నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి మూడు రోజులపాటు దేశరాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. సదస్సులో పాల్గొనేందుకు కూటమిలోని 11 సభ్యదేశాలతో పాటు ఇతర ప్రముఖులు హాజరకానున్నారు. అందుకు భారత్ మండపం వద్ద కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. అయితే భారత్ మండపానికి, ఎయిర్ పోర్ట్ నుంచి ఆయా మార్గాల్లో పేదల ఇండ్లు, మురికి వాడలు కన్పించడకుండా పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసింది మోడీ సర్కార్. ఈ చర్యలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ఖండించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. 18వ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలోని కీలక రవాణా మార్గాల వెంబడి ఉన్న మురికివాడలు, నిమ్న ఆదాయ వర్గాల నివాస ప్రాంతాలను కప్పిపుచ్చడానికి పెద్ద తెరలు, తాత్కాలిక బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. పేదరికాన్ని పరిష్కరించడం కంటే, పర్యటనకు వచ్చే విదేశీ ప్రముఖుల నుండి భారతదేశ సామాజిక-ఆర్థిక వాస్తవాలను దాచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో పొస్టు చేశారు.



