– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్
– తాళ్లమడలో ఏచూరి 2వ వర్ధంతి సభ
నవతెలంగాణ – సత్తుపల్లి
ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడమే సీతారాం ఏచూరికి మనమిచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ అన్నారు. సత్తుపల్లి మండలం తాళ్లమడలో శనివారం సీపీఐ(ఎం) పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సంతాప సభను జరిపారు. ఈ సంతాప సభలో జాజిరి శ్రీనివాస్ మాట్లాడారు. చిన్ననాటి నుంచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వంటబట్టించుకున్న సీతారాం ఏచూరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం ఉద్యమ బాటలోనే పయనించారని కొనియాడారు.
రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. జేఎన్యూ విద్యార్థిగా ఉన్నప్పుడే నాటి ప్రధాని ఇందిరా గాంధీని ప్రశ్నించిన ధీశాలి ఏచూరి అని కొనియాడారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయ పరిరక్షణకు ఏచూరి కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు వామపక్ష ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, తడికమళ్ల రామకృష్ణ, కొలికపోగు జగపతిరావు, నాగళ్ళ ముత్తయ్య, అయినంపూడి లక్ష్మిీ, భాస్కరరావు, రాజేష్, పద్మ, సుజాత, వసంతరావు, గణేష్, దర్శనం సతీష్, రాములు పాల్గొన్నారు.



