నవతెలంగాణ – హైదరాబాద్: పంట కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కోటా పూర్తయ్యిందనే సాకుతో కొనుగోళ్లు నిలిపివేయడంపై అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ, కేరళ పర్యటనల్లో బిజీగా ఉంటూ గాలి మోటార్లలో తిరుగుతున్నారని, వారికి నేల మీద ఉన్న రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. సదాశివపేట మార్కెట్‌లో ఇప్పటికే కొన్న శనగలను కూడా, బిల్లులు కావడం లేదనే సాకుతో బస్తాలు ఖాళీ చేసి రైతులకు వెనక్కి ఇచ్చేయడం అత్యంత దారుణమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 60 వేల క్వింటాళ్ల శనగలను వెంటనే రూ. 5,870 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ మాటను ‘బోగస్’ చేసిందని విమర్శించారు. కనీసం సన్న వడ్లకైనా బోనస్ ఇస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. మొక్కజొన్న, జొన్న, సన్ ఫ్లవర్ కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం 24 గంటల ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదని, కేవలం 10 గంటల కరెంటుతో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. “కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను కొనరు. ఈ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?” అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు.



