ఆకలి తీరువరకేగా మృగాలవేట మరి
ఎంత వరకో మనుషుల మూర్ఖత్వ యుద్ధం
ఏమిటీ కుతంత్రం అసలు ఎందుకు యుద్ధం
హితం కోరేదే మానవత్వం
వినాశనం కాకూడదు ఏదేశ అభిమతం
అసలు మనిషే మిగలకుంటే
ఎక్కడుంటుంది అగ్రాధిపత్యం
ఏమి ఆశించి ఆవహిస్తున్నదో ఈ ఉన్మాదం
సిగ్గిడిచి ఏ సిరాతో లిఖించాలి ఈ ఉదంతం
సురులకు అసురులు శత్రువులు
ఎందుకో మనుషులకు మనషులే శత్రువులు
సాంకేతికంగా చంద్రయానం
మానవత్వంలో పాతాళానికి పయనం
రగులుతున్న ఈ మారణహోమంలో
సమిధుల్లా రాలిపోతున్నారు సామాన్యజనం
ఇది ఎరుగకుంటే మానవాళికే పెనుప్రమాదం
ఏమైపోతుందో ఈప్రపంచం
ఎక్కడుందో లోపం విడనాడాలి మౌనం
ఇక మీదట కాకూడదు మనకు శాపం
నాకు ఎందుకూ అని అనుకోకు
కోన అంటుకోక మునుపే
కొండలోని మంటను ఆర్పేయాలి
రాకాసిపుండుగా మారక మునుపే
వ్రణంతో రణంచేసి శస్త్రచికిత్స చేయాలి
రండి కదలి రండి
ఒక్క అడుగు వేయండి
కదిలించండి కలం
రగలాలి ఒక్క నినాదం
”యుద్ధం వద్దు శాంతి ముద్దు”
నీ కోసం నా కోసం కాదు
మన రేపటి తరం కోసం !
- సురేంద్ర రొడ్డ, 9491523570



