నవతెలంగాణ నోయిడా : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ కంపెనీ కార్మికులు జీతం పెంపుదలను డిమాండ్ చేస్తూ సోమవారం నిరసన చేపట్టారు. కంపెనీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఓ మహిళా ఉద్యోగినిపై పోలీసులు లాఠీఛార్జీ ప్రయోగించడంతో నిరసనకారులు ఆగ్రహావేశంతో పోలీసు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి హింసాత్మకంగా మారింది.
ఈ సందర్భంగా ఓ కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఎందుకు మా జీతాన్ని పెంచడం లేదు? మా జీతాన్ని 20 వేలకు పెంచుతామని ప్రభుత్వం హామీనిచ్చింది. ప్రభుత్వం మాకెందుకు జీతాలు పెంచడం లేదు? ఎందుకు పోలీసులు మహిళలపై లాఠీఛార్జీ ప్రయోగించారు. అసలు లాఠీఛార్జీ చేయాల్సిన అవసరం ఏమిటి? అని యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిరసనల వల్ల ఢిల్లీ- నోయిడా రహదాపై విపరరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొన్నారు. ఇక అక్కడి ప్రస్తుత పరిస్థితిపై ఓ సినియర్ పోలీసు అధికారి స్పందించారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అయినా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. గౌతమ్‌బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఘటన ఫేజ్ -2 ,సెక్టార్ 60-62 ప్రాంతాల్లో జరిగిందని పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి నోయిడాలో పోలీసులు భారీగా మోహరించారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా తమ వేతనాల్ని పెంచాలని ఈ ప్రాంతంలో గత నాలుగైదు రోజుల నుంచి కార్మికులు నిరసన చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన కూడా నోయిడాలోని ఫేజ్ -2లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు నిరసన చేపట్టారు. 14వేలుగా ఉన్న వారి జీతాన్ని 20వేలకు పెంచాలని శాంతియుతంగా జరుపుతున్న వారి నిరసనను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అప్పుడు కూడా వారు పోలీసులపై రాళ్లు రువ్వారు.



