– గ్యాస్ కొరతతో తగ్గిన తయారీ
– ఖరీఫ్‌లో రైతులకు కష్టకాలమే
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతోంది. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల దేశీయంగా యూరియా ఉత్పత్తి భారీగా పడిపోయింది. మార్చి నెలలో సాధారణంగా ఉత్పత్తి కావాల్సిన 26 లక్షల టన్నుల కంటే సుమారు 8 లక్షల టన్నుల మేర తక్కువగా యూరియా ఉత్పత్తి అయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎరువుల తయారీకి ప్రధాన ముడిసరుకైన గ్యాస్ అందకపోవడంతో ఇఫ్కో వంటి దిగ్గజ సంస్థలు తమ ప్లాంట్లను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మరమ్మతుల పేరుతో మూసివేయడం ఈ లోటుకు ప్రధాన కారణంగా నిలిచింది.
ప్రస్తుతం గ్యాస్ సరఫరాను ప్రభుత్వం 95 శాతానికి పెంచి ఉత్పత్తిని పునరుద్ధరిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఖతార్ వంటి ప్రధాన దేశాల నుంచి అందాల్సిన ఎల్ఎన్జి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 27 శాతం తగ్గాయి. జూన్ నుండి వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటల సాగు ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఉత్పత్తి లోటు, దిగుమతుల్లో జాప్యం ఎరువుల కొరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ హార్ముజ్ జలసంధి గుండా రవాణా మరింత మందగిస్తే సాగు సమయానికి ఎరువుల లభ్యత కష్టతరమై రైతులకు పెట్టుబడి భారం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల టన్నుల యూరియా దిగుమతి కోసం అంతర్జాతీయ టెండర్లు జారీ చేసిందని తెలుస్తోంది. అయితే యుద్ధం మొదలైన తర్వాత ఇదే మొదటి భారీ దిగుమతి కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉండటం ప్రతికూలాంశంగా మారింది. ఒకవైపు యుద్ధ ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడం, మరోవైపు దేశీయ ఉత్పత్తి తగ్గడం వంటి పరిణామాలు భారత వ్యవసాయ రంగానికి సవాలుగా మారాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎరువుల నిల్వలను సమకూర్చుకోకపోతే కీలకమైన ఖరీఫ్ సీజన్‌పై దాని ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎరువుల ఉత్పత్తిపై యుద్ధ నీడలు
- Advertisement -
- Advertisement -



