ధర్మశాస్త్రాల పేరుతో నాకు అక్షర జ్ఞానాన్ని దూరం చేసారే
అస్పశ్యతతో ఊరికే దూరం చేసారే
దేవుని ముందు అందరూ సమానం
నిజమేకదా
ధర్మశాస్త్రోపదేశకులరా
గౌరవప్రద జీవితం మీకు మాత్రమేనా
మా తాతల మొలకు తాటాకు
వాళ్ళ వీపుకు చీపురు కట్టినప్పుడు
మీరేక్కడ ఉన్నారయా
మా ముత్తాత తల తెగనరికినపుడును మీనోళ్లు
మూగబోయాయా
నిచ్చెన మెట్లెక్కి
మమ్మణగ దొక్కినప్పుడు ఎక్కడ దాక్కున్నారు
కర్మ సిద్దాంతం ఇదేనని అసమానత చూపారే
విముక్తి మార్గాన్ని బోధించి ఆత్మగౌరవంతో బతకాలని
మా వెలివాడల వెతలు
శ్రమైక జీవవ సౌందర్యానికి గౌరవాన్ని కల్పించి
అందరూ సమానమని అక్కున జేర్చుకున్నారు
ఆకర్షితులమయ్యాం
తప్పెవరిది నీరజాక్షా సెల్వివ్వండి రారాజా
వేకువనే
మంగళ కైశికి రాగం ఆలపించా
వెంటనే అసమానతల రాగం వినిపిస్తున్నారే
ఇదేమి న్యాయం
సమానత్వాన్ని చూపించు, సమన్యాయం పాటించు
అక్కున చేర్చుకో, హక్కులు కల్పించు
ఆలంబనగా నిలబడు
ఆదరణగా నిలబడతాం
ఇదే మా ఆకాంక్ష
నేటికీ ఈ వివక్ష పోలేదు
పోతుందంటారా!
ఆరు సెలవివ్వండి
మా రాజా
మన చూపుడు వేలు మార్గంలో ప్రయాణిద్దాం
సమసమాజస్థాపన చేద్దాం…
వెంకటేశ్వరరావు కట్టూరి



