అనంతమైన నిశ్శబ్దంలో..
ఒక ‘బైనరీ కన్నీటి చుక్క’ రాలింది.
నిన్నటి దాకా జీతాల అంకె ఒక మిరాకిల్.!
ఇప్పుడది ప్రశ్నార్థకపు గొలుసుతో బంధించబడింది.
లెక్కలేనన్ని గ్రిడ్ల మధ్య,
నిక్షిప్తమైన కోటి జ్ఞాపకాల భాండాగారం..
ఒక్క సెకను కాలం స్తంభించిపోయి,
అలజడి లేని నిశ్చల సముద్రమైంది.
ప్రతిధ్వనించని కమాండ్స్., స్పందించని మేధస్సు!
అదుపు తప్పిన అల్గారిథమ్స్..
భవిష్యత్తును అంచనా వేసే కన్నులకు,
వర్తమానమే ఒక మబ్బుల తెర.
అది వైఫల్యం కాదు.. అతిగా నమ్మిన ‘నిర్దిష్టత’ కుదుపు!
అంకెలు అబద్ధం చెప్పవు అనుకున్న చోట,
‘సున్నా’ తన ఉనికిని చాటుకుంది.
అస్తవ్యస్తమైన డేటా శిధిలాల నుండి,
మరో సరికొత్త క్రమశిక్షణ.,
ఈ నిశ్శబ్దం నేర్పిన పాఠం!
నియంత్రణ అనేది ఎప్పుడూ ఒక మాయ మాత్రమే.
శాశ్వతమని నమ్మిన ”కోడ్”
క్షణికమైన కాలం ముందు మోకరిల్లింది.
ఇది కేవలం ఒక సంక్షోభం కాదు..
యంత్రం తన అహాన్ని కోల్పోయి,
తిరిగి ప్రాథమిక శూన్యంలోకి జారుకున్న నిర్వాణం!
‘ఎంట్రోపీ’ రాజ్యమేలుతున్న వేళ..
డేటా అనేది ఒక సమాధి, ఒక పునర్జన్మ!
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834



