Monday, April 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలు విఫలం

చర్చలు విఫలం

- Advertisement -

అమెరికావి గొంతెమ్మ కోరికలు..ఇరాన్‌
మా నిబంధనలను ఇరాన్‌ అంగీకరించలేదు : జేడీ వాన్స్‌
లెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దాడులు..ఆరుగురు మృతి
తదుపరి పరిణామాలపై ఉత్కంఠ

ఇస్లామాబాద్‌ : పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్‌, అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యా యి. సహేతుకం కాని డిమాండ్లను ముందుకు తెచ్చారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తమ నియమ నిబంధనలకు ఇరాన్‌ అంగీకరించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చెప్పగా అమెరికా చేసిన అర్ధం పర్ధం లేని డిమాండ్ల కారణంగానే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్‌ ఆరోపించింది. యుద్ధంలో సాధించలేని వాటిని అమెరికా ప్రస్తావించిందని దుయ్యబట్టింది. శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు ఇరాన్‌, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్షంగా జరిగిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి.

‘మేము ఒప్పందానికి రావడంలో విఫలమయ్యాం. ఇది దుర్వార్త. అమెరికాతో పోలిస్తే ఇరాన్‌కే ఇది మరింత దుర్వార్త అవుతుంది’ అని అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జేడీ వాన్స్‌ వ్యాఖ్యానించారు. 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత తొలిసారిగా అమెరికా, ఇరాన్‌ మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలు విఫలమైన తర్వాత స్వదేశానికి తిరుగు ప్రయాణం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ నిబంధనలకు ఇరాన్‌ అంగీకరించలేదని ఆరోపించారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, వాటిని త్వరితగతిన తయారు చేసేందుకు అవసరమైన ఉపకరణాలను పొందబోమని ఇరాన్‌ హామీ ఇస్తుందని భావించామని, కానీ అది జరగలేదని చెప్పారు. చర్చల సందర్భంగా తాము ఎంతో సానుకూలంగా వ్యవహరించామని చెప్పుకొచ్చారు.

మంచి ఉద్దేశంతో ఇస్లామాబాద్‌ వచ్చామని, ఒప్పందం కోసం ఎంతగానో ప్రయత్నించామని, అయితే దురదృష్టవశాత్తూ దానిని సాధించలేకపోయామని తెలిపారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోయినప్పటికీ తమ ప్రతిపాదనలపై స్పందించడానికి ఆ దేశానికి కొంత సమయం ఇస్తామని అన్నారు. సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ తమ మధ్య నెలకొన్న విభేదాలను ఇరు పక్షాలు పరిష్కరించుకోలేకపోయాయని, అందుకే ఒప్పందం కుదరలేదని చెప్పారు. తమకు అపూర్వ ఆతిథ్యమిచ్చిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, సైనిక దళాల ప్రధానాధికారి ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. చర్చల వివరాలను దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌, ఆర్థిక మంత్రి బెస్సెంట్‌లకు ఎప్పటికప్పుడు తెలియజేశామని వివరించారు. విలేకరుల సమావేశం తర్వాత వాన్స్‌ బృందం స్వదేశానికి బయలుదేరింది.

హార్ముజ్‌లో కదులుతున్న నౌకలు
ఇరాన్‌, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధిలో చమురు నౌకలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కదులుతున్నాయి. లిబియా పతాకంతో సెరిఫోస్‌, చైనా పతాకంతో కాస్పెరల్‌ లేక్‌, హీ రంగ్‌ హారు నౌకలు హర్మూజ్‌ను దాటాయి. వీటిలో ప్రతి నౌకకు రెండు మిలియన్‌ బ్యారల్స్‌ చమురును రవాణా చేయగల సామర్ధ్యం ఉంది. థాయిలాండ్‌కు చెందిన ఏడు చమురు నౌకలు ఇరాన్‌ అనుమతుల కోసం హర్మూజ్‌లో నిలిచి ఉండగా వాటిలో ఒకటైన సెరిఫోన్‌కు క్లియరెన్స్‌ లభించింది. ఈ నౌక సౌదీ అరేబియా నుంచి యూఏఈకి చమురును తీసుకొని మార్చిలో బయలుదేరింది. సెరిఫోన్‌ ఈ నెల 21న మలేసియాలోని మలక్కా ఓడరేవుకు చేరుకునే అవకాశం ఉంది. కాగా ఓషన్‌ థండర్‌ అనే నౌక ఇరాక్‌ ముడి చమురుతో గత వారమే హార్ముజ్‌ను దాటింది. ఇరాక్‌ చమురును రవాణా చేస్తున్న కాస్పరల్‌ లేక్‌ నౌక తూర్పు చైనాలోని జౌషన్‌ ఓడరేవుకు మే 1న చేరుకుంటుంది. సౌదీ ముడి చమురుతో హర్మూజ్‌ను దాటిన హీ రంగ్‌ హాయ్ నౌక ఎక్కడికి వెళుతోందో తెలియడం లేదు.

ఇరాన్‌కు ఆయుధాలిస్తే పెను సమస్యలు తప్పవు
చైనాకు ట్రంప్‌ బెదిరింపులు..
నిరాధార ఆరోపణలన్న బీజింగ్‌

ఇరాన్‌కు ఆయుధాలతో నింపిన నౌకలను సరఫరా చేస్తే ‘పెను సమస్యల’ను ఎదుర్కోవాల్సి వస్తుందని చైనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం బెదిరించారు. రాబోయే వారాలలో ఇరాన్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను, మాన్‌పాడ్స్‌ను (క్షిపణి విధ్వంసక వ్యవస్థలు) సరఫరా చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోందంటూ అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ బెదిరింపులకు దిగారు. ఒకవేళ చైనా ఆ పని చేస్తే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. అయితే దీనిపై ఆయన మరింత వివరణ ఏదీ ఇవ్వలేదు. ఇంటెలిజెన్స్‌ అంచనాలతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ఈ సమాచారాన్ని అందించింది.

తన ప్రమేయం బయటపడకుండా మూడో దేశం ద్వారా ఆయుధాలను సరఫరా చేయాలని చైనా భావిస్తోందని కూడా సీఎన్‌ఎన్‌ వివరించింది. కాగా యుద్ధంలో మాన్‌పాడ్స్‌ను ఉపయోగించిన ఇరాన్‌…తక్కువ ఎత్తులో ప్రయాణించిన అమెరికా యుద్ధ విమానానికి సమస్యలు సృష్టించింది. కాగా ఈ ఆరోపణలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు తీవ్రంగా ఖండించారు. యుద్ధంలో పాల్గొన్న వారెవ్వరికీ చైనా ఆయుధాలను అందించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిరాధార ఆరోపణలని, సంచలనం సృష్టించేందుకు ఉద్దేశించినవని అంటూ ఉద్రిక్తతలను నివారించేందుకు జరిగే ఏ ప్రయత్నానికి అయినా చైనా మద్దతు ఇస్తుందని తెలిపారు.

యుద్ధంలో 3,375 మంది ఇరాకీల మృతి
అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు మొదలైన తర్వాత కనీసం 3,375 మంది ఇరాకీలు మరణించారని ప్రభుత్వ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ (ఐఆర్‌ఐబీ) తెలిపింది. మృతులను ఇరాన్‌కు చెందిన ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. మృతులలో 2,875 మంది పురుషులు కాగా 496 మంది మహిళలు.

హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించండి
ట్రంప్‌ ఆదేశాలు
ఇరాన్‌తో చర్చలు విఫలమైన వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ”హర్మూజ్‌ను దిగ్బంధించాలని మా దేశ నౌకాదళాన్ని ఆదేశించాం. జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా లేదా నిష్క్రమించకుండా అమెరికా నౌకలు అడ్డుకోవడం మొదలుపెడతాయి. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడి స్తాం. చట్టవిరుద్ధమైన టోల్‌ చెల్లింపులు జరిపినా ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండదు. సరైన సమయంలో ఇరాన్‌ ను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.” అని పేర్కొన్నారు. హార్ముజ్‌ను తెరుస్తామని ఇరాన్‌ వాగ్దానం చేసింది. కానీ మాట తప్పింది.ఇరాన్‌ చర్యలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జలసంధిని వెంటనే తెరవాలి.. అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్‌ సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు బెడిసికొట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

మా విశ్వాసం పొందలేకపోయారు
ఇరాన్‌ స్పష్టీకరణ
పాకిస్తాన్‌లో అమెరికాతో చర్చల అనంతరం ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘలీబఫ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఓ ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్‌ ప్రతినిధి బృందంలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ”’చర్చల సమయంలో మా విశ్వాసాన్ని పొందడంలో అమెరికా విఫలమైంది. ఇరాన్‌ ప్రతినిధి బృందంలోని నా సహచరులు 168 నిర్మాణాత్మక చర్యలు సూచించారు. గత రెండు యుద్ధాల అనుభవాల దృష్ట్యా ఇరు పక్షాలు పరస్పర విశ్వాసాన్ని పొందలేకపోయాయి” అని రాసుకొచ్చారు. అయితే ఒప్పందానికి రెండు,మూడు కీలక అంశాలే అవరోధంగా మారాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖాయి తెలిపారు. కొన్ని అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినా, ఇతర అంశాలపై బిన్నాభిప్రాయాలు నెలకొన్నాయని వివరించారు. అయితే ‘దౌత్యం ఎన్నటికీ ముగియబోదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క సమావేశంలోనే ఒప్పందం కుదరదు కదా అని చెప్పారు.

లెబనాన్‌పై కొనసాగిన దాడులు
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో దాడుల ఉధృతి పెరిగింది. ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు రెండు లెబనాన్‌ పట్టణాలపై దాడులు చేశాయని లెబనాన్‌ మీడియా తెలిపింది. మారబ్‌ పట్టణంలో ఏడుగురు సభ్యులున్న ఓ కుటుం బం నివసిస్తున్న ఇంటిపై దాడి జరగగా కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. దక్షిణ లెబనాన్‌లోని జోయాలో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన రాకెట్‌ లాంఛర్‌ను ధ్వంసం చేశామని ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -