Monday, September 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకాళ్లబేరానికి..

కాళ్లబేరానికి..

- Advertisement -

చైనాపై ట్రంప్‌ వైఖరిలో ఇంత మార్పు ఎందుకు?
చైనాను అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా అభివర్ణించిన ట్రంప్‌
ఇప్పుడు షీ జిన్‌పింగ్‌తో స్నేహపూర్వక వైఖరి
ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వైఖరిలో మార్పు

బెడిసికొట్టిన సుంకాల వ్యూహం

వాషింగ్టన్ : ఒకప్పుడు చైనా పేరు చెబితేనే అమెరికా ప్రయోజనాలకు ముప్పు అంటూ విరుచుకుపడిన డోనాల్డ్ ట్రంప్, ఇప్పుడు అదే దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఒకప్పుడు చైనా వల్ల అమెరికా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, అమెరికన్ల ఉద్యోగాలు పోయాయని విమర్శించిన ట్రంప్, ఇప్పుడు జిన్‌పింగ్‌ను ‘గొప్ప వ్యక్తి’గా అభివర్ణిస్తున్నారు. ఈ నెల 24న జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు రానుండటంతో వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్‌-జిన్‌పింగ్‌ సంబంధాల్లో వచ్చిన ఈ మార్పు వెనుక ప్రధానంగా వాణిజ్య పోరాటం, చైనా ఆర్థిక బలం, అరుదైన ఖనిజాలపై ఆ దేశ ఆధిపత్యం, ఏఐ వంటి కొత్త సాంకేతిక రంగాల్లో పోటీ ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.

అప్పట్లో చైనాపై తీవ్ర విమర్శలు
ట్రంప్‌ తొలిసారి అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలో చైనాను అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా చూపించారు. చౌకైన చైనా ఉత్పత్తుల కారణంగా అమెరికా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే వైఖరిని కొనసాగించారు. చైనా నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా ఉపయోగించకుండా ఎగుమతి నియంత్రణలు కూడా పెట్టారు. చైనా విధానాలను మార్చేలా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
అయితే ఈ వ్యూహం అనుకున్నంతగా పనిచేయలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అరుదైన ఖనిజాల విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం అమెరికాపై ఒత్తిడి పెంచే సాధనంగా మారింది. ఎలక్ట్రానిక్స్ సహా అనేక ఆధునిక పరిశ్రమలకు అవసరమైన ఈ ఖనిజాల సరఫరాలో చైనా కీలక స్థానంలో ఉంది. దీంతో సుంకాల పోరులో అమెరికా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

జిన్‌పింగ్‌తో స్నేహం ఎందుకు?
ఇదే సమయంలో ట్రంప్‌ జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నెలలోనే చైనా అధ్యక్షుడిని గొప్ప వ్యక్తిగా పేర్కొంటూ తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చైనా నుంచి అమెరికాకు వస్తున్న వస్తువులపై సుంకాలు కొనసాగుతున్నప్పటికీ, వాణిజ్య రంగంలో ఇరు దేశాలు పూర్తిస్థాయి ఘర్షణకు వెళ్లకుండా చర్చల మార్గంలో కొనసాగుతున్నాయి. చైనా కూడా ఇతర దేశాల ద్వారా తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు పంపిస్తూ సుంకాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకుంటోందన్న విశ్లేషణలు ఉన్నాయి. చైనా తయారీ రంగం కూడా సుంకాల కారణంగా పూర్తిగా వెనక్కి తగ్గలేదు. బదులుగా ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లను సంపాదించుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాలు సహా తక్కువ ధరలో వస్తువులను ప్రపంచ మార్కెట్‌కు పంపుతోంది. 2025లో చైనా ప్రపంచ వాణిజ్య మిగులు సుమారు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు ఓ నివేదిక పేర్కొంది.

అమెరికా మిత్రదేశాల విషయంలోనూ మార్పు
మరోవైపు చైనాను ఎదుర్కొనే విషయంలో అమెరికాకు గతంలో ఉన్న మిత్రదేశాల సమన్వయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్‌ కెనడా, నాటో దేశాలు, ఫ్రాన్స్‌ వంటి మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రత తదితర అంశాల్లో విభేదాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా-చైనా పోటీని ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కు చెందిన మైఖేల్ కోవ్రిగ్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, చైనాతో సంబంధాలను స్థిరపర్చుకోవడానికి కొన్ని పశ్చిమ దేశాలు బీజింగ్‌తో చర్చలకు ఆసక్తి చూపుతున్నాయి.

ఏఐలోనూ ఇదే పోటీ
ఇప్పుడు అమెరికా-చైనా పోటీ కేవలం వాణిజ్యానికి పరిమితం కాలేదు. కృత్రిమ మేధస్సు, అధునాతన కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. చైనా ఏఐ సంస్థలు అమెరికా మోడళ్ల నుంచి సాంకేతిక సామర్థ్యాలను పొందుతున్నాయన్న ఆరోపణలు అమెరికాలో ఉన్నాయి. చైనా మాత్రం ఇలాంటి ఆరోపణలను తిరస్కరిస్తోంది. మరోవైపు ట్రంప్‌ ఏఐ అభివృద్ధిలో అమెరికా వెనుకబడకూడదని స్పష్టం చేస్తున్నారు. చైనాను మించి ఉండాలంటే ఏఐ అభివృద్ధిని వేగంగా కొనసాగించాల్సిందేనన్నది ఆయన వాదన.

ఎల్‌ఎన్‌జీ సుంకాల తగ్గింపుపై అమెరికా, చైనా చర్చలు
విస్తృత ఇంధన, వ్యవసాయ ఒప్పందాల ప్యాకేజీలో భాగంగా అమెరికా ఎల్‌ఎన్‌జీపై చైనా విధించిన సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడంపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వారం అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఒప్పందాల ప్యాకేజీని ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సుంకాలపై రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అమెరికా, చైనా దేశాలు చెరో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలను తగ్గించుకుంటాయని, దీనికి సంబంధించిన వివరాలతో పాటు అమెరికా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతులపై చైనా విధిస్తున్న సుంకాలను తగ్గించే విషయంపై కూడా చర్చ జరుగుతోందని అధికార వర్గాలు చెప్పాయి.తన వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా చైనా కూడా గ‌తేడాది ఫిబ్రవరిలో అమెరికా ఎల్‌ఎన్‌జీపై 15 శాతం టారిఫ్ విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఎలఎన్‌జీ వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. చైనాతో ఏండ్ల తరబడి కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచంలోని అతి పెద్ద ఎల్‌ఎన్‌జీ మార్కెట్లలో ఒకటి అమెరికాకు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో గల్ఫ్ తీరం వెంబడి అమెరికా కొత్తగా ఓ ఎగుమతి కేంద్రాన్ని నిర్మిస్తోంది. కాగా ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ఈ నెల 24న సమావేశం జరగబోతోంది. దానికి ముందే వాణిజ్య సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నాలలో భాగంగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

జిన్‌పింగ్‌ పర్యటనలో ఏం జరుగుతుంది?
సెప్టెంబర్‌ 24న జిన్‌పింగ్‌ వైట్‌హౌస్‌కు రానున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఏఐ వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా కొన్ని వస్తువులపై సుంకాల విషయంలో సడలింపులను పరిశీలిస్తున్నప్పటికీ.. అరుదైన ఖనిజాలపై ఎగుమతి నియంత్రణలను పూర్తిగా తొలగించే విషయంలో మాత్రం స్పష్టత లేదు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు, మరో దేశాధ్యక్షుడి మధ్య జరిగే అధికారిక పర్యటనలకు కొన్ని స్పష్టమైన ఒప్పందాలు లేదా విధానపరమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈసారి అలాంటి స్పష్టమైన ఫలితాలు ఏ మేరకు వస్తాయన్నది ఇంకా తేలలేదు. అంటే ట్రంప్‌ చైనాపై పాత తరహా ఒత్తిడి వ్యూహాన్ని పూర్తిగా వదిలేశారని చెప్పలేం. సుంకాలు, సాంకేతిక నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అదే సమయంలో జిన్‌పింగ్‌తో వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అమెరికా-చైనా మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ, దాన్ని నిర్వహించేందుకు ట్రంప్‌ ఇప్పుడు ఘర్షణతో పాటు సంబంధాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -