Sunday, April 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆకట్టుకుంటున్న కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల ఫొటో ఎగ్జిబిషన్‌

ఆకట్టుకుంటున్న కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల ఫొటో ఎగ్జిబిషన్‌

- Advertisement -

ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ కార్మికురాలు నర్సమ్మ
సమాజంలోని కుల చెత్తను ఏరేసేదాకా విశ్రమించబోమని ప్రతిజ్ఞ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలను పురస్కరించు కుని శనివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. దానిని జీహెచ్‌ఎంసీ కార్మికురాలు నర్సమ్మ ప్రారంభించారు. కులవ్యతిరేక, సామాజిక చైతన్య పోరాటాలు చేసిన మహనీయుల ఫొటోలను దేవుళ్ల మాదిరిగా మొక్కుతూ ఆమె ముందుకెళ్లడాన్ని చూస్తే రోడ్లమీది చెత్తతో పాటు కుళ్లికుళ్లి సమాజాన్ని గబ్బు పట్టిస్తున్న కులచెత్తనూ ఏరేస్తాననే చైతన్యం ఆమెలో కనిపించింది. కుల వ్యవస్థ పునాదిగా నిర్మించబడ్డ సామాజిక వ్యవస్థలో 15 శాతంలోపు ఉన్న ఆధిపత్య కులాల వాళ్లు ఏవిధంగా లబ్దిపొందుతున్నారు…ఈ వ్యవస్థ వల్ల 85 శాతం మంది ఏవిధంగా దోపిడీకి గురవుతున్నారనే విషయాన్ని గణాంకాలతో సహా చార్టు ద్వారా వివరించే పోస్టును ఏర్పాటు చేశారు. మనుస్మృతి శూద్రులను ఏవిధంగా తొక్కిపెట్టిందనే విషయాన్ని కండ్లకు కట్టినట్టు చూపెట్టేలా పోస్టర్లను ఏర్పాటు చేశారు.

కులాలు, రంగు ఆధారంగా వివక్ష చూపెట్టొద్దని బ్రిటీష్‌ కాలంలోనే రూపొందించిన చట్టాలు, రాజ్యాంగంలో పొందుపర్చిన కీలక అంశాలను చార్టుల రూపంలో పెట్టారు. 2014 నుంచి నేటి వరకు తెలంగాణలో జరిగిన కుల దురహంకార హత్యల వివరాలను జిల్లాల వారీగా ఏర్పాటు చేశారు. కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ గౌతమబుద్ధుడు, వేమన, కబీర్‌, అన్నమయ్య, సంత్‌ రవిదాస్‌, బ్రహ్మనాయుడు, బసవేశ్వరుడు, భక్త రామదాసు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, నారాయణగురు, ఫాతిమా షేక్‌, పుచ్చలపల్లి సుందరయ్య, ద్రాక్షాయని లేవాయుధన్‌, బోయి భీమన్న, రామ్‌ మనోహర్‌ లోహియా, జాషువా, భగత్‌సింగ్‌, బాబు జగ్జీవన్‌రామ్‌, పెరియార్‌ రామస్వామి, త్రిపురనేని రామస్వామి చౌదరి, భాగ్యరెడ్డివర్మ, గురజాడ, గాంధీ, అయ్యంకాళి, తదితర మహనీయులు రాసిన కవితలను, చేసిన పోరాటాలను, వారి త్యాగాలను వివరించేలా వారి ఫొటోలను ఏర్పాటు చేశారు.

వాటిని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకిస్తూ మహనీయుల చిత్రాల కింద ఉన్న ముఖ్యాంశాలను చదువుతూ చైతన్యం పొందుతున్నారు. దేశంలో క్యాన్సర్‌ వైరస్‌ కంటే కుల వైరస్‌ ప్రమాదకరంగా మారిందని చెబుతూ వేసిన కార్టూన్‌, దానం అడిగితే..నీదే కులం అని అడుగుతూ దానం చేసే కార్టూన్‌ ఆలోచింపజేసేలా ఉన్నాయి. కుల రక్కసి బుసలు కొడుతున్న తీరును వివరిస్తూ పలువురు వేసిన కార్టూన్లను ఎగ్జిబిషన్‌లో పెట్టారు. కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో జీహెచ్‌ఎంసీ కార్మికురాలు నర్సమ్మతో పాటు ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్‌, అధ్యక్షులు జబ్బార్‌, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి.రమేశ్‌, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్‌, టీపీఎస్‌కే గౌరవాధ్యక్షులు జి.రాములు, టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ఎస్వీకే ట్రస్టు మెంబర్‌ బుచ్చిరెడ్డి, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఎన్‌.సోమయ్య, ఎస్వీకే సిబ్బంది, కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -