నవతెలంగాణ – హైదరాబాద్ : వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు భారత ఐఎండీ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో నేటి నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీరాల వైపు కదులుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పుంజుకుంటాయని అంచనా వేసింది.
ఈ వానాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణం కన్నా 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ కొత్త అల్పపీడనంతో ఆ లోటు కొంతవరకు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నేడు, రేపు.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తర్వాతి రోజుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా మరిన్ని జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తించనున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రుతుపవనాల తిరోగమనం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



