Sunday, April 12, 2026
E-PAPER
Homeజాతీయంకేరళంలో మళ్లీ ఎల్డీఎఫ్‌ సర్కార్‌

కేరళంలో మళ్లీ ఎల్డీఎఫ్‌ సర్కార్‌

- Advertisement -

ప్రకాశ్‌ కరత్‌ వెల్లడి
కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు
అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయన్న ఈసీ
తమిళనాడు హోం కార్యదర్శి
ధీరజ్‌ కుమార్‌నుపై బదిలీ వేటు

న్యూఢిల్లీ : కేరళలో మరోసారి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్‌) అధికారంలోకి వస్తుందని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత ప్రకాశ్‌ కరత్‌ శనివారం విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు తమ కూటమికి సానుకూల ఫలితాలు సూచించాయని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రశ్నించగా, ఆయన పై వ్యాఖ్యలు చేస్తూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ” కేరళ పోలింగ్‌ ముగిసింది. ఎల్డీఎఫ్‌కు అంతా బాగానే వుందని వార్తలు అందుతున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తామని మేం భావిస్తున్నాం.” అని కరత్‌ మీడియాకు తెలిపారు.

ముఖ్యమంత్రిపై ఇప్పటికి చర్చలేదు : కాంగ్రెస్‌
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ముందుగానే ముఖ్యమంత్రి పదవికి పరిశీలిస్తున్న అభ్యర్ధుల పేర్లను వెల్లడించరాదని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. తొలుత రమేశ్‌ చెన్నితాలకు కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మద్దతునివ్వగా, వి.డి.సతీశన్‌కే తన మద్దతు వుంటుందన్నట్లు ఎర్నాకుళం డీసీసీ అధ్యక్షుడు మహ్మద్‌ షియాస్‌ పేర్కొన్నారు. ఈ దశలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని కాంగ్రెస్‌ నేత మురళీధరన్‌ పేర్కొన్నారు. పార్టీలో గల విభేదాలు బయటకు పొక్కడం మంచిది కాదన్నారు. ఎవరూ కూడా అటువంటి పరిస్థితులు సృష్టించరాదన్నారు. అయినా ముఖ్యమంత్రి ఎంపికకు పార్టీ ఒక పద్ధతిని నిర్ణయించిందని, దాని ప్రకారమే కేరళలో కొనసాగుతుందని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు.

నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు : మమత
ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీచేసి గెలుపొందే దమ్ము బీజేపీకి లేదని, అందుకే అక్రమ మార్గాల్లో ఓట్లను బలవంతంగా హస్తగతం చేసుకునేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. తనపై రెండు తప్పుడు కేసులు పెట్టడం ద్వారా దక్షిణ కోల్‌కతాలోని బాబనిపూర్‌ లో తన అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని విమర్శించారు. కానీ తమ పార్టీ కార్యకర్తలు, ప్రజల కారణంగా ఆ ప్రయత్నం వమ్ము అయిందని అన్నారు.

అంతర్జాతీయ దృష్టినాకర్షించిన అసెంబ్లీ ఎన్నికలు : ఈసీ
ఇటీవల జరిగిన కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయన్నారు. 22 దేశాలకు చెందిన 38 మంది ప్రతినిధులు భారతదేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను వీక్షించారని ఎన్నికల కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల కమిషన్‌ అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం (ఐఈవీపీ) 2026లో భాగంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియ స్థాయి, కచ్చితత్వం, క్రియాశీలతను ప్రతినిధులు పరిశీలించారని ఇసి ప్రకటన తెలిపింది. ఇది ‘యావత్‌ ప్రపంచానికి సంబంధించి ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ’ అని వారు అభివర్ణించారని పేర్కొంది. రికార్డు స్థాయిలో ఓటర్లు పాల్గొనడాన్ని వారు అభినందించారని తెలిపింది. ప్రతి ఒక్కరిలో ఓటు వేయాలనే ఆత్రుత, ఉత్సాహాన్ని చూశామని ఆ ప్రకటన పేర్కొంది. విస్తారమైన ఈ ప్రక్రియను ఇంత కచ్చితంగా,చక్కగాచేసిన ఈ కార్యక్రమం నుండి తాము నేర్చుకోవాల్సింది చాలా వుందని క్రొయేషియాకు చెందిన బ్రమినిరన్‌ ఫర్కాస్‌ వ్యాఖ్యానించారు.

తమిళనాడు హోం, చీఫ్‌ సెక్రెటరీలు బదిలీ
తమిళనాడు హోం కార్యదర్శి ధీరజ్‌ కుమార్‌ను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.వాయన స్థానంలో కె.మణివాసన్‌ను నియమించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాల్సిందిగా 1993 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వాసన్‌ను ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు కుమార్‌ను ఎక్కడా పోస్టింగ్‌లో నియమించవద్దని పేర్కొంది. అంతకుముందు తమిళనాడు చీఫ్‌ సెక్రటరీ మురుగానందం ను కూడా బదిలీచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మహిళా సాధికారత, బాలల బ్రేక్‌ఫాస్ట్‌ పథకాలు
మహిళా సాధికారతా పథకం, ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్‌ పథకం తన మనస్సుకు దగ్గరైన పథకాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడా అమలు చేస్తున్న మహిళా సాధికారతా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే బాలల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సంబంధించి తీసుకువచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌ పథకం వల్ల కూడా అనేక ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అసోంలో ఒక బూత్‌లో రీ పోలింగ్‌
అసోంలోని శ్రీభూమి జిల్లాలో కరీంగంజ్‌ (నార్త్‌) నియోజకవర్గంలో ఒక బూత్‌లో రీ పోల్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆమేరకు బూత్‌ నెంబర్‌ 239లో శనివారం పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -