చలో కేటీపీఎస్‌కు పోలీసుల ఆటంకాలు
దద్దరిల్లిన కేటీపీఎస్ కాంప్లెక్స్ మహాధర్నా
రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ఆర్టిజన్లు
నిర్బంధాలకు అదరని, బెదరని కార్మికులు
అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
అరెస్టులను తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు
నవతెలంగాణ- పాల్వంచ/విలేకరులు
విద్యుత్ ఆర్టిజన్స్ సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సమస్యలను పరిష్కరించకపోగా జఠిలం చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్టిజన్స్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీన్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) సమ్మె తలపెట్టింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ 1559 మందికి చీఫ్ ఇంజినీర్స్ టర్మినేట్ నోటీసులు ఇచ్చి బెదిరిస్తుండటంతో దానికి నిరసనగా జాయింట్ యాక్షన్ కమిటీ చలో కేటీపీఎస్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి శనివారం కేటీపీఎస్‌కు ట్రాన్స్‌కో, జెన్కో, ఎన్‌పీడీసీఎల్‌లోని 23వేల మంది ఆర్టిజన్ కార్మికులు తరలివస్తుంటే పోలీసులు జిల్లా చుట్టుపక్కల రహదారులపై చాలామందిని అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో మహాధర్నా సమ్మె శిబిరం దగ్గరకు రాకుండా భారీ బందోబస్తు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిర్బంధించినప్పటికీ 10 వేల మందికిపైగా కార్మికులు సమ్మె శిబిరానికి చేరుకుని భారీ నినాదాలు చేశారు.
విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తులు చేసి అలసిపోయామని ఎన్ని నిర్బంధాలు చేసినా.. 23 వేల మంది ఆర్టిజన్స్‌ను టర్మినేట్ చేసినా.. మా సమస్య పరిష్కరించేవరకూ సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టిజన్స్ 5 వేల మంది ఎటువంటి ఎంప్లాయి బెన్‌ఫిట్స్ లేకుండా చనిపోవడం, ఉద్యోగ విరమణ పొందడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లు అందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేయడం చట్ట విరుద్దమని విద్యుత్ శాఖామంత్రి భట్టి విక్రమార్క చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒకమాట మార్చడం పట్ల ఆర్టిజన్స్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
కేటీపీఎస్‌లో ఆర్టిజన్ కార్మికులకు టర్మినేట్ నోటీసులు ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమనందరినీ తొలగించినా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. 23 వేల మందిని తొలగించి విద్యుత్ ప్లాంట్లను ఎలా నడుపుతారో చూస్తామని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ 10 వేల మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె శిబిరంలో పాల్గొన్నారు. కార్మికులందరికీ స్వయంగా ఆర్టిజన్స్ భోజనాలు వండి, వడ్డించి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకున్నారు. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, 1535, 1104 పలు సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఇప్పటికే సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు సమ్మె శిబిరానికి చేరుకుని సమస్య పరిష్కారం అయ్యేవరకూ మీ వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. సమ్మె శిబిరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్స్ తరలివస్తున్న క్రమంలో అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వెంటనే కార్మికులంద రినీ విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
వెంటనే చర్చలకు పిలవాలి : యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యూఈఈయూ) (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికుల పట్ల నిర్బంధం విధించడం సరికాదు. కేటీపీఎస్‌లో పనిచేస్తున్న 1559 ఆర్టిజన్ కార్మికులకు కేటీపీఎస్ సీఈలు ప్రభాకర్‌రావు, సూర్యనారాయణ టర్మినేట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే జేఏసీని చర్చలకు పిలవాలి. ఉద్యమాన్ని అరెస్టులతో, నిర్బంధాలతో అణచాలనుకుంటే ఊరుకోబోం. 23 వేల మందిని తొలగిస్తే ఎండాకాలంలో ఏ రకంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రజలకు ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు.
ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ ఆఫీసులో జేఏసీ ఆధ్వర్యంలో మూడోరోజున చేపట్టిన నిరవధిక సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు, ఇతర పేర్లతో పనిచేస్తున్న కార్మికులందరికీ రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. వారు ఆందోళనలు, పొరాటాలు చేసి ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకుపోయి నా.. పట్టించుకోలేదన్నారు. అందుకే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. జేఏసీ నాయకత్వంతో వెంటనే చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం, మిర్యాలగూడ సబ్‌స్టేషన్ ఎదుట, కొండమల్లేపల్లిలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో సమ్మె శిబిరం వద్దనే వంటావార్పు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టీవీఏఈ జేఏసీ ఆసిఫాబాద్ సర్కిల్ కార్యాలయం ముందు సమ్మె కొనసాగుతోంది.



