సల్వాజుడుం తీర్పుపై అమిత్‌షా విషప్రచారం
రాజ్యాంగ రక్షణకు పౌరసమాజం ముందుకురావాలి
‘భారత రాజ్యాంగం-న్యాయవ్యవస్థ పాత్ర” అనే అంశంపై జరిగిన రౌండ్ టేబులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”న్యాయంవ్యవస్థ స్వయంప్రతిపత్తిపై కేంద్రం దాడి చేస్తోంది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆదివాసీ యువతకు ఆయుధాలు సమకూరుస్తున్న సల్వాజుడుంకు సంబంధించి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ధర్మాసనం 2010లో ఇచ్చిన తీర్పుపై ఇటీవల లోక్‌సభలో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. కార్యనిర్వాహణ వ్యవస్థను తన అదు పాజ్ఞల్లో ఉంచుకున్న శాసనవ్యవస్థ తాము చెప్పినట్టు నడుచుకోవాలని న్యాయ వ్యవస్థపై బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను కాపాడుకునేందుకు పౌర సమాజం ముందుకురావాలని వారు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ”భారత రాజ్యాంగం-న్యాయవ్యవస్థ పాత్ర” అనే అంశం పై శనివారం వివిధ ప్రజాసంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రజిని మాట్లాడుతూ దేశం లో బలమైన కల్పిత కథనాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వ్యక్తులు, రాజకీయ పార్టీ లు దాటి న్యాయవ్యవస్థపై ప్రజల్లో అప నమ్మకం కల్గించే స్థాయి వరకు ఈ ప్రచారం వెళ్లిందన్నారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్య భవిష్యత్‌కు ప్రమాదకరమని హెచ్చ రించారు. సమావేశానికి అద్యక్షత వహించిన ఫ్రొఫెసర్ హరగోపాల్ మాట్లా డుతూ న్యాయవ్యవస్థ తీర్పులపై రాజ్యాంగబద్దంగా ప్రశ్నించ డాన్ని తాము తప్పపట్టడం లేదనీ, అయితే పార్లమెంట్ సాక్షిగా అమిత్‌షా అసత్యాలను వల్లెవేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాద న్నారు. టెర్రరిజం అనే కథనాలను బిల్డప్ చేసి భయంకరమైన టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మన భావాలను మనం పంచుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా ప్రశ్నించే గొంతుకలను అర్భన్ నక్సలైట్లుగా చిత్రీకరించేందుకు రాజ్యం ప్రయత్నిస్తోందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గురించి చర్చ జరగకూడదనే కుట్రకోణం ఇందులో దాగుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో మాట్లాడితే ప్రివిలేజ్ కిందికి రాదనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు రాజ్యాంగం, న్యాయవ్యవస్థమీద దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) ప్రధాన కార్యదర్శి కె.పార్థసారధి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు న్యాయవ్యస్థ మీద క్రమ పద్దతిలో కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దాని కోసం రాజ్యాంగబద్దంగా ఏర్పడిన సంస్థలను ఉపయోగించి బెదిరిపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌కే నాయకులు జీ.రాములు, ఐలూ నాయకులు శ్రీకాంత్, వీక్షణం ఎడిటర్ కె.వేణుగోపాల్, నందిగాం కృష్ణారావు, ప్రొఫెసర్లు డి. నర్సింహరెడ్డి, మురళి, మానవ హక్కుల సంఘం నాయకులు జీవన్, అన్వర్ ఖాన్, మహాదేవన్ తదితరులు పాల్గొన్నారు.



