Wednesday, September 2, 2026
E-PAPER
Homeజిల్లాలుమా 1000 రోజుల అభివృద్ధి లెక్క ఇదిగో

మా 1000 రోజుల అభివృద్ధి లెక్క ఇదిగో

- Advertisement -


మీ పదేళ్ల లెక్క ఏమిటో చెప్పండి 
రూ.2,389 కోట్ల అభివృద్ధి.. శ్వేతపత్రంతో లెక్క చెబుతాం
10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా
విపక్షాలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సవాల్‌
కేఎల్‌ఐ, పాలమూరు-రంగారెడ్డి, వెలిగొండపై ఘాటు వ్యాఖ్యలు
 నవతెలంగాణ వనపర్తి  
   ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.2,389 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆరు గ్యారంటీల అమలుకు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, తమ ప్రభుత్వం 1000 రోజుల్లో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు గత పదేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. “మా 1000 రోజుల అభివృద్ధి లెక్క ఇదిగో.. మీ పదేళ్ల లెక్క ఏమిటో చెప్పండి” అంటూ ప్రతిపక్ష నేతలను నిలదీశారు.

కేఎల్‌ఐపై ఎవరి వాటా ఎంత?
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటూ చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే తిప్పికొట్టారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి హయాంలో డీ-5, డీ-8, బుద్ధారం ప్రాంతాల్లో వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు పనులు జరిగాయని పేర్కొన్నారు. కర్నెతండా, బుద్ధారం, ఖిల్లాఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌కు సంబంధించి సుమారు 45 వేల ఎకరాలకు నీరందించే పనులకు టెండర్లు పూర్తయ్యాయని, 50 శాతం పనులు గతంలో జరిగితే మిగిలిన పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తామే ప్రారంభించి పూర్తి చేశామని చెప్పుకోవడం సరికాదని, గతంలో చేసిన పనులకు ఇప్పుడు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. కేఎల్‌ఐలో 90 శాతం పనులు పూర్తయిన తర్వాత మిగిలిన 10 శాతం పనులు చేసి మొత్తం తామే పూర్తి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

నా డబ్బులు తినలేదంటే వెంకటేశ్వరస్వామి గుడికి రండి
తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపైనా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. “నేను కూలీని.. నా డబ్బులు పందికొక్కులు తిన్నారో లేదో తేల్చుకుందాం. వెంకటేశ్వరస్వామి గుడికి రండి.. నేను వస్తా.. మీరు సిద్ధమా?” అంటూ సవాల్‌ విసిరారు.తాను భూమి కొనుగోలు చేసిన విషయం వాస్తవమేనని, ఆ వ్యవహారానికి జెడ్పీటీసీ రఘపతిరెడ్డి సాక్షిగా ఉన్నారని చెప్పారు. 39 గుంటల భూమిని ఎవరి పేరున రాసి ఇవ్వమన్నా ఇస్తానని పేర్కొన్నారు. దీనిపై రఘపతిరెడ్డి మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వెలిగొండపై పదేళ్లలో ఏం చేశారు..?
వెలిగొండ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ గత పదేళ్లలో ఏం చేశారో ప్రతిపక్ష నేతలు సమాధానం చెప్పాలని మేఘారెడ్డి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, వెలిగొండ, కేఎల్‌ఐ ప్రాజెక్టుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణకు రూ.182 కోట్లు చెల్లించామని, అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు.

ప్రధాన నాయకుడు ఎక్కడ..?
బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే..“1000 రోజుల్లో 22 కోట్ల జీతం ఇచ్చాం.. 22 రూపాయల పని చేశారా?” అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం లోటుపాట్లను సరిచేస్తూ 76 వేల ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వేలాది పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు.పింఛన్ల విషయంలోనూ గత ప్రభుత్వాన్ని నిలదీశారు. వయస్సు పరిమితిని 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది ఎవరి ప్రభుత్వమో ప్రజలకు తెలుసన్నారు. ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేని వారు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

ప్రజల ముందే లెక్కలు తేల్చుకుందాం
డీసీసీ జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మేధావులమని చెప్పుకునే నాయకులు ప్రజలకు ఎలాంటి దారి చూపుతున్నారో ఆలోచించుకోవాలని అన్నారు.“మీకన్నా మేము మూడు ఆకులు ఎక్కువే చదువుకున్నాం. బూట్లు నాకే వ్యవస్థ ఎవరిదో ప్రజలకు తెలుసు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో అప్పుల చెల్లింపులకు భారీగా నిధులు వెచ్చిస్తూ, ఇరిగేషన్‌ రంగానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.పాలమూరు-రంగారెడ్డి, కేఎల్‌ఐ ప్రాజెక్టులను తామే ప్రారంభించి పూర్తి చేశామని చెప్పుకునే ముందు గత పదేళ్ల లెక్క చెప్పాలని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. వనపర్తి నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. 

     ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్. మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా పార్టీ కార్యవర్గం, కౌన్సిలర్లు, సర్పంచు లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -