యూఎస్‌తో చర్చల వేళ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
నెతన్యాహు ప్రతినిధులతో భేటీ అయితే నో డీల్
మా పోరాటాన్ని కొనసాగిస్తాం : ఇరాన్ ఉపాధ్యక్షుడు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా – ఇరాన్ శాంతి చర్చలు మొదలైన వేళ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ రజా ఆరిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదం కలిగిన ప్రతినిధులతో ఇరాన్ ప్రతినిధులు సమావేశమైతే, తద్వారా కుదిరే ఒప్పందం ఇరుపక్షాలకు, యావత్ ప్రపంచానికి ప్రయోజన కరంగా ఉంటుంది ఆయన అన్నారు. ఒకవేళ ఇజ్రాయిల్ ఫస్ట్ నినాదం కలిగిన ప్రతినిధులతో ఇరాన్ ప్రతినిధులు భేటీ కావాల్సి వస్తే, కచ్చితంగా ఎలాంటి ఒప్పందమూ కుదరదని తేల్చి చెప్పారు. అలాంటి పరిస్థితే ఎదురైతే, తాము ఇరాన్ రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని రజా ఆరిఫ్ స్పష్టం చేశారు. దీనికి భారీ మూల్యాన్ని ప్రపంచం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
ఫైవ్ స్టార్ హోటల్ వేదికగా చర్చలు
ఇస్లామాబాద్ నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వారి మధ్య ముఖాముఖి చర్చలు జరగడం లేదు. ఈ రెండు దేశాల ప్రతినిధి బందాలు ఫైవ్ స్టార్ హోటల్‌లోని వేర్వేరు గదుల్లో కూర్చున్నాయి. వారు పాకిస్తాన్ అధికారుల ద్వారా పరస్పరం తమ సందేశాలను ఇచ్చి పుచ్చుకుంటున్నారు. లెబనాన్‌లోనూ కాల్పుల విరమణ జరగాల్సిందే అని ఇరాన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. శాంతి ఒప్పందంలో లెబనాన్ కూడా ఉండాలని వారు కోరుతున్నారు. ఖతార్ సహా పలు దేశాల్లో ఉన్న తమ నిధులను అన్‌ఫ్రీజ్ (విడుదల) చేయాలనే డిమాండ్‌నూ ఇరాన్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
అమెరికా, ఇరాన్ ప్రతినిధులు వీరే
అమెరికా ప్రతినిధి బృందంలో వైస్ ప్రెసిడెంట్ జె.డి వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, అల్లుడు జేర్డ్ కుష్నెర్ ఉన్నారు. ఇక ఇరాన్ ప్రతినిధి బృందంలో ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఉన్నారు. అమెరికా ప్రతినిధి బృందం ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామునే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇక ఇరాన్ ప్రతినిధులతో కూడిన విమానం శుక్రవారం రాత్రి పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించగానే, దాని చుట్టూ యుద్ధ విమానాలను మోహరించి ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్(అవాక్స్)తో పాకిస్తాన్ వాయుసేన భద్రతను కల్పించింది. ఇరాన్ విమానం ఇస్లామాబాద్‌కు చేరుకునే వరకు ఇదే విధమైన పకడ్బందీ పహారాను అందించారు.
పాక్ ప్రధానితో ఇరాన్ ప్రతినిధుల భేటీ
యావత్ ప్రపంచం ఆసక్తిగా పరిశీలిస్తున్న అమెరికా, ఇరాన్ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాల శాంతి చర్చలు పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ వేదికగా మొదలయ్యాయి. శనివారం ఉదయాన్నే ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో తాము ఆతిథ్యం పొందిన భవనం నుంచి పాక్ ప్రధానమంత్రి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వారు తొలుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈమేరకు వివరాలతో ముంబయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇరాన్ ఒక ట్వీట్ చేశారు.
15 రోజుల డెడ్‌లైన్ .. రాబోయే 48 గంటలు కీలకం
ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ చర్చలకు 15 రోజుల డెడ్‌లైన్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టింది. ఏప్రిల్ 8 (బుధవారం) నుంచి అమల్లోకి వచ్చిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రాతిపదికన ఈ గడువును విధించింది. 15 రోజుల డెడ్‌లైన్ ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22న ముగియనుంది. అప్పట్లోగా అమెరికా – ఇరాన్‌లు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేకించి రాబోయే 48 గంటల పాటు ఇస్లామాబాద్‌లో జరగనున్న ఇరుదేశాల చర్చల ఫలితాల కోసం యావత్ ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న శాంతి చర్చలను అత్యంత కీలకమైన సంప్రదిం పులుగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణిం చారు. తాత్కాలికంగా అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ దౌత్య పరిష్కారానికి దారితీస్తుందా ? లేదంటే మళ్లీ సైనిక ఘర్షణ మొదలవుతుందా ? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.



