– ఛేదనలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రదర్శన
– ప్రియాన్షు, ప్రభుసిమ్రన్ అర్ధ సెంచరీలు
– అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ వృథా
– హైదరాబాద్‌పై 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్ గెలుపు
పంజాబ్ కింగ్స్ ఓటమెరుగని జోరు కొనసాగుతుంది. శ్రేయస్ అయ్యర్ (69 నాటౌట్), ప్రియాన్షు ఆర్య (57), ప్రభుసిమ్రన్ సింగ్ (51) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. శ్రేయస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరువగా 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలోనే ఊదేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ (74) మెరుపు విన్యాసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత 219 పరుగులు చేసింది. ఆరెంజ్ ఆర్మీకి ఇది మూడో ఓటమి కాగా, పంజాబ్ కింగ్స్‌కు ఇది మూడో విజయం.
నవతెలంగాణ-ముల్లాన్‌పూర్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. 220 పరుగుల లక్ష్యాని ఆడుతూ పాడుతూ మరో 7 బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (69 నాటౌట్, 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో దంచికొట్టాడు. ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య (57, 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభుసిమ్రన్ సింగ్ (51, 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీలతో చెలరేగారు. ముగ్గురు బ్యాటర్లు అర్థ సెంచరీలతో రాణించగా, ఏ దశలోనూ సన్‌రైజర్స్ బౌలర్లు పంజాబ్ కింగ్స్‌ను ఒత్తిడికి గురి చేయలేదు. 18.5 ఓవర్లలో 4 వికెట్లకు పంజాబ్ కింగ్స్ 223 పరుగులు చేసింది. సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడో విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుగా ముగిసిన సంగతి తెలిసిందే. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (74, 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించాడు. ట్రావిశ్ హెడ్ (38, 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (39, 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
దంచికొట్టారు
220 పరుగుల ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రియాన్షు ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్‌లు పవర్‌ప్లేలో సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్ల దూకుడుతో 6 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 93/0తో నిలిచింది. ప్రియాన్షు ఆర్య ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించగా, ప్రభుసిమ్రన్ సింగ్ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 24 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు సహా కూపర్ కానొలి (11) అవుటైనా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలబడ్డాడు. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 24 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్.. సన్‌రైజర్స్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. నేహల్ వదేరా (14), శశాంక్ సింగ్ (16 నాటౌట్) శ్రేయస్‌కు చక్కటి సహకారం అందించారు. క్లీన్ హిట్టింగ్ చేసిన అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు మూడో విజయాన్ని కట్టబెట్టాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ (3/33) మూడు వికెట్ల ప్రదర్శనతో మెప్పించాడు.
అభిషేక్ అదరహో
పంజాబ్ కింగ్స్‌పై అభిషేక్ శర్మ (74) మరోసారి పంజా విసిరాడు. గత సీజన్‌లో పంజాబ్‌పై 55 బంతుల్లోనే 141 పరుగులు చేసిన అభిషేక్.. ముల్లాన్‌పూర్‌లో ఆ తరహా ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో చెలరేగిన అభిషేక్ శర్మ పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కు మూడంకెల స్కోరు అందించాడు. 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 18 బంతుల్లోనే అభిషేక్ అర్థ సెంచరీ సాధించాడు. ట్రావిశ్ హెడ్ (38) నెమ్మదిగా ఆడినా.. అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్లు కుదేలయ్యారు. అభిషేక్ ధనాధన్ విన్యాసంతో 8 ఓవర్లలో సన్‌రైజర్స్ 120/0తో భారీ స్కోరు దిశగా సాగింది. ఈ దశలో సన్‌రైజర్స్ 300 పరుగులు చేస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
చప్పగా ముగింపు
సన్‌రైజర్స్ జోరుకు ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఊహించని బ్రేక్ పడింది. శశాంక్ సింగ్ ఒకే ఓవర్లో ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మలను అవుట్ చేశాడు. భీకర ఫామ్‌లో ఓపెనర్లు డగౌట్‌కు చేరగా.. సన్‌రైజర్స్ జోరు మందగించింది. ఇషాన్ కిషన్ (27) మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసినా వికెట్ నిలుపుకోలేదు. హెన్రిచ్ క్లాసెన్ (39) ఆఖరు వరకు క్రీజులో నిలిచినా పరుగుల వేటలో నిరాశపరిచాడు. అనికెత్ వర్మ (18), సాలిల్ అరోర (9) ఆశించిన దూకుడు కనబరచలేదు. ఆఖరు రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ చెత్తగా బ్యాటింగ్ చేసింది. తొలి 8 ఓవర్లలో 120 పరుగులు చేసిన సన్‌రైజర్స్.. తర్వాతి 12 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది. 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 219 పరుగులతో సరిపెట్టుకుంది. శశాంక్ సింగ్ రెండు వికెట్ల ఓవర్ స్ఫూర్తితో పంజాబ్ కింగ్స్ ఇతర బౌలర్లు సైతం ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశారు. ప్రమాదకర సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేయటంలో విజయవంతం అయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉండగా.. ఆఖరు రెండు ఓవర్లలో హైదరాబాద్ 13 పరుగులే చేసింది. దీంతో ఓ దశలో 250-260 దాటుతుందని అనిపించిన స్కోరు 219 వద్ద ఆగిపోయింది. పవర్‌ప్లేలోనే 105 పరుగులు చేసిన హైదరాబాద్.. విధ్వంసక బ్యాటింగ్ లైనప్‌ను 219కి కట్టడి చేయటంలో పంజాబ్ కింగ్స్ విజయవంతమైంది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ (సి) అర్ష్‌దీప్ సింగ్ (బి) శశాంక్ సింగ్ 74, ట్రావిశ్ హెడ్ (సి) బార్ట్‌లెట్ (బి) శశాంక్ సింగ్ 38, ఇషాన్ కిషన్ (సి) యాన్సెన్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 27, హెన్రిచ్ క్లాసెన్ (సి) కానొలి (బి) బార్ట్‌లెట్ 39, అనికెత్ వర్మ (రనౌట్) 8, సాలిల్ అరోర (సి) బార్ట్‌లెట్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 9, నితీశ్ కుమార్ రెడ్డి నాటౌట్ 0, హర్ష్ దూబె నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219.
వికెట్ల పతనం : 1-120, 1-122, 3-169, 4-195, 5-214, 6-218.
బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్ 4-0-50-2, జేవియర్ బార్ట్‌లెట్ 4-0-42-1, మార్కో యాన్సెన్ 4-0-40-0, విజరు కుమార్ వైశాక్ 2-0-33-0, శశాంక్ సింగ్ 3-0-20-2, యుజ్వెంద్ర చాహల్ 3-0-33-0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : ప్రియాన్షు ఆర్య (సి) నితీశ్ కుమార్ (బి) శివాంగ్ కుమార్ 57, ప్రభుసిమ్రన్ సింగ్ (సి) క్లాసెన్ (బి) శివాంగ్ కుమార్ 51, కూపర్ కానొలి (సి) అనికెత్ (బి) శివాంగ్ కుమార్ 1, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 69, నేహల్ వదేరా (బి) హర్ష్ దూబె 14, శశాంక్ సింగ్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 223.
వికెట్ల పతనం : 1-99, 2-117, 3-128, 4-197.
బౌలింగ్ : హర్ష్ దూబె 4-0-38-1, జైదేవ్ ఉనద్కత్ 3-0-40-0, ఈషన్ మలింగ 3-0-46-0, హర్షల్ పటేల్ 2-0-39-0, శివాంగ్ కుమార్ 4-0-33-3, నితీశ్ కుమార్ రెడ్డి 2-0-20-0, అభిషేక్ శర్మ 0.5-0-7-0.



