Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరంతర పోరాటాలతోనే కుల నిర్మూలన

నిరంతర పోరాటాలతోనే కుల నిర్మూలన

- Advertisement -

– కాకి మాధవరావు
– ఎస్వీకే, టీపీఎస్‌కే ‘కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు’ ప్రారంభం
– కులం పుట్టుకనుంచే నిర్మూలన ఆలోచన : ఎస్వీకే కార్యదర్శి వినయ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నిరంతర పోరాటాల ద్వారానే కుల నిర్మూలన సాధ్యపడుతుందని, ఆ దిశగా ముందుకెళ్లాలని ‘కుల నిర్మూలన సాంస్కతిక ఉత్సవాల’ చైర్మెన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకిమాధవరావు అన్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు ‘కుల నిర్మూలన సాంస్కతికోత్సవాలు’ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను శనివారం హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాకి మాధవరావు ప్రారంభించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌.వినయ కుమార్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ భారతదేశంలో కుల నిర్మూలన ఎప్పుడు జరుగుతుందన్న దానికి అరుంధతిరారు లాంటి ప్రముఖులు కవితాత్మకంగా అసాధ్యమన్నట్టు… నక్షత్రాల స్థానాలను మార్చినప్పుడు సాధ్యమని బదులిచ్చారని గుర్తు చేశారు. ‘హిందూయిజం ఆల్టర్నేటివ్‌ థియరీ’ పుస్తకాన్ని రాసిన ప్రాశ్చాత్య రచయిత్రి కూడా కులం గురించి చెబుతూ అది ‘ఏనుగు ముద్ర’ లాంటిదని అంత సులభంగా పోదని పోలిక చేశారని చెప్పారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో నీగ్రోల కోసం నిలబడ్డట్టుగా జరిగిన ప్రచారాన్ని అరుంధతి రారు తన పరిశోధనలో సరికాదని తేల్చడంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారన్నారనీ, గాంధీ ఒక వ్యాపారి వద్ద న్యాయ సలహాదారు ఉద్యోగం కోసం వెళ్లారనీ, అక్కడ నల్ల జాతీయుల బోగిలో ప్రయాణించడం ఇష్టం లేదని చెప్పారనీ, డర్బన్‌ కాన్ఫరెన్స్‌ లోనూ నల్ల జాతీయుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్వారం నుంచి వెళ్లేందుకు ఇష్టం లేదని అరుంధతిరారు వెలికి తీసిన విషయాలను అపార్థం చేసుకున్నారని, అరుంధతీ రారు అన్న మాటలను ఆయన ఉటంకించారు. కుల నిర్మూలన అంత సులభమేమి కాదనీ, అయితే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగాలన్నారు. అప్పుడే కొంత ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులం వల్ల ఉద్భవించిన దుర్మార్గపు పనులను అడ్డగించాలని, తద్వారా ముందుగా కొన్ని ఫలితాలు వచ్చే అవకాశముందని సూచించారు.

కులం పుట్టుక నుంచే నిర్మూలన ఆలోచన : వినయకుమార్‌
కులం పుట్టుక నుంచే దాన్ని నిర్మూలించాలనే పోరాటం మొదలైందని ఎస్వీకే కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ తెలిపారు. అయినప్పటికీ రూపం మారినా అన్ని అంశాల్లో కులం ఉందన్నారు. ఆ కులం దేశంలోని అన్ని మతాల్లోకి వెళ్లిందనీ, విదేశాలకు వెళ్లే వారు ఆ కులాన్ని ఆవకాయతో పాటు మోసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు పెరుగుతున్నట్టుగానే కుల దురహంకార దాడులు పెరుగుతున్నాయన్నారు. ఆర్థిక పోరాటంతోనే కులాన్ని నిర్మూలించలేమనీ, భావజాల రంగంలోనూ పోరాటం చేయాలని సూచించారు. రిజర్వేషన్లు లేకుంటే కులాంతర వివాహాలు జరిగేవి కావన్నారు. సమాజ ఎదుగుదలకు రిజర్వేషన్లు అవసరమని తేల్చి చెప్పారు. ఎస్‌.ఆర్‌.శంకరన్‌ తర్వాత అణగారిన వర్గాల కోసం కృషి చేసిన ఐఏఎస్‌ అధికారిగా మాధవరావు నిలిచారని తెలిపారు. అలాంటి అధికారులే లేకుంటే పాలక వర్గాలు అణగారిన వర్గాల కోసం ఆ కొంచెం కూడా ఆలోచించే పరిస్థితి ఉండేది కాదన్నారు.

భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని కులం అడ్డుకుంటుందని తెలిపారు. కులం దేశానికి పట్టిన క్యాన్సర్‌ లాంటిదనీ, దాన్ని నిర్మూలించకుంటే అభివద్ధి సాధ్యం కాదని తెలిపారు. దేశంలో కులం అడగకుండా అద్దెకు ఇంటినివ్వని పరిస్థితి ఉంటే పాలకులు భారత్‌ వెలుగుతోందంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు దేశంలో నరనరాల్లో కులం ఉందనీ, పుట్టుక నుంచి చావు వరకు కులం దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని కూకటివేళ్లతో పెకిళిస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఆ దిశగా ప్రజల ఆలోచనల్లో మార్పు కోసం సాంస్కృతిక ఉత్సవాలను తలపెట్టినట్టు తెలిపారు. రేపటి తరం మనలను ప్రశ్నించకముందే కులాన్ని ప్రశ్నిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ బాలోత్సవ్‌ కమిటీ చైర్మెన్‌ సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కులం పట్టింపులతో మనిషి పతనమవుతున్నారనీ, కులాలుగా విడిపోయే కన్నా మనుష్యులుగా కలిసి ఉంటే ప్రగతి సాధించవచ్చని తెలిపేలా పలు కళా ప్రదర్శనలిచ్చారు. త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నాట్య గురువు ఇందిరా పరాశరన్‌ శిక్షణలో చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటూ ఆలోచింపజేసింది. గాలిది ఏ కులం?, కులంలో ఏముందిరా? తదితర పాటలకు తమ నృత్య ప్రదర్శనలనిచ్చారు. పంచభూతములు చూపని బేధం అంటూ శ్రావ్య ఆలపించిన గానం మనిషిలో కులం పట్ల ఉన్న అశాస్త్రీయ ఆలోచనను ప్రశ్నించింది. విప్లవ్‌ కుమార్‌ బృందం నో క్యాస్ట్‌ ఇండియా ట్రాక్‌ సాంగ్స్‌, ప్రజా నాట్యమండలి సిటీ కమిటీ నాటిక తదితర కళారూపాలు ఆహుతులను కట్టిపడేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -