Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు ఆర్‌పీఐఏ మద్దతు

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు ఆర్‌పీఐఏ మద్దతు

- Advertisement -

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌కు రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐఏ) మద్దతు తెలిపింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక సాధికారత శాఖమంత్రి రామ్‌దాస్‌ అథవాలే స్పష్టం చేశారు. ఎస్సీలు క్రైస్తవులు కాగానే వారి ఎస్సీ హోదా కోల్పోతారనీ, వారికి మిగిలిన ఎస్సీల వలె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ వర్తించదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా సవాలు చేసేందుకు వీలుందని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవావే తెలిపారు. దళితులు ఇతర మతాలను స్వీకరిస్తే వారు ఎస్సీ హోదా కోల్పోతున్నారని గతంలోనూ ఆందోళనలు జరిగాయని చెప్పారు.

దీంతో 1956 దళిత సిక్కులను, వి.పి.సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దళిత బుద్దిస్టులకు ఎస్సీ హోదా కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే క్రమంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా హక్కు దక్కాల్సి ఉందన్నారు. అగ్రకులాల క్రైస్తవులు ఇప్పటికే ఈడబ్ల్యూఎస్‌ కోటాలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందేందుకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసినట్టు అథవాలే తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు సాధించామనీ, ఓడిపోయిన స్థానాల్లోనూ గణనీయమైన ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. దేశంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఆ పార్టీ ఉత్తిరాది ఇన్‌చార్జి పేరం శివనాగేశ్వరరావు, జాతీయ నాయకులు ప్రభుదాస్‌, ఏపీ అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ మాజీ అధ్యక్షులు బైగాల నాగేశ్వర్‌ రావు, రాష్ట్ర క్రైస్తవ విభాగం అధ్యక్షులు జాన్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -