పేరు మార్పుపై పరిశీలన చేస్తున్నాం : కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర
పార్టీకి, ప్రజల మధ్య గ్యాప్ వల్లే గత ఎన్నికల్లో ఓడాం
ఆ నలుగురు సీఎంలు బాగా పాలించారు
నవతెలంగాణ-నస్పూర్
బీఆర్‌ఎస్ పార్టీని టీఆర్‌ఎస్ పార్టీగా పేరు మార్పు చేసే అంశాన్ని పరిశీలన చేస్తున్నామని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా నస్పూర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ముగిసిన తరువాత కొంతమంది మీడియా సభ్యులతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలకవ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు మార్పు గురించి ఆలోచన తమ పరిశీలనలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ పేరు మార్చాక కొంత నష్టపోయిన మాట వాస్తవం అన్నారు. మళ్లీ పాత పార్టీ పేరు గురించి చర్చ జరుగుతోందన్నారు. ఇటీవల కవిత తాను పెట్టబోయే పార్టీకి టీఆర్‌ఎస్ పేరు పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేటీఆర్ పార్టీ పేరు మార్పు గురించి మీడియాతో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇంకా అనేక విషయాలను కేటీఆర్ వివరించారు.
గతంలో తాము చేసిన చిన్నచిన్న తప్పుల వల్ల పార్టీకి, ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందని కేటీఆర్ అన్నారు. జరిగిన తప్పులపై అద్యయనం చేశామని, లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీయేనని, కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌తో తెలంగాణలో 179 అసెంబ్లీ సీట్లు, 28 పార్లముంటు స్థానాలు పెరుగుతాయని, అందరికీ టికెట్టు లభిస్తాయని అన్నారు. పొత్తులకు తమకు కలిసిరాదని, కుదరదని అన్నారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదన్నారు. తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని, ఇక్కడ పోటీ చేయాలని ఏమీ లేదన్నారు. ప్రజా సమస్యలపై 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయబోతున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలన చేశారని, వారిలో ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్ అని చెప్పారు.
కవిత విషయంలో చెప్పేదేమీ లేదు
కవిత విషయంలో చెప్పేదేమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించొద్దు అని అన్నారు. రాజకీయం ఉంటుంది.. పోతుంది.. కానీ, ఇతరులను బాధపెట్టే తీరు మంచిది కాదు అని సూచించారు. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చని, దానికి ప్రజల ఆదరణ ముఖ్యమని తెలిపారు.
దోచుకొని దాచుకోవడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం : కేటీఆర్
రాష్ట్రాన్ని దోచుకొని దాచుకోవడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యంగా పనిచేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా నస్పూర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి 30 నెలలైనా ఆ గ్యారంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్ మంత్రి నీచ కృష్ట రాజకీయాలు చేశారని, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బు ఎరగా చూపారన్నారు. అయినా నికార్సైన కార్యకర్తలు ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేలా చూడడం అభినందనీయమన్నారు.
మాజీ ఎమ్మెల్యే సుమన్ క్యాతన్ పల్లిలో ఉంటే తమ ఆటలు సాగవని అక్రమంగా అరెస్ట్ చేసి ఆసిఫాబాద్, మంచిర్యాల సబ్ జైలు కాకుండా ఆదిలాబాద్ జిల్లా జైల్లో పెట్టారని అన్నారు. నవంబర్‌లో తీసుకుంటే రైతుబంధు పదివేలు వస్తది, డిసెంబర్‌లో తీసుకుంటే 15 వేలు వస్తదంటూ నమ్మబలికి గద్దెనెక్కారని అన్నారు. కేసీఆర్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ పాలనలోకి వస్తే రైతుబంధుకు రామ్‌రామ్, రైతు బీమాకు జై హింద్ అన్నట్లుగానే పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బాగుపడాలన్నా, రైతుల ముఖంలో చిరునవ్వులు రావాలన్నా, సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలన్నా కేసీఆర్ తిరిగి రావాల్సిందేనని అన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన దోచుకో-దాచుకో’ పథకం సింగరేణిలోనూ నడుస్తోందన్నారు.
వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కనీసం ఉలుకూ పలుకూ లేకుండా మౌనంగా ఉన్నదని అన్నారు. వేల కోట్ల దోపిడీపైన సీబీఐ ఎంక్వైరీ వేయమంటే పట్టించు కోవడంలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘ఆర్‌ఆర్’ టాక్స్ వసూలు చేస్తున్నారని, బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ చేస్తున్నారని ప్రధాని విమర్శిస్తారన్నారు. కానీ రాహుల్-రేవంత్ టాక్స్ పైన ఇప్పటిదాకా విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అటు హోంమంత్రి అమిత్ షా వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారిందని, అడ్డగోలుగా కుంభకోణాలు చేస్తోందని ధ్వజ మెత్తుతారని, ఒక్క విచారణకు ఎందుకు ఆదేశాలివ్వరని ప్రశ్నించారు.
నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన ఏసీబీ విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. రానున్న సింగరేణి ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించు కుందామని అన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం క్యాతన్‌పల్లిలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోరుకంటి చందర్, ఉమ్మడి అదిలాబాద్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, నాయకులు గుమ్మడి శ్రీనివాస్,అక్కూరి సుబ్బయ్య,వంగ తిరుపతి,రఫీక్ ఖాన్ పాల్గొన్నారు.



