ఏందిరా అరుణ్! కలర్స్ పండుగ ఎల్లుండి గదరా. నువ్వు ఈరోజే ఫేసుకంతా రంగు జమాయించి నట్టున్నది!’
‘అక్కా, మా ఫ్రెండ్స్ ఫుల్లు అడ్వాన్స్.’ యూనిఫామ్స్ ఖరాబైతయని ఫేసుకు ఏదో లైటుగా పూస్తున్నరు.
హోలీ రోజు చూడు ఫుల్ జోష్.
‘నీ ప్లాన్ ఏందక్కా, ఏంచేద్దామ్!’
‘నో ప్లాన్ రా, మమ్మీ వాళ్లు పెద్ద ఇంట్రెస్ట్‌గా లేరురా’
‘అక్కా అయితే మమ్మీకి లేకుంటే డాడీకి థౌసండ్ రుపీస్ టెండరేద్దమ్’
‘యేషి?’
‘కలర్స్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని పొద్దుగాలనే బయటికి వురుకో వురుకు.’
‘ఒకేరా..,’
హోలీ పండుగ రెండు రోజులు ఉండంగానే పదో క్లాస్ చదువుతున్న నా బిడ్డ కిరణ్, ఎనిమిదో క్లాస్ చదువుతున్న నా కొడుకు అరుణ్‌లు ముందటి రూమ్‌ల హోమ్ వర్క్ చేసుకుంటా, చదువు కుంటా, ఆ రంగులెన్ని, ఈ రంగులెన్ని, వాటి కాంబినేషన్ ఎట్లుండాలె, ఎనుకింటి, పక్కింటి, కాలనీ జాన్‌జిగ్రీ దోస్తుల మీద ఎట్లాంటి రంగులు గుప్పాలని, ఎట్లా మస్తు మజా, ధూమ్ ధామ్‌గా దాం ధూమ్‌గా రంగుల సునామీ కలబోతలతోటి యిడివడని ముచ్చట్లు.
పక్క రూముల పని చేసుకుంటా గాళ్ళ ముచ్చట్లు యింటాంటే నా సిన్నప్పటి హోలీ రంగులు వద్దనుకున్నా యాదొచ్చినయి. ఇప్పటి పిల్లగాండ్లు ఆడుకునే హోలీ ఆటకు, మేము ఆడుకున్న దానికి షాన తేడా. మా పిల్లల కంటే ఇంకా చిన్న వయసులనే ఈ రంగుల పండుగను ఆడుకున్న యాదులు అలుగు దునికినయి.
కాముని పున్నం ఇంకా పదిహేన్రోజులు ఉందనగా నెలపొడుపు కనబడ్డ తెల్లారి కాన్నూశీచి మా అక్కలు, వాళ్ల దోస్తులు, వదినలు, చిన్నమ్మలు, అత్తలు, గుంపులు, గుంపులుగా కామునాట మొదలు పెడుదురు. పొద్దుగాల లేసి బువ్వ కూరండి కామునాటకు పోదురు. ఇంటింటికి తిరిగి చప్పట్లు కొట్టుకుంటా తియ్యటి రాగాలతోని పాటలు పాడుదురు. ‘మల్లె చెట్టు కిందికెళ్లి మదానా నావయ్యారి, మదానా నా వయ్యారి పోయేటోల్లు ఎవారయ్య
మదానా నా వయ్యారి
మదానా నా వయ్యారి
పోయేటోళ్లుపోషన్న/ రాజన్న (ఆ యా ఇంటి యజమాని పేరుతో) మదాన నా వయ్యారి మదాన నా వయ్యారి’
ఇంకా….
‘సిన్నీరి మంచంబు కోల్
సన్నాపూ నులుకా కోల్ కొబ్బెర తిన్నాది కోల్ మబ్బులు గన్నాది కోల్’
యిగ ‘వోలీ వోలీల రంగ వోలీ చ్చమ్మ కేలీర వోలీ’
అప్పుడు పాడినంగానీ యిప్పుడు గుండెల గునుపం దించినట్టే ఉంటది.
గా పాటలన్నీ మొన్నటిదాకా యాదుండే. గా పాటలు యిననీకి సంబురంగా వాళ్ళ తోటి పోతుంటిమి. అట్లా వాళ్ల తోటి పోతే ఎవరి పిల్లల్ని వాళ్లు ”ఓ బిడ్డ ఇంటికి పో బువ్వ కుక్క తింటది, తలుపేసి ఇంటికాడ ఆడుకో, మీ నాయినత్తడు, వాకిట్ల జొన్నలెండ బోసిన ఎవ్వల్లేరు, ఆగమైతయి ఇంటికి పో’ అని మమ్మల్ని ఎల్లగొట్టేటోళ్ళు. పెద్దోళ్ళకు తెల్వకుంట మేము కూడా నలుగు రైదుగురాడపిల్లలం కూడి పదిండ్లు పాటలు పాడుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా తిరిగేటోళ్లము. యిగ మా తమ్ముల బ్యాచ్ ఉండేది ఒక్కోలు రెండు కోలలు పట్టుకొని ఒక సంచి పట్టుకొని జాజిరి ఆడనీకి పోదురు. అదేందో కోలలు మగ పోరలకే ఉండేది. మా ఆడపిల్లలకు సప్పట్లే గతి. ఇండ్లు తిరిగి పాటలు పాడితే పైసలిచ్చేటోళ్లు. అందరూ నెల పొడుపు పొడిచిన కాడ నుంచి కాముని పున్నం దాకా ఆడుదురు. మంచి మంచి పాటలు పాడుకుంట ఆడోల్లు, పది పన్నెండేళ్ల మగ పిల్లలు, ఆడపిల్లలు ఎవరికి వాళ్లుగా గుంపులుగా జమిలిగ పోదురు.

”జాజిరి జాజిరి జాజిరి జాజ,
జాజిరి జాజిరి జాజిరి జాజ,
వీరన్న బల్లి కోడె,
వీరా గంధంపూసుకొని,
జామచెట్ల పండా పోతే
చిన్ని పాపకు తేలు కుట్టే,
అన్ని ఊర్లు తిరిగిన గానీ
హనుమకొండ తిరుగా లేదు
జాజిరి జాజిరి జాజిరి జాజ
‘ఆ ఇంటమ్మ చాపలు పెట్టే,
ఈ ఇంటమ్మ జెల్లలు పెట్టే,
వచ్చిన సుట్టం దెబ్బకు సచ్చే
జాజిరి జాజిరి జాజిరి జాజ
ఎయ్యేయ్యి ఎయ్యేయ్యి ఎల్లిపాయ,
పోయి పోయి పోయి పోయి
నూనె బొట్టు గట్టు మీద
రాయి గరుక్కు మానే
తిరిగి చూడర పెరుగు బుడ్డి
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజా”
ఇట్లా పాటలు పాడుకుంటా తిరిగేది.
గీ మా పాటలకు ఐదు, పదిపైసలకు, పావులకు మించి ఎవ్వరు ఇయ్యకపోదురు. కొందరు పాటలు పాడిచ్చుకొని కూడా పైసలు ఇయ్యక పోయేది. కొందరైతే రేపిస్తా, మాపిస్తా, అని తిప్పుకుందురు. కొట్టి కొట్టి చేతులుబాయే, పాడిపాడి నోరుబాయే యిగానన్న దయా రాదయ్యో ఓ సారన్న’ అని పాడేది. కొందరేమో బియ్యం పోద్దురు. వాటిని సంచిల జమ జేసుకొని అమ్ముకుంటే పైసలు వస్తే, పంచుకొని పిప్పరమెట్లు బిస్కెట్లు కొనుక్కునీ ఫుల్లు ఖుషీ జేస్కునేది. నేనైతే పెన్ను పెన్సిళ్లకు అక్కరకొస్తయని రూపాయి, రెండు రూపాయలు దాపెట్టుకునేది. మనిషికి ఐదు రూపాయలొస్తే అదే పెద్ద సంతోషం. పైసలు పంచుకునే కాడ, పైస తక్కువ ఎక్కువలు వస్తే పొల్లు పొల్లు కొట్టుకొని మల్లా కూడాడుకున్న నా రంగుల యాదుల సోపతిగాల్లు మరియా, జక్కు, లక్ష్మి, నర్సు, బాల ఎక్కడెక్కడున్నరో! పది రూపాయలన్న రాకపోయే అనుకునేది. అదే మా పెద్ద ఆడోళ్లకు మనిషికి రెండు మూడు వందల దాకా వచ్చేటియి.
కాముని పున్నమ్ రాత్రి ఇంట్లో ఉన్న చెక్క వస్తువులన్నీ ఎత్తుక పోయేటోళ్లు. ఆఖరికి పండుకున్న మంచాలను కూడా యిడవకుండా, మనిషికి మేల్కరాకుంటా ఒడుపుగా కిందేసి ఎత్తుక పోయేటోళ్లు. అందుకే మా వాడ మొగోళ్ళు జాగారం జేసీ తెల్లారే దాకా కావలి ఉందురు. అట్లా కావలి ఉండీ ఉండీ, కొంచెం కన్నంటుకున్నా తలుపులు, కుర్చీలు బెంచీలు, తడుకలు లేపుకొనిపోయి కాముని కాలే గుండంల యేద్దురు. తెల్లారి, ‘వావ్వో! మా మంచాలు బాయే, తలుపులు, తడకలు, దడులు పాయె… యే దొంగ బాడుకావులు యెత్తుక పాయె’ అని బండ బూతు తిట్టేటోళ్ళు. కానీ యేనాడు ఎవ్వరు పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు పెట్టక పోయేది. పండుగ దండుగ యేశీజెత్తం’ అనుకునేటోళ్లు.
వోలి పండుగనాడు మొగోళ్ళు ఆడోళ్ళు వదిన మరదండ్లు, బావ బామ్మర్దులు, మామ అల్లుళ్ళ వరసైనోళ్ళు రంగులు పట్టుకొని, ఇల్లిల్లు తిరుగుకుంటా ఒకరి మీద ఒకరు రంగులే గాదు పెండ, బురద బూడిద, బొగ్గు, మసి, మట్టి పూసుకుందురు. నీళ్లన్నీ గుమ్మరిచ్చుదురు. అయితే గివి సాఫ్ సీదా జరగక పోవు. ఒకరికి ఒకరు దొరకకుండా, రంగు పూయకుంటా తప్పించుకొనే ఆట గమ్మతి గమ్మతి గుండె. మా చిన్న పోరగాళ్లకు పెద్దోల్లాడే గీ ఆటనే పెద్ద పండుగ తీరుండే. ఈ ఆట మద్యానము దాకా దమ్మదిమ్మ దమ్మారా ఆడుకొని పాడుకొని, మంచిగ సియ్యకూర తిని పండుకునేది. చిన్న పోరగాండ్లం మాత్రం పొద్దుగూకే దాకా ఆడుకుందుము. అట్లా గా యాదులన్ని మరిసి పోదామన్న మాసిపోవు. యివన్ని మనాదిగ మెదులు తాశీటే…
మా పిలగాళ్ళు హోంవర్కులు చేసుకొని, ముచ్చట్లన్ని ముడేసుకొని నా దగ్గరకొచ్చి ‘మమ్మికొండా! రేపే హోలీ కలర్స్ ఫెస్టివల్. తమ్ముడు నేను సర్దుకుంటమ్ ఓ తౌజండ్ కొట్టు ప్లీజ్ మమ్మా’ అని అక్కా తమ్ముడు చెరో దిక్కు నా చెంపలు, చేతులు, భుజాలు నిమురుకుంటా జుట్టు సదురుకుంటా కాక వడుతున్నరు. ‘ఏంది కొట్టేది? పైసలనుకుంటున్నరా చిల్లపెంక లనుకుంటున్నరా, పైసలు చెట్టుక్కాస్తన్నయా, స్కూల్ ఫీజులు కట్టలేక కింద మీదైతన్నం. మళ్ళా గిదోటా’ ‘ఓ.. ఓ.. మమ్మీ, మమ్మీ కూల్ రాజా కూల్. మా ఫ్రెండ్స్ పోరలు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫైవ్ తౌజండ్ వసూలు చేస్తున్నారు తెలుసా..’ మూతి ముందటికి సాపి కిరణ్.
‘వాళ్ల పండుగ గదనే గాయింత ఇయ్యరా’
‘మమ్మి హోలీ వాళ్ళ పండగేనా మన పండుగ కూడా కదనే’
‘ఎవరు చెప్పిండ్రు’
‘ఎవరు చెప్పిండ్రేందమ్మా ఎక్కడున్నావ్? టోటల్ ఇండియా అంతా హోలీ చేస్తుంది. టీవీలు, సోషల్ మీడియాలు చేసే కలర్ ఫుల్ కతలు, ఇంటలేవా చూస్తలేవా, హోలీ ఉందని గవర్నమెంట్ హాలిడే కూడా డిక్లేర్ చేసింది కదా!’ అక్కా తమ్ముడు ఒక్క గొంతై.
నువ్వైతే మా ఏజ్‌లో ఉన్నప్పుడు ఫుల్లుగా ఎంజారుగా పాటలు, ఆటలు జోరుగా కలర్స్‌తో ఇంటికాడనే ఉండకపోతుంటివట గద? మా కాడికి వచ్చేటాలకు, యిదేంది మమ్మీ?’
‘అంతెందుకురా అరుణ్… నిన్న మొన్నటి దాకా కలర్స్ తోని, దోస్తులతోని ఎంతైనా ఎంజారు చేసిందో మనకు తెలువదా? నా సెవెంత్ క్లాస్ ముందు దాకా డాడీ, మమ్మీ ఎట్లాడుతుండే… మైండు పోయేది. అట్లా ఆడే వీళ్ళకు ఏమైందో ఏమో సడన్‌గా చేంజ్ అయినర్రా’ కిరణవ్వ విసుగు మొకమేసుకొని.
‘నిజమే ఎవ్వరు చెప్పక నా చిన్నప్పటి కాన్నుంచి నిన్న మొన్నటి దాకా తెల్వని ఎడ్డి లెక్కలనే ఉంటిమి. గిప్పుడు గిప్పుడే తెలిసింది. వో బలిసిన జాతి మన అసోంటి బక్క జాతి బిడ్డను కాల్చి బూడిది చేసి నీళ్లల్ల కలిపి రంగువోలే చల్లుకొని సంబురాలు చేసుకున్న పండుగ’ ఆ బిడ్డ పేరు ‘హోళిక’. హోళిక పేరు మీదనే హోలీ పండుగ వచ్చింది. ఇట్లాంటి పాపాలను ఆడుకుందామా బిడ్డా మీరే చెప్పుండ్రి? మనలను సంపి మనతోనే పండగలు పబ్బాలు చేయించుతున్నరు. మనకు సోయిలేన్నాడు ఆడుతుంటిమి. పాపం వొక ఆడపిల్లను చంపి కలర్స్‌గా ఎంజారు జేసుడు యెంత బాదరా బిడ్డా! అని బిడ్డను, కొడుకును ప్రేమగా వొళ్ళంతా దువ్వుకుంటా ‘గా సంగతి తెలిసిన కాన్నించి గీ హోలీ ఆడుడు బందు పెట్టినమురా. మనోళ్ళందరికీ చెప్తున్నము.’
‘అవును మమ్మీ దసరా దీపావళి కూడా మన హీరోలను చంపిన రోజేనని డాడీ, నువ్వు చెప్తుంటిరీ కదా! సమజ్ దారిగ కిరణవ్వ.
‘అబ్బా మమ్మీ… గీ పండగల వెనుక ఇంత బ్యాడ్ ఉందా! కానీ మమ్మీ.. ఫ్రెండ్స్ తోని ఎంజారు మిస్ అయితము కదా! ఎలా మమ్మీ’ అరుణయ్య జాలిగ.
‘అరుణ్ స్కూల్లో ఇంటికాడ మొత్తం మన ఫ్రెండ్స్‌తో ఎంజాయే కదరా! ఇయర్ మొత్తంలో ఇట్లాంటి బ్యాడ్, పెయిన్ ఫుల్‌గా వుండే రెండు మూడు రోజులు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ మానేసి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. మన ఫ్రెండ్స్‌కి కూడా ఈ బాడ్ డేస్ గురించి చెప్పితే వాళ్ళు కూడా మనలాగనే ఫీల్ అవుతరు. సపోర్టుగా ఉండొచ్చేమో అరుణ్! ఒకరు, ఇంకొకరిని చంపి పండగ చేసుకోవడం పండగెట్లయితదిరా? అట్లాంటి పండగలు మనకొద్దురా’ అని నా బిడ్డ నా కొడుకుకి అర్తం చేయిస్తుంటే…
నా బిడ్డ కిరణవ్వ పూలే అంబేద్కర్ని పుక్కిట పట్టినట్టే అగపడ్డది.
- జూపాక సుభద్ర
9441091305



