Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాతబస్తీని టూరిస్ట్‌ హబ్‌గా మారుస్తాం

పాతబస్తీని టూరిస్ట్‌ హబ్‌గా మారుస్తాం

- Advertisement -

– గత ప్రభుత్వం నామమాత్రం పనులు చేసింది : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
– శాస్త్రీపురంలో ఆర్‌ఓబీ ప్రారంభం
నవతెలంగాణ- రాజేంద్రనగర్‌

హైదరాబాద్‌ పాతబస్తీని పూర్తిగా టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి నుంచి శాస్త్రిపురం- వట్టేపల్లి వరకు నిర్మించిన రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిని శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.71 కోట్లతో నిర్మించిన శాస్త్రీపురం ఆర్‌ఓబీ పనులను ప్రారంభించడంతో ఈ ప్రాంత ప్రజలు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం నామమాత్రం పనులు నిర్వహించి, చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తి పనులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తున్నామన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. శాస్తిపురం ఆర్‌ఓబీ పనులను త్వరగా పూర్తి చేయించి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎమ్మెల్యే పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మంత్రిని, ఎమ్మెల్యేను కలిసి సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మీర్జామత్‌ బేగ్‌, గ్రేటర్‌ కమిషనర్‌ కర్ణన్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ప్రేమ్‌దాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా సీనియర్‌ నాయకులు సామా ఇంద్రపాల్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షులు ధనుంజయ, ప్రేమ్‌గౌడ్‌, ఫయుం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -