Monday, April 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసమానతలు తొలగించడమే కమ్యూనిస్టుల లక్ష్యం

అసమానతలు తొలగించడమే కమ్యూనిస్టుల లక్ష్యం

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పేదలకు గుండె బలం కమ్యూనిస్టులు : ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం
ఆదర్శ కమ్యూనిస్టు కల్లూరి యాదగిరి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
ఎల్లారెడ్డిగూడెంలో కల్లూరి యాదగిరి స్థూపం ఆవిష్కరణ

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆదివారం మాజీ వైస్‌ఎంపీపీ, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కల్లూరి యాదగిరి స్మారకస్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండాను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఎగురవేశారు. స్థూప ప్రహరీ ప్రాంగణాన్ని మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి దండు నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. కమ్యూనిస్టుగా జీవించడం అంత సులువైనది ఏమి కాదన్నారు. కల్లూరి యాదగిరి గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, వైస్‌ ఎంపీపీగా పని చేస్తూ ప్రజల సమస్యలే పరిష్కారమే పరమావధిగా పని చేశారన్నారు. మార్క్సిజం సిద్ధాంతాన్ని నమ్మి చాలామంది ప్రాణాలను బలిదానం చేశారని, అలాంటి కమ్యూనిస్టుల్లో ఒకరు కల్లూరి యాదగిరి అని కొనియాడారు. ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో చాలామంది ప్రాణాలు అర్పించి జెండాను ఎరుపెక్కించారని అన్నారు. నాడు చేసిన పోరాటాల స్ఫూర్తితో నేడు పోరాడుతున్నామని తెలిపారు.

దోపిడీి విధానం, అణీచివేత, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో యాదగిరి తిరగబడి పోరాడారని గుర్తు చేశారు. చరిత్రలో చిరస్మరణీయంగా ఉన్న తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో నేడు తెలంగాణలో అనేక విషయాలలో ఆదర్శవంతంగా ముందుందని తెలిపారు. బూర్జువా పార్టీలు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఆటంకాలు సృష్టించినా, ఎన్నికల్లో దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నప్పటికీ ఎర్రజెండా ముందుకెళుతుందంటే సిద్ధాంతంలో ఉన్న గొప్పతనమేనని తెలిపారు. ఈ దేశంలో ఇప్పటికీ కొద్ది మంది చేతుల్లోనే సంపద అంతా పోగు అవుతుందని అత్యధిక జనాభా చేతుల్లోకి సంపద రావడంలేదని చెప్పారు. సంపదను పంపిణీ చేయడంలో అన్యాయం జరుగుతుందని చెప్పారు. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, టీడీపీ వంటి బూర్జువా పార్టీలు ఉన్నంతకాలం ఈ అసమానతలు కొనసాగుతాయని చెప్పారు. ఈ అసమానత్వం తొలగించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం అని చెప్పారు.

మతతత్వ విముక్తి చేసేంతవరకు ఎర్రజెండా పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఒక కుటుంబం జీవనం సాగించాలంటే కనీసం నెలకు రూ.26,000 ఆదాయం ఉండాలని, అలా ఆదాయం లేకపోతే ఎలా జీవనం సాగిస్తాయని కోర్టులు ప్రశ్నిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. నేటి యువత డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసి ఉద్యోగాలు రాక అడ్డ మీద కూలీలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు తొలిగే వరకు పోరాటాలు చేయాలని అప్పుడే అమరులకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు.

పేదలకు గుండె బలం కమ్యూనిస్టులు : ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం
కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలే నేటి ప్రభుత్వాలకు ఏ జెండాలుగా మారుతున్నాయని పేదలకు గుండె బలం కమ్యూనిస్టులు అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కల్లూరి యాదగిరి ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారంగా నిస్వార్ధంగా పని చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు. కల్లూరి యాదగిరి మరణం కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి ఈ ప్రాంతానికి రాజకీయాలకతీతంగా అందర్నీ బాధించిందని తెలిపారు.. కమ్యూనిస్టులు బలపడితే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఆదర్శ కమ్యూనిస్టు కల్లూరి యాదగిరి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిన్నతనం నుంచి ఎర్రజెండాను అందిపుచ్చుకొని చివరి శ్వాస వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించిన ఘనత మాజీ వైస్‌ ఎంపీపీ కల్లూరి యాదగిరికే దక్కిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, వైస్‌ఎంపీపీగా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూనే పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. కుల మతాల కతీతంగా, పార్టీలకతీతంగా సేవలందించారని కొనియాడారు. ఎర్రజెండా సారథ్యం లో విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటాలు కొనసాగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, సయ్యద్‌ హశం, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట సరోజ, నగేశ్‌, మండలకార్యదర్శి చింతపల్లి బయన్న, ఎల్లారెడ్డిగూడెం, శేరిబాయిగూడెం గ్రామాల సర్పంచులు ఇల్లందుల లింగస్వామి భక్తుల అనంతరెడ్డి, మాజీ మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, కుమ్మరి దండు రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -