఎవరైనా అంటే అది విషంలా అనిపిస్తుంది.

అదే ”అందరూ చేసేదేగా, ఇందులో తప్పేముంది?” అనే మాటలు వినడానికి మత్తు మందులా పనిచేస్తాయి.వ్యక్తిగత జీవితాలే కాదు, నేడు సమాజం మొత్తం కూడా అబద్ధాల పునాదుల మీదనే నడుస్తోంది. రాజకీయాల నుంచి మీడియా వరకు అబద్ధాలే రాజ్యమేలుతున్నాయి. ఎందుకంటే నిజం ‘అమ్ముడుపోదు’. నిజం ఎప్పుడూ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నిజం విన్నప్పుడు మనం మారాల్సి వస్తుంది, శ్రమించాల్సి వస్తుంది. కానీ అబద్ధం విన్నప్పుడు మనం ఉన్న చోటే ఉండొచ్చు. బాధ్యత నుంచి తప్పించుకోవడమే అబద్దం ఇచ్చే అతిపెద్ద ఆకర్షణ.అబద్ధం తాత్కాలికంగా మనల్ని కాపాడుతున్నట్లు అనిపించినా, అది మనల్ని లోపలి నుంచి ఖాళీ చేసేస్తుంది. అబద్ధాలను నమ్మి నమ్మి, చివరకు మనకు నిజాన్ని గుర్తించే శక్తి కూడా నశించిపోతుంది.

నిజం: ఒకేసారి గాయం చేస్తుంది, కానీ మనల్ని మేల్కొల్పుతుంది.
అబద్ధం: మెల్లగా మత్తు ఇస్తూ మనల్ని నాశనం చేస్తుంది. ఆ మత్తు దిగిన రోజున జరిగే నష్టం కోలుకోలేనిది. నిజానికి మనం నిజాన్ని ద్వేషించడం లేదు, నిజం మన అసలు రూపాన్ని బయటపెడుతుందేమోనని భయపడుతున్నాం. కానీ ఈ భయాన్ని వీడి, నిజాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్న రోజే మన నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. అబద్ధం మనసుకు నచ్చవచ్చు కానీ, అది మన జీవితాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేదు.
నిజం నిప్పులాంటిది- ముసుగులను కాల్చివేస్తుంది, కానీ మార్గాన్ని చూపిస్తుంది!అబద్ధం మత్తులాంటిది-కమ్మని నిద్రనిస్తుంది, కానీ నిన్ను శవంగా మారుస్తుంది! భయాన్ని వీడి నిజం వైపు అడుగువేయి- అక్కడే నీ అసలైన గెలుపు మొదలవుతుంది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -