- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-హైదరాబాద్: సీతారాం ఏచూరి జీవితం యావత్ శ్రామిక లోకానికి మార్గదర్శకమని, ఆయన లేని లోటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కాకినాడలో జన్మించి, హైదరాబాద్, ఢిల్లీలో విద్యనభ్యసించి, దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు.సీపీఐ(ఎం) అఖిల భారత పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమం పార్టీ కేంద్రకమిటీ సభ్యులు టి జ్యోతి అధ్యక్షతన శనివారం ఎంబీ భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… రాజ్యసభలో ప్రజల గొంతుకగా నిలిచి శ్రామిక వర్గాల హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ధీశాలి ఆయన. దేశంలో మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్ దోపిడీ పెరిగిపోతున్న తరుణంలో లౌకిక శక్తుల ఐక్యత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ప్రస్తుతం దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేదరికం, నిరుద్యోగం, కుల-మత అసమానతలు పెరిగిపోతున్నాయి.
ప్రజల ఓటు హక్కును సైతం నిర్వీర్యం చేసే కుట్రను కేంద్ర బిజేపి ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచ చరిత్రలోనే సాటిలేని రైతాంగ సాయుధ పోరాటంగా వీర తెలంగాణ పోరాటం నిలిచింది. నిజాం నవాబుల నిరంకుశ పాలనకు, రజాకార్ల అరాచకాలకు, భూస్వాముల దొరల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పేద రైతులు, కూలీలు తిరగబడ్డారు.
తెలంగాణ వీర రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి మనకు ఎప్పుడూ ప్రేరణే. నైజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ప్రాణాలర్పించారు. ఆ చారిత్రక పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, సోషలిస్ట్ సమాజ నిర్మాణమే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయ సాధన కోసం శ్రామిక వర్గాలు, అణగారిన తరగతులు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ… సీతారాం ఏచూరి అడుగుజాడల్లో దేశ లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రస్తుత రాజకీయాల్లో ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. జెఎనీు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, దేశంలో మతోన్మాద శక్తుల విధానాలను పార్లమెంటు లోపలా, బయటా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండగట్టిన గొప్ప నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ఏచూరి చూపిన మార్గమే మనకు మార్గం అని స్పష్టం చేస్తూ, ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, జాతీయ నాయకులు బి వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబూరావు, బి ప్రసాద్, ప్రజారంగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




