నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఛాతీలో ఇన్ఫెక్షను కారణంగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా ఆమె అంత్యక్రియలు సోమవారం ముంబయిలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆమె అంత్యక్రియలకు భారీగా జనాలు తరలివచ్చారు. శివాజీ రోడ్డు మార్గంలో కిలో మీటర్లు మేర జనసంద్రంగా మారింది. చివరి సారిగా ఆమెను సందర్శించడానికి అభిమానులు పోటెత్తారు.
సుదీర్ఘ సంగీత ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించి భవిష్యత్ తరాలకూ మార్గదర్శిగానూ నిలిచారు. 1943లో గాయనిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆశాభోంస్లే నిరంతరాయంగా పాటలు పాడి బాలీవుడ్లో అగ్ర గాయనిగా పేరొందారు. హేమాహేమీల్లాంటి గాయనీ మణులున్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని 1000కి పైగా సినిమాల్లో 14 భాషల్లో దాదాపు 12,000కి పైగా పాటలు పాడి, అలరించారు. సినీ రంగానికి సంబంధించి ఎన్నో అవార్డులతో పాటు అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నీస్ బుక్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకున్న ఆశాభోంస్లే 1933లో మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే చిన్న గ్రామంలో సంగీత కుటుంబంలో జన్మించారు. నాన్న దిననాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిలో లతామంగేష్కర్ ఆశాభోంస్లే.. అక్కాచెల్లెళ్ళు. ఈ ఇద్దరికీ పుట్టుకతోనే సంగీతంపై మక్కువ ఉంది. చిన్నప్పట్నుంచి సరదాగా పాటలు పాడుతున్న క్రమంలో పదేళ్ల వయసులోనే అనుకోకుండా మరాఠీ సంగీత దర్శకుడు దత్తా దేవ్జేకర్ మరాఠీ చిత్రం ‘మజా బల్’ చిత్రంలో ‘చలా చలా నవ్ చలా’ అనే పాట పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాటకు మంచి ఆదరణ రావడంతో ఆ తర్వాత అడపాదడపా కొన్ని అవకాశాలు వచ్చాయి. కాని ఏదీ పెద్దగా పేరు తేలేకపోయాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.



