నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. కొత్త కారు కొన్న ఆనందంతో పూజ చేయించేందుకు వచ్చిన ఓ కుటుంబంలో ఊహించని దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన భార్యతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. నగరంలోని మియాపూర్‌లో నివసించే ఆయన మేనల్లుడు సాయికుమార్ ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు. దీంతో వాహనానికి పూజ చేయించేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. అర్చకులు కారుకు పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమం పూర్తయ్యాక, వాహనాన్ని కొద్దిగా ముందుకు కదపాలని పూజారి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో కంగారులో బ్రేక్‌కు బదులుగా పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు గట్టిగా వేయడంతో కారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. వాహనానికి ముందు భాగంలో నిల్చొని ఉన్న రామచంద్రరావును కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆటోలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో రామచంద్రరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొత్త వాహనం కొన్న సంతోషం క్షణాల్లో ఆవిరైపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో ఆనందంగా పూజకు వచ్చిన మేనమామ, అదే కారు కిందపడి ప్రాణాలు కోల్పోవడంతో మేనల్లుడు సాయికుమార్ కన్నీరుమున్నీరయ్యారు.



