Sunday, April 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌

- Advertisement -

రూ.15 వేల కోట్ల విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆపరేషన్‌
కబ్జాలకు ఆస్కారం లేకుండా చుట్టూ ఫెన్సింగ్‌
ముఖీం గెస్ట్‌హౌస్‌తో పాటు ఫామ్‌హౌస్‌ నేలమట్టం
పేదల ఇండ్లు సేఫ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో/అమీన్‌పూర్‌
అనతికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హైడ్రా నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రాతో కలిసి రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలు కాపాడాయి. ఈ భూమి విలువ మార్కట్లో రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పేదవాడి పక్షాన నిలబడే ఒక అభయహస్తం అని అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ సాక్షిగా హైడ్రా నిరూపించింది. సాధారణంగా కూల్చివేతలు జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలిచే ప్రజలు, ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం గమనార్హం. దశాబ్దాలుగా సామాన్యుల కండ్ల ముందే ప్రభుత్వ భూమిని చెరబట్టిన భూ బకాసురుల అహంకారాన్ని కూల్చివేసింది.

పేదవాడు కట్టుకున్న చిన్నపాటి గూడుకు హైడ్రా అండగా నిలిస్తే.. రూ.వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాపాడే క్రమంలో అది వజ్రాయుధంలా మారింది. అదే సమయంలో తమ ఇండ్లు సురక్షితంగా ఉన్నాయని తెలుసుకున్న ఐలాపూర్‌ వాసుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలతోపాటు ఇతర విభాగాలు ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఇప్పటికే అక్కడ ఇండ్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇండ్లు కట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎప్పటికప్పుడూ అధికారులు మైక్‌ ద్వారా స్థానికులను అప్రమత్తం చేశారు.

యథాతథ స్థితిని కొనసాగించాలనే కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్క చెయకుండా ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి హైడ్రా చెక్‌ పెట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసింది. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సమక్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. ఐలాపురంలోని భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని 2013లో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతస్తుల 3 టవర్లను తొలగించారు. స్విమ్మింగ్‌పూల్‌ సహా విలాసవంతంగా నిర్మించుకున్న ఇంటిని, చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌ను, గుర్రాల శాలలను తొలగించారు.

పెండింగ్‌లో కోర్టు తీర్పులు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని ఐలాపూర్‌ గ్రామంలోని 1 నుంచి 220 సర్వే నెంబర్ల వరకూ 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నిజాం పాలకులకు చెందినదిగా ఇది రికార్డుల్లో ఉంది. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకెక్కింది. మరోవైపు ఈ భూములపై హైకోర్టులో స్టే కొనసాగుతోంది. కోర్టు తీర్పులు పెండింగ్‌ ఉండగా.. ఆ భూమితో ఎలాంటి సంబంధమూ లేని ముఖీంతోపాటు అతని అనుచరులు ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తుండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయిల గడించడమే కాకుండా వ్యవస్థలన్నిటినీ మేనేజ్‌ చేసుకుంటూ కోట్లు గడించినట్టు ఆరోపణలు ముఖీం మీదున్నాయి. మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అక్కడ దాదాపు 400 ఎకరాలకుపైగా ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. దాంతో పేదలు కట్టుకున్న ఇండ్లను మినహాయించి ఖాళీగా ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడారు.

ప్రభుత్వ భూమే..
నిజాం పాలకుల దగ్గర దివాన్‌గా ఉన్న వ్యక్తి దగ్గర ముఖీం తండ్రి పని చేసేవాడని, ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 19 ఎకరాల భూమి ముఖీం తండ్రికి సమకూరిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇదంతా ప్రభుత్వ భూమే అయినప్పటికీ ముఖీం తండ్రికి చెందిన 19 ఎకరాల భూమిలో కూడా లేఔట్‌ వేసి అమ్మేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆ 19 ఎకరాలతోపాటు.. మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్‌హౌస్‌ నిర్మించినట్టు అక్కడి లే ఔట్‌ ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.

పాలాభిషేకాలు.. దిష్టిబొమ్మల దహనం..
సాధారణంగా కూల్చివేతలు జరిగినప్పుడు వ్యతిరేకత వస్తుంది. కానీ ఐలాపూర్‌లోని ఆనంద నగర్‌ కాలనీలో భిన్నంగా ఉంది. తమ ప్రాంతంలోని భూ బకాసురుల ఆగడాలు ఆగిపోతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. కబ్జాదారుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోర్టు స్టేలు ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలను కూల్చడం ద్వారా, చట్టం ఎవరికీ చుట్టం కాదని హైడ్రా స్పష్టం చేసింది.

ఖాళీ భవనంలో అర్ధరాత్రి హైడ్రామా
ఐలాపూర్‌ తండాలోని నివాసాలు, గ్రామంలో పేదలు కట్టుకున్న ఇండ్లను హైడ్రా టచ్‌ చేయలేదు. కేవలం కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరించి నిర్మించిన లాయర్‌ ముఖీం గెస్ట్‌హౌస్‌, అతని సోదరుడు అజీమ్‌ నిర్మించిన 6 అంతస్తుల భారీ అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేసింది. ఆక్రమణదారులు కూల్చివేతలను అడ్డుకోవడానికి చివరి నిమిషంలోనూ నాటకీయ పరిణామాలను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఖాళీగా ఉన్న 6 అంతస్తుల భవనంలోకి అర్ధరాత్రి కొందరిని పంపి.. వారు అక్కడ నివసిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. హైడ్రా అధికారులు ఈ వ్యూహాన్ని పసిగట్టి, వారిని ఖాళీ చేయించి మరీ కూల్చివేతలు పూర్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -