Monday, April 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్స్త్రీల‌లో క‌డుపునొప్పి

స్త్రీల‌లో క‌డుపునొప్పి

- Advertisement -

మగవారితో పోలిస్తే ఆడవారిలో కడుపునొప్పి తరచుగా వస్తుంటుంది. కారకాల్ని బట్టి అధిక తీవ్రతతో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. సాధారణంగా జీర్ణకోశ, కాలేయం, మూత్రకోశ, గాల్‌ బ్లాడరు, అపెండిక్స్‌ తదితర అవయవాలలో పనితీరు మారినప్పుడు, ఆడ-మగా, చిన్న-పెద్ద తేడా లేకుండా కడుపునొప్పి రావడం సర్వ సాధారణం. అరుదుగా గుండెకు సంబంధించిన సమస్యల్లో కూడా కడుపు నొప్పే సూచిక కావొచ్చు. స్త్రీలలో గర్భాశయ సంబంధిత అవయవాల పరంగా పొత్తి కడుపులో నొప్పి మరింత తీవ్రతరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. నొప్పి స్థలాన్ని, తీవ్రతను బట్టి వీటి కారకాలు గ్రహించడం వలన తొందరగా తగు చికిత్స చేయడం వీలౌతుంది.

కడుపు నొప్పి రకాలు
నొప్పి స్థానం ఆధారంగా ఎగువ, దిగువ, కుడి వైపు, ఎడమ వైపు, సార్వత్రిక కడుపు నొప్పి అని ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. ఎగువ కడుపు నొప్పి: ఛాతి కింద భాగంలో, కడుపుకు ఉపరితలంలో గుండె పోటు, ఉబ్బరం, యాసిడ్‌ రిఫ్లక్స్‌, వికారం, గుండెల్లో మంటతో పాటుగా ఈ రకమైన కడుపునొప్పి రావొచ్చు.
2. దిగువ/ పొత్తి కడుపు నొప్పి: సాధారణంగా దిగువ కడుపు నొప్పి మూత్రాశయం, పెల్విస్‌లో ఇన్ఫెక్షన్‌, ఓవరీయన్‌ సిస్టులు, సర్విసైటిస్‌, ఎండోమెట్రైటిస్‌, వెన్నెముక సమస్య, ఉబ్బరం, అతిసారం మొదలైన సమస్యలకు సూచికగా కడుపు కింది ప్రాంతంలో వస్తుంటుంది.
3. కుడి-వైపు కడుపు నొప్పి: అపెండిసైటిస్‌, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలు, కుడి వైపు కిడ్నీ సమస్య కడుపు నొప్పికి కారణమవుతాయి.
4. ఎడమ వైపు కడుపు నొప్పి: ఈ నొప్పి సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఎడమ కిడ్నీ, పెద్దప్రేగులోలో ఇన్ఫెక్షన్‌ కారణంగా వస్తుంది.
5. సార్వత్రిక కడుపు నొప్పి: అమీబియాసిస్‌ వంటి ప్రేగుకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, కాలేయం, గాల్బ్లాడర్‌, పాంక్రేయాస్‌, ఇతర సమస్యలకు సూచికగా కడుపంతటా నొప్పి రావొచ్చు.
తీవ్రత ఆధారంగా
1. స్వల్పమైన కడుపు నొప్పి: ఈ రకమైన కడుపు నొప్పి సాధారణంగా ఇతర సూచికలతో పాటు వస్తూ పోతుంటుంది. కారకాల్ని బట్టి తగ్గి పోవచ్చు లేదా తీవ్రరూపం దాల్చవచ్చు.
2. దీర్ఘకాలిక నొప్పి: కడుపు నొప్పి వారాలు, నెలలు, సంవత్సరాలు ఇతర లక్షణాలతో పాటుగా కొన్ని గంటలు భరించలేని విధంగా ఉంటుంది. కడుపు నొప్పితో పాటు కడుపులో మంట, ఉబ్బరం, వికారం, వాంతులు, జ్వరం, అతిసారం, మూత్ర విసర్జనలో ఇబ్బంది వంటి ఇతర సూచికలు కూడా ఉండొచ్చు.
ఎందుకు వస్తుంది?
ఆహారం: సరిగా నిల్వ చేయని, చెడిపోయిన, సరిగా ఉడకని ఆహారం, కడుపునొప్పిని ప్రేరేపించే అతి కారం, మసాలాభరితమైన ఆహారాలు, జంక్‌, ఫాస్ట్‌ పుడ్స్‌, మద్యం వంటి వాటిని అధికంగా తీసుకోవడం వలన కడుపు యొక్క మ్యూకోసల్‌ లైనింగ్‌ దెబ్బతిని కడుపు నొప్పి వస్తుంది. ఆహారాన్ని అతిగా తినడం వల్ల కడుపు సామర్థ్యానికి మించి సాగుతుంది. అందువల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు అసౌకర్యాన్ని కలిగించడంతో కూడా కడుపు నొప్పి వస్తుంది.పేగులో ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు, పేగులపై ఒత్తిడి పడి కడుపు నొప్పి రావొచ్చు.
యాసిడ్‌ రిఫ్లక్స్‌: కడుపులో యాసిడ్‌ తక్కువగా ఉండడం, శరీరంలో మెగ్నీషియం నిల్వలు తగ్గినప్పుడు/ తగినంత లేకపోవడం, ఆహారాన్ని సరిగా నమలకుండా మింగివేయడం వంటి చర్యలు వల్ల కూడా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
మూత్ర సంబంధ సమస్యలు: కిడ్నీ స్టోన్స్‌, బ్లాడర్‌ ఇన్ఫెక్షన్‌, యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు.
ఇతర ఇన్ఫెక్షన్లు: గ్యాస్ట్రోఎంటెరిటిస్‌, ఫుడ్‌ పాయిజనింగ్‌, అపెండిసైటిస్‌, పెల్విక్‌ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌ (పీఐడి) వంటి సమస్యలు కూడా కడుపు నొప్పికి కారణమవుతాయి.
పునరుత్పత్తి సమస్యలు: అండాశయ తిత్తులు, ఎండోమెట్రియోసిస్‌ వంటి పునరుత్పత్తి అవయవాల పరిస్థితుల వల్ల కూడా మహిళల్లో కడుపు నొప్పి రావొచ్చు. హెర్నియా, కీటో అసిడోస్‌ వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా నొప్పికికారణమవుతాయి.

డా.మీరా


కడుపు నొప్పి నివారణ చర్యలు
కడుపు నొప్పి సమస్య నివారణకు ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం.
– ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి.
– కలుషితమైన ఆహారాన్ని, నీటిని తీసుకోకూడదు.
– క్రమం తప్పకుండా ఆహార వేళలను పాటించాలి.
– ప్రొసెస్డ్‌ ఆహారానికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి.
– భోజన మోతాదు తగ్గించడం ఉత్తమం.
– ఆహారాన్ని బాగా నమిలి మింగాలి.
– నాణ్యమైన వంట నూనె, అది కూడా తగు పాళ్ళలో వాడడం, వాడిన నూనెను తిరిగి వాడకుండా ఉండడం శ్రేయస్కరం.
– స్పైసీ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండడం మేలు.
– ఆకుకూరలు, కూరగాయలు, కొబ్బరి, పీచు ఎక్కువగా ఉన్న బొప్పాయి, ఆపిల్‌, దానిమ్మ అరటి, పియర్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పండ్లను తీసుకోవాలి.
– ఆహారంలో కార్బోహైడ్రేట్‌ తగ్గించి ప్రోటీన్‌-గుడ్‌ ఫాట్‌ డైట్‌ అవలంబిస్తే ఎన్నో లాభాలు పొందవచ్చు.
– కూల్‌డ్రింకులు, సోడాలు, బబుల్‌గమ్‌లు కడుపుకు హానికారకం. వాటికి దూరంగా ఉండాలి.
– మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవడం ఉత్తమం.
– నిద్రలేమి, ఆందోళన, భయం, ఉద్వేగం వంటి సమస్యలను తగ్గించుకోవాలి.
– జీవన శైలి మార్పుల ద్వారా మానసిక, శారీరిక విశ్రాంతి పొందే ప్రయత్నాలు చేస్తుండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -